బెంగళూరులో వీజీ సిద్ధార్థ నివాసం వద్ద ఐటీ అధికారులు, పోలీసులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్.ఎం కృష్ణ అల్లుడు, కెఫే కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఇళ్లు, కార్యాలయాల్లో జరుగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ముగిశాయి. గురువారం నుంచి జరిగిన ఈ సోదాల్లో దాదాపు రూ.650 కోట్ల కంటే ఎక్కువ స్థిర చరాస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిద్ధార్థ కాఫే కాఫీ డేతో పాటు పలు టూరిజం, ఐటీ సంస్థలను నడుపుతున్నారు. నోట్ల రద్దు జరిగిన సమయంలో ఆయా సంస్థల నుంచి పెద్ద ఎత్తున వివిధ బ్యాంకుల్లో సొమ్ములను డిపాజిట్ చేసినట్లు ఐటీ అధికారులకు ఉప్పందింది. ఈ నేపథ్యంలో బెంగళూరు, హాసన్, చిక్‌మగుళూరు, చెన్నై, ముంబైలోని సిద్ధార్థకు చెందిన కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
‘సిద్ధార్థకు సంబంధించిన కాఫీ టూరిజం, ఇన్పర్మేషన్ టెక్నాలజీ, ఇతర కార్యాలయాల్లో సోదాలు జరిపాం. రూ.650 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించాం. మరిన్ని ఆస్తులు వెలుగు చూసే అవకాశముంద’ని ఆదాయపన్ను శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీ దాడులపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఎంఎస్ కృష్ణ ఇంకా స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ల పాటు కొనసాగిన ఎంఎస్ కృష్ణ ఇటీవలే బీజేపీలో చేరారు. అంతకుముందు కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఐటీ శాఖను అడ్డుపెట్టుకుని తమ నాయకులపై రాజకీయ కక్ష సాధిస్తోందని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది. ఎంఎస్ కృష్ణ అల్లుడిపైనా ఐటీ దాడులతో కేంద్రం ప్రమేయం లేదని రుజువైందని బీజేపీ అంటోంది.