భివండీ, న్యూస్‌లైన్: కరెంటు చార్జీల పెంపు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం భివండీ వస్త్ర పరిశ్రమల యజమానులు ఈ నెల ఆరు నుంచి బంద్ పాటించడంతో మరమగ్గాలకు తీవ్రనష్టాలు వాటిల్లుతున్నాయి. పట్ణంలోని దాదాపు ఏడు లక్షల మగ్గాలు మూలనబడడంతో నిత్యం రూ.90 కోట్ల నష్టం వాటిల్లుతోందని స్థానిక ఎంపీ సురేశ్ ఠావురే పేర్కొన్నారు. 12 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడి పరిశ్రమలు శాశ్వతంగా మూతబడే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మరమగ్గాల పరిశ్రమల సమస్యలపై ప్రభుత్వం ఎంతమాత్రమూ స్పందించడం లేదని ఠావురే విమర్శించారు.
స్వగ్రామాలకు పయనం..
బంద్ కారణంగా భివండీ స్తంభించడంతో కార్మికులు ఏం చేయాలో తోచక స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. పరిశ్రమలు యంత్రాలను నిలిపివేయడంతో కార్మికులకు పనిలేకుండాపోయింది. బంద్ కొనసాగినంత కాలం వారికి భృతి ఇవ్వాలని భివండీ కామ్‌గార్ సంఘర్షణ సమితి కార్యదర్శి విజయ్ ఖానే యాజమాన్యాలను డిమాండ్ చేశారు. కార్మికుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో వారిలో చాలా మంది యజమానుల నుంచి జీతాలు తీసుకొని స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. కళ్యాణ్ రైల్వే స్టేషన్‌లో నిత్యం ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకకు వెళ్లే కార్మికులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. గతంలో సేల్స్‌ట్యాక్స్, ఎల్బీటీ, టోరెంట్ పవర్ కంపెనీ అధిక చార్జీల విధింపు వంటి సమస్యలు ఎదురైతే ఆందోళనకు దిగిన యజమానులకు కార్మికులు సహకరించారు. ఇప్పుడు మాత్రం వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఖానే అన్నారు.
మరమగ్గాల సమ్మెతో రోజుకు రూ.90 కోట్ల నష్టం
Published Fri, Nov 8 2013 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 12:25 AM
Advertisement
Advertisement