సేలం, న్యూస్‌లైన్ :చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో బాంబు పేలుళ్ల సంఘటనతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భద్రతలు కట్టుదిట్టం చేశారు. అందులో భాగంగా సేలం రైల్వే డివిజన్‌లో ఉన్న సేలం, నామక్కల్, ఈరోడ్, కరూర్, తిరుప్పూర్, కోయంబత్తూరు రైల్వేస్టేషన్‌లలో రైల్వే పోలీసులు, ఆర్‌పీఎఫ్‌లు భద్రతా పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ భద్రతా చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్‌లోపలికి వచ్చే, బయటకు వెళ్లే ప్రతి రైలులోను బాంబు స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్ నిపుణుల సాయంతో పోలీ సులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా రైల్వే స్టేషన్‌లలోకి వెళ్లే ప్రతి ప్రయాణికుని, లగేజీలను తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు. రైల్వే స్టేషన్‌లకు వచ్చే, అక్కడి నుంచి వెళ్లే పార్శిళ్లల్లోను తనిఖీలు చేస్తున్నారు.