= వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యత
= జాక్‌పాట్ కొట్టిన సీనియర్లు
= అసమ్మతి అరికట్టడానికి కేపీసీసీ నిర్ణయం?
సాక్షి, బెంగళూరు : రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ స్థానాల్లో అత్యధికం పార్టీలోని సీనియర్ నేతలకే కట్టబెట్టాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. అందులోనూ సిట్టింగ్ ఎంపీలకు ప్రాధాన్యత కల్పించాలని తీర్మానించినట్లు తెలుస్తోంది. టికెట్‌ల కేటాయింపు సమయంలో తలెత్తే అసమ్మతిని సాధ్యమైనంత వరకూ తగ్గించే చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం రాష్ట్రం నుంచి తొమ్మిది మంది ఎంపీలు లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇందులో మండ్య ఎంపీ రమ్య, బెంగళూరు గ్రామీణ ఎంపీ సురేష్‌కుమార్ తప్ప మిగిలిన వారంతా సీనియర్ నాయకులే. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకపై ఆ పార్టీ అధిష్టానం ఎక్కువ దృష్టిని కేంద్రీకరించింది. సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లను గెలుచుకోవడానికి అనుసరించాల్సిన ‘రోడ్‌మ్యాప్’ను తయారు చేసి అందించాల్సిందిగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర నాయకులకు సూచించారు.
ఈ క్రమంలో పార్టీ నుంచి ప్రస్తుతం ఎంపీలుగా ఉన్న వారికే ఆయా స్థానాల్లో తిరిగి టికెట్టు కేటాయించాల్సిందిగా కేపీసీసీ పదాధికారుల సమావేశంలో తీర్మానించినట్లు సమాచారం. ఇదే తీర్మానాన్ని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపినట్లు తెలుస్తోంది. దీంతో మల్లికార్జున ఖర్గే (గుల్బర్గ), ధరంసింగ్ (బీదర్), విశ్వనాథ్ (మైసూరు), ధృవనారాయణ (చామరాజనగర), వీరప్పమొయిలీ (చిక్కబళాపుర), మునియప్ప (కోలారు), కె.జయప్రకాష్ హెగ్డే (ఉడుపి-చిక్కమగళూరు)లను వ చ్చే లోక్‌సభ ఎన్నికల్లో అదేస్థానం నుంచి బరిలోకి దించాలని కేపీసీసీ నాయకులు భావిస్తున్నారు.
కాంగ్రెస్‌కు మంచి పట్టున్న స్థానాల్లో కూడా ఈసారి సీనియర్లకే టికెట్టు కేటాయించాలనే ప్రాథమిక నిర్థారణకు రాష్ట్ర నాయకులు వచ్చారు. ఉత్తర కన్నడ పార్లమెంటు స్థానం కోసం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే, మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పోటీపడుతున్నారు. ఈ టికెట్టు ఎలాగైనా తమ కుమారులైన ప్రశాంత్ దేశ్‌పాండే, నివేదిత్ అల్వాలకు ఇప్పించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలో వీరిద్దరిలో ఎవరికి టికెట్టు ఇచ్చినా మరొకరు అసంత ృప్తికి లోనయ్యే తెరవెనక రాజకీయాలు నడిపి పార్టీ అభ్యర్థినే ఓడించే అవకాశం లేకపోలేదని కేపీసీసీ నిర్ధారణకు వచ్చింది.
ఈ క్రమంలో ఈ సీటును పార్టీలో సీనియర్ నాయకుడైన హరిప్రసాద్‌కు కేటాయిస్తే మంచిదనే అభిప్రాయానికి రాష్ట్ర నాయకులు వచ్చినట్లు తెలిసింది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఈడిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నందున అదే వర్గానికి చెందిన హరిప్రసాద్‌కు టికెట్టు కేటాయించడం ఉత్తమమని నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దక్షిణ కన్నడ ఎంపీ టికెట్‌ను మాజీ కేంద్రమంత్రి, సీనియర్ నాయకుడైన బి.జనార్థన పూజారికి ఇవ్వాలని కేపీసీసీ నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ స్థానానికి కేంద్రమంత్రి మొయిలీ కుమారుడైన హర్ష మొయిలీ పోటీ పడుతున్నారు. అయితే శాసనసభ ఎన్నికల్లో ఆ జిల్లా నుంచి కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన జనార్థన పూజారి వైపే రాష్ట్ర నాయకులు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. బళ్లారి నుంచి సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడైన ఎన్.వై హనుమంతప్పకు టికెట్టు కేటాయించాలని కేపీసీసీ నిర్ధారణకు వచ్చింది. మండ్యలో ఎస్.ఎం కృష్ణను బరిలో దించాలని రాష్ట్రనాయకులు భావిస్తున్నా ఆయన నిరాకరించడంతో ప్రస్తుత ఎంపీ రమ్యకే తిరిగి టికెట్టు కేటాయించాలని రాష్ట్ర నాయకులు భావిస్తున్నారు.
ఉప ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందంలో భాగంగానే (జూనియర్ అయినా కూడా) బెంగళూరు గ్రామీణ పార్లమెంటు స్థానాన్ని ప్రస్తుత ఎంపీ సురేష్‌కుమార్‌కే కేటాయించాలని కేపీసీసీ నిర్ణయించినట్లు సమాచారం. కాగా ఈనెల 29, 30 తేదీల్లో బెంగళూరులో జరిగే సమావేశంలో ఈ విషయమై ఓ స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఢిల్లీ పెద్దలకు లోక్‌సభ అభ్యర్థుల ప్రాథమిక జబితాను కేపీసీసీ పంపించనుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో కేపీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర్, సీఎం సిద్ధరామయ్య కూడా పాల్గొననున్నారు.
‘సిట్టింగ్’ మంత్ర!
Published Thu, Dec 26 2013 4:37 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement