పెరుగుతున్న పసిడి చోరీలు
Published Wed, Sep 25 2013 2:11 AM | Last Updated on Fri, Sep 1 2017 11:00 PM
సాక్షి, న్యూఢిల్లీ: పసిడి ధరలతోపాటు దేశరాజధానిలో బంగారం చోరీ కేసులూ పెరుగుతున్నాయి. సాధారణ బంగారు దిగుమతుల ముసుగులో కొన్ని ముఠాలు అక్రమంగా రవాణా చేస్తున్న ఘటనలు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఎక్కువగా నమోదవుతున్నాయి. కస్టమ్స్ అధికారులు చెబుతున్న ప్రకారం ఈ ఏడాది ఇప్పటికే రూ.10 కోట్ల విలువైన 36 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమంగా సరఫరా చేస్తున్న కేసులు సైతం గతేడాదితో పోలిస్తే ఆరు రెట్లు పెరిగినట్టు పేర్కొన్నారు. రూ.రెండు కోట్ల విలువ చేసే ఆరుకిలోల బంగారాన్ని గత ఆర్థిక సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తుండగా ఒకేసారి 21 మందిని అరెస్టు చేసినట్టు సీనియర్ కస్టమ్స్ అధికారి తెలిపారు.
పద్ధతి మారింది:
కాలం మారుతున్న కొద్దీ దొంగరవాణా ముఠా సభ్యుల ఆలోచనా విధానంలోనూ మార్పులు వస్తున్నాయని కస్టమ్స్ అధికారి ఒకరు తెలిపారు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. 1980, 90ల్లో బంగారు అక్రమ రవాణా చేసే దొంగలు ప్రత్యేకంగా తయారు చేసుకున్న వాళ్ల బూట్లలో వీటిని తరలించేవారు. ఆ తర్వాత ఎక్కువ మంది అక్రమార్కులు తమ లోదుస్తుల్లో వీటిని తరలించే యత్నం చేస్తున్నట్టు గుర్తించారు. ఇప్పుడు వీరి ఆలోచనా విధానం మారింది. ఎక్కువ ఘటనల్లో బంగారాన్ని ఆభరణాల రూపంలో మార్చి వాటినే ధరించి దర్జాగా బంగారాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారిని ఎప్పటికప్పుడు గుర్తించి అరెస్టు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉంటున్నారు. ఎక్కువ ఆభరణాలతో వచ్చే మహిళలపై ప్రత్యేకంగా నిఘా పెడుతున్నట్టు తెలిపారు. అయితే ప్రతి ప్రయాణికుడినీ తనిఖీ చేయడం తమకు సాధ్యమయ్యే పనికాదని ఆయన పేర్కొన్నారు. కొందరు విమాన సిబ్బంది సైతం ఇందులో పాల్గొంటున్నట్టు తమ వద్ద సమాచారం ఉందన్నారు. మహిళలు రూ.20 వేల నుంచి రూ.11 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు తీసుకెళ్లేందుకు వీలుందన్నారు. పురుషులకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు విలువ చేసే ఆభరణాలు తీసుకెళ్లవచ్చు.
పెరుగుతున్న ఘటనలు:
బంగారు గొలుసులు, గాజులు కలిపి రూ.40 లక్షల విలువైన 1.67 కేజీల బంగారాన్ని తరలిస్తున్న అఫ్ఘాన్ మహిళను ఐజీఐలో అరెస్టు చేశారు. అంతకుమందు ఓ ప్రయాణికుడు రూ.20 లక్షల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా దొరికిపోయాడు. అదేరోజు రూ.50 లక్షల విలువైన బంగారాన్ని కాళ్ల చుట్టూ కట్టుకుని వెళుతున్న ఒకరిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పసుపురంగు కాగితంలో చుట్టి ఉన్న 448 గ్రాముల బంగారు కడ్డీలను తరలించేందుకు ప్రయత్నిస్తున్న నిందితుణ్ని ఎయిర్‌పోర్టు వాష్‌రూంలో అరెస్టు చేశారు. ఇటీవల జరిగిన ఘటనలో కిలో బంగారు కడ్డీలను శరీరంలో దాచుకుని తరలిస్తుండగా ఒకరిని అరెస్టు చేసినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఎక్కువ ఘటనలు ఢిల్లీ ఎయిర్‌పోర్టులోనే జరగడంతో వారు నిఘాను మరింత పటిష్టం చేశారు.
Advertisement