‘దినకరన్ శిబిరానికి వెళ్లే ప్రసక్తే లేదు’
సాక్షి, చెన్నై : టీటీవీ దినకరన్ శిబిరానికి వెళ్లే ప్రసక్తే లేదని, మాజీ మంత్రి ఓపీఎస్ మద్దతుదారుడు సెమ్మలై ఆదివారం స్పష్టం చేశారు. పదవి లభించకపోవడంతో సెమ్మలై అసంతృప్తితో ఉన్నట్లు పార్టీవర్గాల్లో ఊహాగానాలు చెలరేగాయి. పళనిసామి, పన్నీర్ వర్గాలు విలీనంతో పన్నీర్ వర్గానికి చెందిన సెమ్మలైకు మంత్రిగా లేదా మార్గదర్శక కమిటీలో పదవి లభిస్తుందని భావించారు. అయితే ఏ పదవీ లభించకపోవడంతో ఆయన దినకరన్ వర్గంలోకి వెళతారన్న వార్తలు వ్యాపించాయి. దీనిపై ఆయన స్పందిస్తూ తాను దినకరన్ వర్గానికి వెళ్లే ప్రసక్తే లేదని, అన్న ఓపీఎస్‌తోనే ఉంటానని తెలిపారు. కొందరు కావాలనే తనపై వదంతులు పుట్టిస్తున్నారన్నారు.
నన్ను ఎగతాళి చేయడమా?
తనకు పదవి లభించడాన్ని ఎగతాళి చేయడం సరైంది కాదని ఎంపీ కుమార్‌పై నటుడు సెంథిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే అమ్మ వర్గంలో ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ నటుడు సెంథిల్‌కు అన్నాడీఎంకే నిర్వాహక కార్యదర్శిగా నియమించారు. ఆ పదవిలో ఉన్న మాజీ మంత్రి గోకుల ఇందిరను పదవి నుంచి తొలగించారు.
దీనిపై తిరుచ్చి ఎంపీ కుమార్ మాట్లాడుతూ నటుడు సెంథిల్‌కు నిర్వాహక కార్యదర్శి పదవి ఇవ్వడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యాఖ్యలపై సెంథిల్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆరంభం నుంచి పార్టీ కోసం కష్టపడ్డానని, అందుకే తనకు పదవి లభించిందన్నారు. తనను విమర్శించేందుకు ఎంపీకి ఎటువంటి అర్హత లేదని ఆయన చెప్పారు.