సంక్రాంతి కానుకల పంపిణీ
Published Wed, Jan 8 2014 3:07 AM | Last Updated on Fri, Jul 6 2018 3:32 PM
పళ్లిపట్టు, న్యూస్‌లైన్: పళ్లిపట్టు తాలూకాలో 59 వేల కుటుంబాలకు సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కౌన్సిలర్ టీడీ.శ్రీనివాసన్ ప్రారంభించారు. తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కిలో బియ్యం, చక్కెర, రూ.వందతో పాటు ఉచిత చీర ధోవతుల పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా కుమారాజుపేటలో నిర్వహించిన పంపిణీ కార్యక్రమానికి తహశీల్దార్ మనోహర్ అధ్యక్షత వహించారు. యూనియన్ చైర్మన్ శాంతిప్రియాసురేష్ స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా జిల్లా కౌన్సిలర్ టీడీ.శ్రీనివాసన్ పాల్గొని రేషన్ కార్డులున్న ప్రతి ఒక్కరికీ సంక్రాంతి కానుకలు అందజేశారు.
ఆయన మాట్లాడుతూ తమిళుల పండుగగా కీర్తి పొందిన పొంగల్ వేడుకలను పేదలు, ధనికుల అన్న తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జయలలిత ఇవి ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుదారులందరూ ఈ వస్తువులను ఉచితంగా పొందాలని చెప్పారు. ఈ నెల 13వ తేదీ వరకు అన్ని రేషన్ దుకాణాల్లో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో భాగంగా కౌన్సిలర్లు కరుణాకరన్, ఏకాంబరం, సెల్వి శరవనన్, వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు జానకిరామన్, సుబ్రమణ్యం రెడ్డి సహా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆర్‌కే.పేట యూనియన్ వేణుగోపాలపురం, ఆదివరాహపురం, గ్రామాల్లో నిర్వహించిన సంక్రాంతి వస్తువుల పంపిణీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నరసింహన్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement