లైన్‌క్లియర్!
లైన్‌క్లియర్!
Published Fri, Oct 14 2016 4:19 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
రూ.8.51కోట్ల అంచనాతో డీపీఆర్
సింగిల్‌లైన్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణంతో
తీరనున్న దీవిసీమ గ్రామస్తుల కష్టాలు
నాలుగునెలల క్రితం తిరిగొచ్చిన ఫైల్
ఎట్టకేలకు సీఈ వద్దకు బ్రిడ్జి నివేదిక
జూరాల: గుర్రంగడ్డ గ్రామస్తులు తరతరాలుగా పడుతున్న రాకపోకల కష్టాలు ఇక తీరనున్నాయి. కృష్ణానది మధ్యలో ఉన్న దీవి గ్రామానికి సింగిల్‌లైన్ బ్రిడ్జి సర్వే కోసం ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఎట్టకేలకు రూ.8.51కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను నీటిపారుదలశాఖ ఛీఫ్ ఇంజనీర్ ఖగేందర్‌కు జూరాల ఇంజనీర్లు పంపించారు. నాలుగు నెలల క్రితం ఎస్‌ఎస్‌ఆర్ రేట్లు, క్రాసింగ్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించినట్లయింది. గద్వాల మండలం బీరోలు సమీపంలోని కృష్ణానది మధ్యలో ఉన్న గుర్రంగడ్డ గ్రామానికి నిత్యం సంబంధాలు కొనసాగేలా బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు 2009నుంచి ఫైళ్లలోనే తిరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించడం, మరో కొర్రీతో తిరిగి రావడం, ఏళ్లుగా గుర్రంగడ్డ దీవి ప్రజలు బ్రిడ్జి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తుది డీపీఆర్ సిద్ధమవడంతో త్వరలోనే డీపీఆర్‌కు ఆమోదం లభించి పరిపాలన అనుమతులు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి.
వాయిదాల పర్వం
స్వాతంత్య్రానికి ముందు గుర్రంగడ్డ దీవి ప్రజలు పుట్టీలతో నదిని దాటే దుర్భర పరిస్థితిని ఎదుర్కొన్నారు. స్వాతంత్య్రం అనంతరం మన ప్రభుత్వాలు గుర్రంగడ్డ దీవి ప్రజలకు హామీలు ఇస్తూనే కాలం గడిపాయి. 2009లో అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వాక్‌వే బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.40కోట్లతో పరిపాలన మంజూరీఇచ్చింది. 2009 ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో గుర్రంగడ్డ దీవికి బ్రిడ్జి నిర్మాణ అంశం వాయిదాపడుతూ వచ్చింది. 2014కు ముందు వాక్‌వే బ్రిడ్జి నిర్మాణం కాకుండా సింగిల్‌లైన్ బ్రిడ్జి నిర్మించాలని అధికారులు మరో ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ప్రాథమిక అంచనా అప్పట్లోనే రూపొందించినప్పటికీ ఎన్నికలు రావడంతో అదికూడా వాయిదాపడింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటినుంచి సింగిల్‌లైన్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదన మళ్లీ తెరపైకి రావడం, హైదరాబాద్‌కు ఫైల్ వెళ్లడం, పలు లోపాలతో తిరిగి రావడం ఇలా రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఈఈ చక్రధరంను వివరణ కోరగా పలు లోపాలకు అవసమైన వివరణలు ఇవ్వడంతో పాటు, కొత్త ఎస్‌ఎస్‌ఆర్ రేట్లకు అనుగుణంగా డీపీఆర్‌ను సిద్ధంచేసి పంపించామని తెలిపారు.
Advertisement