ఇక తెరపై సచిన్
నటనకు ఎవరూ అనర్హులు కాజాలరు. క్రీడారంగంలోని వారికి నటనపై ఆసక్తి కలగడం విశేషమేమీకాదు. క్రికెట్ క్రీడకే గౌరవాన్ని ఆపాదించిన సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర వెండి తెరకెక్కడానికి సిద్ధమవుతుందని సమాచారం.
కవితకు కాదేదీ అనర్హం అన్నట్లు నటనకు ఎవరూ అనర్హులు కాజాలరు. కాకపోతే అవకాశాలకు కాస్త అదృష్టం కావాలి. ఇక సెలబ్రిటీలకైతే అదృష్టం వద్దన్నా వరిస్తుంది. ఇతర రంగాల్లో పేరుగాంచిన వారు ఆ తరువాత దృష్టి సారిస్తోంది సినిమా రంగమే అని చెప్పడానికి సాహసం అక్కర్లేదనుకుంటా. ఇక క్రీడారంగంలోని వారికి నటనపై ఆసక్తి కలగటం విశేషమేమీ కాదు.ఇప్పటికే క్రికెట్ క్రీడా రంగంలో సంచలనం సృష్టించిన శ్రీశాంత్ తన దృష్టిని సినిమాలపైకి మళ్లించారు.
త్వరలో తమిళం,తెలుగు భాషల్లో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. అందుకోసం ఆయన తగు శిక్షణ తీసుకుంటున్నారు కూడా. భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విశేష సేవలందించిన ధోని జీవిత ఇతి వృత్తం తెరకెక్కనుంది.
తాజాగా క్రికెట్ గ్రౌండ్‌లో చిచ్చర పిడుగులా చెలరేగి బంతిని తన ఇష్టం వచ్చినట్లు ఆటాడుకుని ఈ క్రీడకే గౌరవాన్ని ఆపాదించిన సచిన్ టెండూల్కర్ జీవిత చరిత్ర వెండి తెరకెక్కడానికి సిద్ధమవుతుందని సమాచారం.ఇందులో సచిన్ పాత్రలో ఆయనే నటించనుండడం మరో విశేషం. సచిన్ బాల్యం నుంచి క్రికెట్ క్రీడా రంగంలో ఆయన సాధన ఇతి వృత్తంగా ఈ చిత్రం ఉంటుందట.
దీన్ని జేమ్స్ ఏర్స్‌కిన్ అనే దర్శకుడు హ్యాండిల్ చేయనున్నారు. హిందీలో ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న ఈ చిత్రం ఆనక అన్ని భాషల్లోనూ అనువాదం అయ్యో అవకాశం ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నట్లు తెలిసింది. పిచ్‌లో సిక్సర్లు కొట్టిన సచిన్ ఇక చిత్రాల్లో ఎలాంటి హిట్లు కొడతారో వేచి చూడాల్సిందే.