ఏఆర్ రెహ్మన్ ఇంటికి వెళ్లిన సచిన్
చెన్నై : వేర్వేరు రంగాలకు చెందిన సాధనకారులు ఒక చోట కలిస్తే కచ్చితంగా అది ఆసక్తికర విషయమే అవుతుంది. అలా సంగీతంలో ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్.రెహ్మాన్, క్రికెట్ క్రీడారంగంలో భారతరత్న అవార్డు గ్రహీత మాస్టర్ బ్లాస్టర్ సచ్చిన్ టెండుల్కర్‌ల అరుదైన కలయిక విశేషమే అవుతుంది. వీరి ఆత్మీయ కలయికకు స్థానికి కోడంబాకంలోని ఏఆర్.రెహ్మాన్ స్వగృహం పులకించింది.
శుక్రవారం ఒక ట్రస్ట్ కార్యక్రమం కోసం చెన్నై వచ్చిన సచ్చిన్ తన మిత్రుడు ఏఆర్.రెహ్మాన్ ఇంటికెళ్లి ఆయనతో కొంత సేపు ముచ్చటించారు. పనిలో పనిగా సంగీతాన్ని ఎలా రూపొందిస్తారు? పాటలకు బాణీలు ఎలా కడతారన్న తన ఆసక్తిని సచిన్ ప్రశ్నల రూపంలో రెహ్మాన్ ముందుంచగా ఆయన కొన్ని బాణీలను కట్టి మిత్రుడి జిజ్ఞాసను తీర్చి సంతోషపరిచారు.
అనంతరం సచిన్ మాట్లాడుతూ తాను ఏఆర్.రెహ్మాన్ అభిమానినన్నారు. మర్యాదపూర్వకంగానే ఆయన్ని కలిశానని వివరించారు.ఆ తరువాత సచిన్ నగరంలోని క్రికెట్ శిక్షణ మైదానాన్ని సందర్శించి అక్కడ తర్ఫీదు పొందుతున్న క్రీడాకారులకు కొన్ని సూచనలు ఇచ్చారు.