ఐఏఎస్ అధికారి పర్యవేక్షణలో ప్రశ్నపత్రం కూర్పు
మరోసారి ప్రశ్నపత్రం లీక్ కాకుండా చర్యలు
బెంగళూరు : ద్వితీయ పీయూసీ రసాయన శాస్త్రం ప్రశ్నపత్రం రెండుసార్లు లీకైన నేపథ్యంలో మరోమారు అలాంటి పొరపాట్లు పునరవృతం కాకుండా రాష్ట్ర విద్యాశాఖ గట్టి చర్యలు చేపట్టింది. లీకైన పరీక్షను ఈనెల 12న తిరిగి నిర్వహించనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ద్వితీయ పీయూసీ ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తున్న సిబ్బంది ఇప్పటికే పోలీసుల పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. అంతేకాదు వీరికి బయటి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా భద్రతా సిబ్బంది జాగ్రత్త వహిస్తున్నారు. ముఖ్యంగా ప్రశ్నపత్రం రూపొందిస్తున్న వారు మొబైల్ ఫోన్‌తో పాటు ఎలాంటి సామాజిక మాధ్యమాలు వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఇదే సందర్భంలో ద్వితీయ పీయూసీ ప్రశ్నపత్రం తయారై పరీక్ష పూర్తయ్యే వరకు వీరంతా పీయూ బోర్డు కార్యాలయంలోనే ఉండాల్సిందిగా విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి. ప్రశ్నపత్రాన్ని రూపొందించిన వారు ఏదైనా ప్రలోభాలకు లొంగిపోయి తాము ప్రశ్నపత్రంలో ఏయే ప్రశ్నలను పొందుపరచాము అన్న సమాచారాన్ని ఎవరికీ చేరవేయకుండా ఈ విధమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రశ్నపత్రం రూపకల్పన, ప్రశ్నపత్రాల రవాణా ఇలా అన్ని అంశాలను ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తున్నట్లు విద్యాశాఖ వర్గాల సమాచారం. ఇక ఇదే సందర్భంలో సాధారణంగా ప్రశ్నపత్రాలను పరీక్ష తేదీ కంటే రెండు రోజుల ముందు ఆయా మండల కేంద్రాల్లోని ట్రెజరీలకు పంపిస్తారు. అయితే ఈ సారి మాత్రం జిల్లా కేంద్రాల్లోని ట్రెజరీలలో ప్రశ్నపత్రాలను భద్రపరచనున్నారు.
రవాణా చేసే వ్యక్తికి కూడా ఫోన్ బంద్.....
ఇక ప్రశ్నపత్రాలను జిల్లా కేంద్రాల్లోని ట్రెజరీల నుంచి పరీక్షా కేంద్రాలకు చేరవేసే వాహనాల్లోని డ్రైవర్లు, ఇతర పర్యవేక్షకులు సైతం ఫోన్లను వినియోగించ రాదంటూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ‘లీకు’కు ఎలాంటి ఆస్కారం ఇవ్వరాదనే ఇలాంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు విద్యాశాఖ ఉన్నతస్థాయి అధికారులు చెబుతున్నారు.
ప్రైవేటు కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు వద్దు.....
ప్రశ్నపత్రాల లీకుల వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు పరీక్షల నిర్వహణలో సైతం కొన్ని మార్పులు చేయాలని పీయూసీ బోర్డు అధికారులు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2017 విద్యా ఏడాది నుంచి ఏ ప్రైవేటు కళాశాలలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయకుండా నిబంధనలు తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు ఉన్నత స్థాయి అధికారులు చెబుతున్నారు. ‘ప్రైవేటు కళాశాలల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటు కారణంగా పరీక్షల నిర్వహణలో పొరపాట్లు జరుగుతున్నాయి. అంతేకాదు మాల్‌ప్రాక్టీసింగ్, ప్రశ్నపత్రాల లీకులకు ఆస్కారం ఏర్పడుతోంది. అందువల్ల రానున్న విద్యా ఏడాది నుంచి ప్రైవేటు కళాశాలల్లో పీయూసీ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయరాదనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నాం’ అని పీయూసీ బోర్డులోని ఉన్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు.