కన్నడ నాట విరిసిన పద్మాలు | Seven members get Padma awards | Sakshi
Sakshi News home page

కన్నడ నాట విరిసిన పద్మాలు

Published Tue, Jan 27 2015 1:56 AM | Last Updated on Sat, Sep 2 2017 8:18 PM

కన్నడ నాట విరిసిన పద్మాలు

కన్నడ నాట విరిసిన పద్మాలు

ఏడుగురికి పద్మ అవార్డులు
వీరేంద్రహెగ్డేకు పద్మవిభూషణ్, శ్రీ శివకుమారస్వామీజీకి పద్మభూషణ్

బెంగళూరు: భారతదేశ ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలైన ‘పద్మ’ అవార్డులకు కన్నడ నాడు నుంచి వివిధ రంగాలకు చెందిన ఏడుగురు ప్రముఖులు ఎంపికయ్యారు. వీరిలో 1968 నుంచి ధర్మస్థల ధర్మాధికారిగా ఉన్న డాక్టర్ డి.వీరేంద్ర హెగ్డేను పద్మవిభూషణ్ అవార్డు వరించింది. ఇక నడిచే దేవుడిగా భక్తులు పిలుచుకునే సిద్ధగంగా మఠం పీఠాధిపతి శ్రీ శివకుమార స్వామీజీ, ప్రముఖ శాస్త్రవేత్త కరాక్‌సింగ్ వాల్దియాలకు కేంద్రం పద్మభూషణ్‌ను ప్రకటించింది. శాస్త్రవేత్తలు కె.ఎస్.శివకుమార్, ఎస్.అరుణన్, వసంతశాస్త్రి, వ్యాపారవేత్త మోహన్‌దాస్ పైలు పద్మశ్రీకి ఎంపికైన వారిలో ఉన్నారు. కర్ణాటక నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారి వివరాలు....
 
డాక్టర్ డి.వీరేంద్రహెగ్డే.....
 
1948 నవంబర్ 25న జన్మించిన వీరేంద్రహెగ్డే 20 ఏళ్ల వయస్సులోనే (1968లో)దక్షిణ కన్నడ ప్రాంతాలోని ధర్మస్థల ధర్మాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ధర్మాధికారిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ధర్మస్థల క్షేత్ర ప్రాభవాన్ని దేశవ్యాప్తం చేసేందుకు కృషి చేశారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యావకాశాలను నిరుపేదలకు సైతం చేరువ చేసేందుకు శ్రమిస్తున్నారు.

డాక్టర్ శ్రీ శివకుమార స్వామీజీ....

కర్ణాటకలోని మాగడి తాలూకాలోని వీరాపుర గ్రామంలో 1907 ఏప్రిల్ 1న శ్రీశివకుమార స్వామీజీ జన్మించారు. సిద్ధగంగా మఠం పీఠాధిపతిగా సిద్ధగంగా మఠం ట్రస్ట్ తరఫున అనేక విద్యాసంస్థలను ఏర్పాటు చేసి ఎంతో మంది పేదలకు నాణ్యమైన విద్యను చేరువ చేయడంతో పాటు వారికి ఆశ్రయం సైతం కల్పిస్తున్నారు. నడయాడే దేవుడిగా ఆయన్ను ప్రజలు భక్తి భావనలతో పిలుచుకుంటారు.

కరక్ సింగ్ వాల్దియా....

ప్రముఖ శాస్త్రవేత్తగా దేశానికి సుపరిచితులైన కరక్ సింగ్ వాల్దియా 2007లోనే పద్మ శ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో అనేక పరిశోధనలు నిర్వహించిన కరక్ సింగ్ వాల్దియా 14 పుస్తకాలను సైతం రాశారు. ప్రస్తుతం జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసర్చ్‌లో హానరరీ ప్రొఫెసర్‌గా, ఐఐటీ ముంబైలో గెస్ట్ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్నారు.
 టి.వి.మోహన్ దాస్‌పై..... నగరంలోని సెయింట్‌జోసెఫ్ కాలేజ్ ఆప్ కామర్స్ నుంచి మోహన్‌దాస్‌పై గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు యూనివర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. దేశంలోనే ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సంస్థ బోర్డ్ మెంబర్‌గా 1994లో చేరిన మోహన్‌దాస్ పై సామాజిక సేవా రంగంలో సైతం తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. నగరంలోని వివిధ సమస్యలపై పోరాటం చేస్తున్న బెంగళూరు పొలిటికల్ యాక్షన్ కమిటీకి మోహన్ దాస్‌పై ప్రస్తుతం వైస్ ప్రసిడెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఎస్.కె.శివకుమార్.... మైసూరు విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఎస్.కె.శివకుమార్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి బీఈ(ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్స్), ఎంటెక్ (ఫిజికల్ ఇంజనీరింగ్)లను పూర్తి చేశారు. చంద్రయాన్‌కు సంబంధించిన టెలీమెట్రీ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తల బృందంలో శివకుమార్ ఒకరు. ప్రస్తుతం ఇస్రో సంస్థ డెరైక్టర్‌గా శివకుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు.
 
ఎస్.అరుణన్..... కోయంబత్తూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన సుబ్యయ్య అరుణన్ 1984లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో విధుల్లో చేరారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రముఖ శాస్త్రవేత్తల్లో ఒకరుగా ప్రఖ్యాతి గాంచారు. భారత్ ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మార్స్ ఆర్బిటర్ మిషన్(మామ్)కు అరుణన్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా వ్యవహరించారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement