కోర్టులో లొంగిపోయిన శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించిన అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయారు. బుధవారం సాయంత్రం బెంగళూరులో పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన కోర్టు హాల్‌లో ఆమె న్యాయమూర్తి అశ్వర్థనారాయణ ఎదుట హాజరయ్యారు. శశికళతో పాటు ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా కోర్టులో లొంగిపోయారు. కోర్టులో వీరి వాంగ్మూలాలను నమోదు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఆదేశాల మేరకు పోలీసులు వారికి వైద్య పరీక్షలు చేయించి పరప్పణ అగ్రహార జైలుకు తరలించారు. తనను ప్రత్యేక ఖైదీగా పరగిణించాలన్న శశికళ విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. జైలు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు.
శశికళ రాక ముందే ఆమె భర్త నటరాజన్, లోక్సభ డిప్యూటి స్పీకర్ తంబిదురై జైలు ప్రాంగణానికి చేరుకున్నారు. అన్నా డీఎంకే కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పోలీసులతో అన్నా డీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన శశికళ నేరుగా బెంగళూరు పరప్పణ కోర్టుకు చేరుకున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు ముగ్గురిని దోషులుగా సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. ఈ కేసులో శశికళ గతంలో అనుభవించిన ఆరు నెలల శిక్షాకాలాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇప్పుడు మిగిలిన మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవించాలి. ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా ఇదే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది.