సాక్షి, ముంబై: సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా అనేక అవకతవకలు, కుంభకోణాలను బయటపెట్టిన సామాజిక కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అవినీతిపరులైన రాజకీయ నాయకులు, కొన్ని అసాంఘిక శక్తుల నుంచి వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. దీంతో వారికి రక్షణ కల్పించాలని రాష్ట్ర సమాచార శాఖ కమిషన్ ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు విజ్ఞప్తి చేసింది. సమాజ హితవు కోసం సమాచార హక్కు కార్యకర్తలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ప్రభుత్వ విభాగాలు, పురపాలక సంస్థల్లో పని చేసే అధికారులు, రాజకీయ నేతలు, పదవీచ్యుతులైన మంత్రుల అవినీతి భాగోతాలను బయటపెట్టిన సందర్భాలునానయి.
దీంతో తమ గుట్టు రట్టు చేసిన సమాచార హక్కు కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. బెదిరింపులు, పరోక్ష దాడులు జరుగుతున్నాయని సమాచార హక్కు కమిషన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చింది. కొద్ది రోజుల కిందట ఆర్టీఐ కార్యకర్త సతీష్ శెట్టిపై దాడి చేసినవారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని గుర్తు చేసింది. కొన్ని కేసుల్లో దాడులకు పాల్పడిన దుండగుల ఆచూకీ ఇంతవరకు లభించలేదు. దీంతో సమాచార హక్కు కార్యకర్తలకు భద్రత లేకుండా పోయిందని సమాచార కమిషనర్ రత్నాకర్ గైక్వాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమావేశమైన సందర్భంగా ఈ విషయాలన్నీ ఆయన దృష్టికి తీసుకొచ్చామని గైక్వాడ్ చెప్పారు. సంబంధిత పోలీసు అధికారులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని సీఎం తమకు హామీ ఇచ్చారని చెప్పారు.
ఆర్టీఐ కార్యకర్తలకు రక్షణ కల్పించాలి
Published Fri, Feb 6 2015 3:31 AM | Last Updated on Sat, Sep 2 2017 8:50 PM
Advertisement