సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో యమునానదిపై ఢిల్లీ నుంచి ఆగ్రాకు నావలో ప్రయాణించవచ్చని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. యమునానదిపై జలమార్గాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నెదర్లాండ్ ప్రభుత్వ సహాయం కోరింది. ఈ బృహత్తర ప్రాజెక్టు కింద యమునా నదిపై బ్యారేజ్‌లతో పాటు నదికి రెండు వైపులా వాటర్ టెర్మినళ్లను నిర్మిస్తారు. త్వరలో యమునా నదిపై ఢిల్లీ నుంచి ఆగ్రాకు వెళ్లవచ్చని, రవాణా మంత్రిత్వశాఖ, ఢిల్లీ ప్రభుత్వం చేపట్టే ఈ ప్రాజెక్ట్టు పనులపై పది రోజులలో కేబినెట్ నోట్‌ను రూపొందిస్తామని రవాణా, రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక నిధులు కేటాయించవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కోరనున్నట్లు ఆయన చెప్పారు.
నెదర్లాండ్ సహాయంతో చేపట్టే ప్రాజెక్టుపై చర్చించిన అత్యున్నత స్థాయి సమావేశం నితిన్ గడ్కరీ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సమావేశం తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టుపై టెక్నికల్ రిపోర్టు అందించడానికి నెదర్లాండ్ ప్రభుత్వం అంగీకరించిందని చెప్పారు. యమునా నదికి రెండు అంచులలో బ్యారేజ్‌లు, రెండు వాటర్ టెర్మినళ్ల నిర్మాణానికి సంబంధించిన వివరాలను డచ్ ప్రభుత్వం సాంకేతిక నివేదికలో అందచేస్తుందని ఆయన చెప్పారు. ఈ విషయంలో నెదర్లాండ్‌కు అనుభవం ఉందని, తాను ఆ దేశ రాయబారితో మాట్లాడానని ఆయన చెప్పారు. ఈ ప్రాజ్టెక్టుకు సంబంధించి టెక్నికల్ కన్సల్టెన్సీతో పాటు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ రిపోర్టు అందించవలసిందిగా తాము నెదర్లాండ్‌కు చెందిన ఓ ప్రభుత్వ సంస్థను కోరామని, ఇందుకు అది అంగీకరించిందని ఆయన చెప్పారు.
నౌకాయానానికి అనువుగా ఉండడం కోసం యమునా నదిలో సంవత్సరం పొడవునా కనీసం ఐదు మీటర్ల లోతు నీరు ఉండేలా బ్యారేజ్‌లు నిర్మించనున్నట్లు గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో నీటి సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు యమునా నదిపై వజీరాబాద్‌కు ముందు మరిన్ని బ్యారేజ్‌లు నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం అవసరమైతే హర్యానా ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నట్లు ఆయన తెలిపారు. సీ ప్లేన్లకు తాము ఇదివరకే ఆమోదం తెలిపామని, హోవర్‌క్రాప్ట్‌లను అనుమతిస్తున్నామని గడ్కరీ చెప్పారు. విమానాశ్రయాల తరహాలో యమునా నదిపై వాటర్ టెర్మినళ్లను నిర్మించనున్నట్లు గడ్కరీ చెప్పారు. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ యమునా నది తీరాలను అందంగా తీర్చిదిద్దుతుందని, ఢిల్లీ జల్ బోర్డు యమనానదిలో కాలుష్యాలు విడుదల కాకుండా చూస్త్తుందని ఆయన చెప్పారు . నౌకాయాన శాఖ అధికారులు లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో చర్చించి ఈ ప్రాజెక్టును సమన్వయం చేస్తారని గడ్కరీ తెలిపారు.
తమ మంత్రిత్వశాఖ జలమార్గాల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యాన్ని ఇస్తోందని గడ్కరీ తెలిపారు. చైనాతో పోలిస్తే మనదేశంలో జలమార్గాలను ప్రయాణికులు, సరుకుల రవాణా కోసం ఉపయోగించడం చాలా తక్కువని అన్నారు. చైనాలో జలమార్గాల వాడకం 20 శాతం కాగా మనదేశంలో ఇది కేవలం 0.5 శాతం మాత్రమేనని ఆయన చెప్పారు. దేశంలో ప్రస్తుతమున్న ఐదు జలమార్గాలతో పాటు వారణాసి నుంచి కోల్‌కతాకు, ఢిల్లీ నుంచి ఆగ్రాకు జలమార్గాలను అభివృద్ధి చేయడంపై తమ మంత్రిత్వశాఖ దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు.
త్వరలో ఢిల్లీ నుంచి ఆగ్రాకు నౌకాయానం
Published Wed, Dec 3 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement
Advertisement