suresh thakur
-
భివండీ ఆందోళన మరింత తీవ్రం
భివండీ, న్యూస్‌లైన్: భివండి పవార్‌లూమ్ పరిశ్రమల యజమానులు చేపట్టిన ఆందోళన ఆరో రోజుకు చేరింది. వీరి డిమాండ్ల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో సోమవారం ఆందోళనను మరింత తీవ్రం చేశారు. భీవండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అశోక్‌నగర్ నుంచి టోరంటో నోడల్ కంపెనీ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పవార్‌లూమ్స్ యజమానులు పాల్గొన్నారు. విద్యుత్ వితరణ కంపెనీకి చెందిన నోడల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, విద్యుత్ రేట్లు తగ్గించాలని, టోరంట్ కంపెనీని భివండీ నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో కూడిన ఓ విన్నతిపత్రాన్ని నోడల్ అధికారి పరస్బి జాడ్కర్కు అందించారు. ఈ ర్యాలీలో భీవండీ పవర్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు, ఎంపీ సురేష్ టావ్రే, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రశీద్ తాహిర్, శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రేతోపాటు పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు. న్యాయం చేసేందుకు కృషి చేస్తా: సీఎం భివండీ పవార్‌లూమ్స్ యజమానుల సమస్యలపై సంఘర్ష్ సమితి అధ్యక్షులైన ఎంపీ సురేష్ టావ్రే సోమవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవార్‌లూమ్స్ యజమానులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు టావ్రే తెలిపారు. పవార్‌లూమ్స్ యజమానులు, సంఘర్ష్ సమితి పదాధికారులతోపాటు టొరంటో కంపెనీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని టావ్రే ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
మరమగ్గాల సమ్మెతో రోజుకు రూ.90 కోట్ల నష్టం
భివండీ, న్యూస్‌లైన్: కరెంటు చార్జీల పెంపు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం భివండీ వస్త్ర పరిశ్రమల యజమానులు ఈ నెల ఆరు నుంచి బంద్ పాటించడంతో మరమగ్గాలకు తీవ్రనష్టాలు వాటిల్లుతున్నాయి. పట్ణంలోని దాదాపు ఏడు లక్షల మగ్గాలు మూలనబడడంతో నిత్యం రూ.90 కోట్ల నష్టం వాటిల్లుతోందని స్థానిక ఎంపీ సురేశ్ ఠావురే పేర్కొన్నారు. 12 లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇక్కడి పరిశ్రమలు శాశ్వతంగా మూతబడే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. మరమగ్గాల పరిశ్రమల సమస్యలపై ప్రభుత్వం ఎంతమాత్రమూ స్పందించడం లేదని ఠావురే విమర్శించారు. స్వగ్రామాలకు పయనం.. బంద్ కారణంగా భివండీ స్తంభించడంతో కార్మికులు ఏం చేయాలో తోచక స్వగ్రామాలకు తరలి వెళ్తున్నారు. పరిశ్రమలు యంత్రాలను నిలిపివేయడంతో కార్మికులకు పనిలేకుండాపోయింది. బంద్ కొనసాగినంత కాలం వారికి భృతి ఇవ్వాలని భివండీ కామ్‌గార్ సంఘర్షణ సమితి కార్యదర్శి విజయ్ ఖానే యాజమాన్యాలను డిమాండ్ చేశారు. కార్మికుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో వారిలో చాలా మంది యజమానుల నుంచి జీతాలు తీసుకొని స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. కళ్యాణ్ రైల్వే స్టేషన్లో నిత్యం ఆంధ్రప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకకు వెళ్లే కార్మికులు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. గతంలో సేల్స్‌ట్యాక్స్, ఎల్బీటీ, టోరెంట్ పవర్ కంపెనీ అధిక చార్జీల విధింపు వంటి సమస్యలు ఎదురైతే ఆందోళనకు దిగిన యజమానులకు కార్మికులు సహకరించారు. ఇప్పుడు మాత్రం వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని ఖానే అన్నారు.