బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమి? | RK Nagar by-elections BJP Candidate in Actress Gautami | Sakshi
Sakshi News home page

బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమి?

Published Wed, Mar 15 2017 10:39 PM | Last Updated on Wed, Apr 3 2019 9:05 PM

బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమి? - Sakshi

బీజేపీ అభ్యర్థిగా నటి గౌతమి?

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఉత్తరాది ఎన్నికల ప్రభంజనంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ దక్షిణాది వైపు చూస్తుండగా, ఆర్కేనగర్‌ ఉపఎన్నికల్లో నటి గౌతమిని అభ్యర్థిగా దింపేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఆర్కేనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీకాగా, ఈ స్థానాన్ని భర్తీ చేసేందుకు వచ్చేనెల 12వ తేదీన ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఈనెల 16వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతాయి.


అధికార అన్నాడీఎంకే తరఫున ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ అన్నానగర్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అటు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కూడా బరిలో నిలబడతున్నట్లు ప్రకటించారు. ఇక డీఎంకే మాత్రం ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. జయ మరణంతో అన్నాడీఎంకేలో నాయకత్వ సమస్య, రెండుగా చీలిపోవడం తదితర సమస్యలు డీఎంకేకు అనుకూలిస్తాయని అంటున్నారు. దీంతో అభ్యర్థి ఎంపికలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ మరింత శ్రద్ధచూపుతున్నారు. పార్టీ అధ్యక్షులు కరుణానిధి సలహాసైతం తీసుకుంటున్నట్లు సమాచారం.

గౌతమి రంగప్రవేశం:
కమల్‌తో సహజీవనానికి దూరంగా రాజకీయాలకు దగ్గరగా తన జీవితాన్ని మార్చుకున్న నటి గౌతమి ప్రత్యక్ష రాజకీయాల్లో కాలుమోపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కమల్‌తో విభేదించి వేరు కాపురం పెట్టిన నాటి నుంచి గౌతమి రాజకీయ విమర్శలు చేయడం ప్రారంభించారు. అన్నికంటే ముఖ్యంగా జయలలిత మరణం అనుమానాస్పదమని పదే పదే విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీను సైతం కలిసారు. సీబీఐ లేదా న్యాయవిచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. కమలనాథుల తెరవెనుక ప్రోత్సాహం ఉందనేలా గౌతమి రాజకీయాలు సాగుతున్నాయి.

ఈ తరుణంలో అర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గౌతమి పేరు పరిశీలనలో ఉన్నట్లు కమలనాథుల సమాచారం. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ జయభేరి మోగించడం దేశం యావత్తును ఆకర్షించింది. ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభంజన ప్రభావం ఎంతోకొంత తమిళనాడుపై కూడా పడి ఉంటుందని విశ్వసిస్తున్నారు. దీనికి తోడు సినీరంగం నుంచి వచ్చిన జయలలిత ప్రాతినిథ్యం వహించిన స్థానంలో నటి గౌతమిని నిలబెడితే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని కమలనాథులు అంచనావేస్తున్నారు. అయితే గౌతమి అభ్యర్థిత్వంపై అధికారికంగా ఎవ్వరూ నోరుమెదపడం లేదు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు ప్రారంభం:రాజకీయ పార్టీల హాడివుడి అలా ఉండగా మంగళవారం నుంచి అధికారుల హడావుడి మొదలైంది. ఆర్కేనగర్‌లో ఎన్నికల పోలింగ్‌కు మరో నాలుగువారాలు మాత్రమే గడువుండగా ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు రంగంలోకి దిగారు. నగదు బట్వాడా, శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా వాహనాల తనిఖీలు ప్రారంభించారు. ఆర్కేనగర్‌లోకి ప్రవేశించి అన్ని మార్గాల్లోనూ కాపువేసి కార్లు, ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేపట్టారు. కేంద్ర పారా మిలిటరీ దళాలు వచ్చేవారం చెన్నైకి చేరుకోనున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement