‘డిపెండెంట్’ రాకుండా కుట్ర
‘డిపెండెంట్’ రాకుండా కుట్ర
Published Thu, Aug 25 2016 12:20 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
జేబీసీసీఐ నుంచి జేసీసీ స్థాయికి దిగజారిన వెంకట్రావు
కార్మిక సమస్యల పరిష్కారంలో టీబీజీకేఎస్ విఫలం
మణుగూరు : సింగరేణిలో మెడికల్ బోర్డులో అడ్డగోలుగా పైరవీలు చేసి డబ్బులు దండుకునేందుకే వారసత్వ ఉద్యోగాల స్కీం పునరుద్ధరించే విషయంలో యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురాకుండా గుర్తింపు సంఘం కుట్ర పన్నుతోందని హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. మణుగూరు ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుర్చీల కుమ్ములాటలతో కాలం గడిపిన టీబీజీకేఎస్ కార్మిక సమస్యల పరిష్కారంలో, హామీల అమలులో విఫలమైందన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణవాదంతో గెలిచిందని, ఇప్పుడు ఆ అవకాశం లేక ఐఎన్‌టీయూసీ, ఇతర సంఘాల వారిని చేర్చుకుంటూ మైండ్‌గేమ్ ఆడుతోందని అన్నారు. నాలుగేళ్లు గుర్తింపు సంఘంగా ఉండి కీలకమైన వారసత్వ ఉద్యోగాల స్కీంను రాకుండా చేశారన్నారు. ఈ స్కీం వస్తే మెడికల్ బోర్డు పేరుతో బేరాలు చేసుకునే అవకాశం పోతుందనే ఉద్దేశంతోనే కుట్ర పన్నారని విమర్శించారు. 2012-14 వరకు కెంగర్ల మల్లయ్య, 2014-16 వరకు కనకరాజు, మిరియాల రాజిరెడ్డి మెడికల్ బోర్డు ద్వారా డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పనిచేశారని, ఇక తన పదవి కాపాడుకునేందుకే వెంకట్రావు టీబీజీకేఎస్‌లోకి ఫిరాయించారని ఆరోపించారు. గతంలో ఎమ్మెల్సీగా ఉన్న వెంకట్రావు కార్మిక సమస్యలపై శాసనమండలిలో చర్చించిన సందర్భం లేదన్నారు. ఆయన జేబీసీసీఐ నుంచి జేసీసీ స్థాయికి దిగజారారన్నారు. వారసత్వ ఉద్యోగాల విషయంలో అన్ని సంఘాలు కలిసి సమ్మె నోటీసు ఇస్తే యాజమాన్యం దిగి వస్తుందని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులను అడిగితే వ్యంగ్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మిరియాల రంగయ్య, సారయ్య రూ.3.5 కోట్లు క్రెడిట్ సొసైటీ డబ్బులు మింగాారని, అది నిరూపణ అయిందని చెప్పారు. ఐఎన్‌టీయూసీ ప్రాతినిథ్యం వహిస్తున్న ఏరియాల్లో లంచం ఇస్తేనే పనులు జరుగుతున్నాయని, అవినీతి, అక్రమాలకు పాల్పడిన అధికారులను వదిలేయడంతో నిజాయతీ గల అధికారులు నిరుత్సాహపడుతున్నారని అన్నారు. అధికారులతో కలిసి దోపిడీ చేసే యూనియన్లకు గుణపాఠం చెప్పి, హెచ్‌ఎంఎస్‌ను గెలిపిస్తే కార్మికులకు మేలు కలుగుతుందన్నారు.
Advertisement
Advertisement