
ఆత్మకథ రాస్తున్న షీలాదీక్షిత్
న్యూఢిల్లీ : మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ ఆత్మకథ రాస్తున్నారు. ఇప్పటికే రాయడం మొద లు పెట్టానని, ఈ సంవత్సరాంతం వరకు అది పూర్తవుతుందని ఆమె చెప్పారు. తన పుస్తకంలో తన జీవితంతో పాటు ఒక నగర జీవితం కూడా ఉంటుందని ఆమె అంటున్నారు. తన ఆత్మకథలో ఆసక్తికరమైన కథలు ఉంటాయని, అయితే తన ఆత్మకథ గురించి ఎవరూ భయపడనవసరం లేదని ఆమె హామీ ఇస్తున్నారు. రాజకీయ విరోధుల విషయంలో నిర్మొహమాటంగా మాట్లాడే షీలాదీక్షిత్... తన పుస్తకం మాత్రం సకారాత్మకంగా ఉంటుందని, వ్యవస్థను గానీ, వ్యక్తులను గానీ విమర్శించే మాధ్యమం కాబోదని హామీ ఇస్తున్నారు.
తనకు ఎదురైన సవాళ్లు, అనుభవాలు, భావనలు, ఊగిసలాటల గురించి రాస్తానని ఆమె చెబుతున్నారు. తన పుస్తకంలో విశ్లేషణలు ఉండవని, ఎవరూ తన పుస్తకం రాస్తున్నానంటే భయపడనవసరం లేదని నవ్వుతూ చెబుతున్నారు. తన పుస్తకం బోరింగ్‌గా కూడా ఉండదని ఆమె అంటున్నారు. ఒకవేళ బోరింగ్‌గా అనిపించినట్లయితే తానే దానిని చెత్తబుట్టలో పడేస్తానని ఆమె అంటున్నారు.
తాను చాలా అదృష్టవంతురాలినని, దేశం, నగరరాజకీయాలలో వచ్చిన మార్పులను కళ్లారా చూశానని ఆమె చెప్పారు. కొన్ని విషయాలు మదిలో నిలిచిపోతాయంటూ బంగ్లాదేశ్ యుద్ధం తరువాత దేశంలోని వాతావరణాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పుడు దేశవాసులు తమకు రెక్కలొచ్చినట్లుగా భావించారు. అది తమ వ్యక్తిగత విజయమైనట్లు భావించారని ఆమె చెప్పారు. ఇటువంటి ఘటనలు తన జీవితంలో ఎన్నింటినో చూశానని, వాటిని తన ఈ పుస్తకంలో పొందుపరుస్తానని ఆమె చెప్పారు. పుస్తకం కోసంపరిశోధన కూడా చేయాల్సిఉందని ఆమె చెప్పారు. తన మామ గురించి కూడా పుస్తకంలో రాస్తానని, ఆయన స్వాతంత్య్ర సమరయోధుడని జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీకి సన్నిహితుడని చెప్పారు. ఆయన గురించి రాయడం కోసం ఆ రోజుల గురించి పరిశోధన చేయాల్సి ఉందన్నారు. రాజకీయాలలో మార్పుల గురించి కూడా ఈ పుస్తకం ప్రస్తావిస్తుందని ఆమె చెప్పారు. ఈ పుస్తకాన్ని ఏ ప్రచురణ సంస్థకు ఇవ్వాలనే విషయం ఇంకా నిర్ణయించలేదని ఆమె వివరించారు.