
వాగు దాటితేనే చదువు..
వేమనపల్లి: ఆదిలాబాద్ జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన విద్యార్థులు చదువు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. వీరు చదువుకోవాలంటే నీల్వాయి వాగు దాటాల్సివస్తోంది. నీల్వాయిలో ప్రాథమిక పాఠశాల ఉన్నా.. ఉపాధ్యాయుల పనితీరు సరిగా లేదు. దీంతో సుమారు 26 మంది పిల్లలు నీల్వాయి వాగు అవతలి వైపు ఉన్న గొర్లపల్లిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు వెళ్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు నీల్వాయివాగులో తాత్కాలిక వంతెన కోతకు గురైంది. మూడు రోజులుగా నాటు పడవలతో వాగు దాటారు.
శుక్రవారం వాగులో నీటి ప్రవాహం కొంత మేరకు తగ్గింది. పిల్లలు దీంతో మోకాలు లోతు నీటిలో వాగు దాటి పాఠశాలకు వెళ్లారు. ప్రతిరోజు మార్గమధ్యలో ఉన్న నీల్వాయి వాగు దాటి మూడు కిలోమీటర్ల దూరంలోకి గొర్లపల్లికి వెళ్లాల్సి వస్తోంది. వాగు వద్ద ఎవరైనా ఒకరు ఉండి పిల్లలను తీసుకెళ్లడం, తీసుకురావడం మామూలే.