► కేంద్రం నిర్ణయంపై సర్వత్రా నిరసన
► నేడు స్టాలిన్ ఆందోళన
► జల్లికట్టు కోసం పోరాటాలు
పొంగల్ పండుగ సెలవులు, జల్లికట్టు క్రీడలపై రాష్ట్రం అట్టుడికిపోతోంది. రెండు అంశాల్లోనూ కేం ద్రం వైఖరిని ఎండగడుతున్నారు. పొంగల్ పండుగకు ఏటా ఇచ్చే సాధారణ సెలవును ఐచ్చిక సెలవు(ఆప్షనల్ హాలిడే)గా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం రాష్ట్రం లో సెగలు పుట్టించింది. ప్రజలను ఆగ్రహోదగ్రులను చేయగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సంయుక్తంగా పోరుబాట పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజలకు పొంగల్ అత్యంత ప్రధానమైన పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్వగ్రామాలకు వెళ్లి బంధుమిత్రులతో సందడి చేసుకుంటారు. అయితే ఈసారి ఆ వెసులుబాటు లేకుండా పండుగ జరుపుకునే వారు మాత్రమే సెలవు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షరతు విధించడం విమర్శలకు దారితీసింది. దీంతో ఉద్యోగులు, ప్రజలు పోరుబాట పట్టారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ మంగళవారం చెన్నై మైలాపూరు, టీ నగర్ పోస్టల్ కార్యాలయాల వద్ద ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. నుంగంబాక్కంలోని శాస్రి్తభవన్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నిరసన ప్రదర్శన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మహాసమ్మేళన్ తరఫున చెన్నై చేపాక్ సమీపంలో సాయంత్రం ఆందోళన నిర్వహించారు. ఇదిలా ఉండగా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ నేతృత్వంలో బుధవారం చెన్నై వల్లువర్‌కోట్టం వద్ద ధర్నా చేపట్టనున్నారు. పొంగల్ సెలవును సాధారణ సెలవుల్లో చేర్చాలని కోరుతూ సీఎం పన్నీర్‌సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ప్రధానికి లేఖలు రాశారు. పీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు అన్బుమణి, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో కూడా ప్రధానికి లేఖలు రాశారు. సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్, తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్, వామపక్షాలు సైతం కేంద్రాన్ని తప్పుపట్టారు.
సెలవుపై రాజకీయమా: కేంద్ర మంత్రి పొన్
పొంగల్ పండుగ రెండో శనివారం రావడం వల్లనే సాధారణ సెలవు దినంగా ప్రకటించలేదని, కొన్ని పార్టీలు ఉద్దేశపూర్వకంగా రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ చెప్పారు. ఎనిమిదేళ్లుగా ఏ కేటగిరిలో ఉందో నేడు అలానే కొనసాగుతోందని ఆయన వివరించారు. కాంగ్రెస్, డీఎంకే హయాంలో జరిగిన తప్పులను సరిచేసేందుకు శ్రమించాల్సి వస్తోందని జల్లికట్టు అనుమతులపై పొన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, డీఎంకేలు చేసిన తప్పును అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రతిఘటించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై ఆరోపించారు.
జల్లికట్టు కోసం...
ఇదిలా ఉండగా, పొంగల్ పండుగ సమయంలో జరుపుకునే సంప్రదాయ జల్లికట్టు క్రీడకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనలు చేస్తున్నారు. జల్లికట్టు క్రీడాకారులేగాక విద్యార్థినీవిద్యార్థులు సైతం జల్లికట్టు కోసం పట్టుబడుతున్నారు. పుదుక్కోట్టై, కుంభకోణం, శివగంగై, కారైక్కుడి, మధురై, సేలం తదితర ప్రాంతాల్లో మంగళవారం ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. జల్లికట్టు ఆందోళనలకు పెద్ద సంఖ్యలో తరలి రావాల్సిందిగా సినీ దర్శకుడు గౌతమన్ యువకులకు పిలుపునిచ్చారు. జల్లికట్టుపై నిషేధంపై కాంగ్రెస్‌ను నిందించడం సరికాదని టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కు హితవు పలికారు.