‘పంచె’ చిచ్చు!
సాక్షి, చెన్నై : తమిళ సంప్రదాయం పంచెకట్టుకు వ్యతిరేకంగా చెన్నై క్రికెట్ క్లబ్‌లో చోటు చేసుకున్న వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పంచె కట్టును వ్యతిరేకించడమే కాకుండా, బాధ్యత గల పదవి లో ఉన్న న్యాయమూర్తి, న్యాయవాదుల్ని బయటకు గెంటివేయడాన్ని న్యాయలోకం, తమిళాభిమాన సం ఘాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఆ క్లబ్ భరతం పట్టడంతో పాటుగా తమిళ సంప్రదాయానికి వ్యతిరేకంగా వ్యవహరించే సంస్థలు, స్టార్ హోటళ్లతో ఢీ కొట్టేందుకు రెడీ అయ్యాయి.
ముట్టడికి యత్నం
తమిళర్ వాల్వురిమై కట్చి నేత వేల్‌మురుగన్ ఆదేశాలతో ఆ పార్టీ నేత వేణుగోపాల్ నేతృత్వంలో సుమారు వంద మంది కార్యకర్తలు ఉదయాన్నే పంచె కట్టుతో చేపాక్కంలో ప్రత్యక్షం అయ్యారు. తమ పార్టీ జెండాలను చేత బట్టి చేపాక్కంలోని చెన్నై క్రికెట్ క్లబ్‌లోకి చొరబడే యత్నం చేశారు. దీంతో అక్కడి భద్రతా సిబ్బంది అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. పరస్పరం వాగ్యుద్ధానికి దిగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు వల యాన్ని తోసుకుంటూ ఆ క్లబ్‌లోకి వెళ్లడానికి ఆందోళనకారులు యత్నించారు. చివరకు పోలీసులు వారందరినీ బలవంతంగా అరెస్టు చేయడానికి యత్నించడంతో స్వల్ప తోపులాట, ఉద్రిక్తత చోటు చేసుకుం ది. ఎట్టకేలకు వారందరినీ అరెస్టు చేశారు. తమిళర్ వాల్వురిమై బాట లో మరికొన్ని సంఘాలు ప్రయత్నిం చినా, మార్గం మధ్యలోని వారిని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్టుల తో నిరసన ఆగదని, ఆ క్లబ్ భరతం పట్టి తీరుతామంటూ తమిళాభి మాన సంఘాలు హెచ్చరించాయి.
కోర్టుకు : తమిళ సంప్రదాయా న్ని కించపరిచే విధంగా వ్యవహరించిన క్రికెట్ క్లబ్‌పై కోర్టుకు వెళ్లేందుకు సీనియర్ న్యాయవాది గాంధీ నిర్ణయించారు. ఆ క్లబ్ గెంటి వేసిన బాధితుల్లో సీనియర్ న్యాయవాది గాంధీ, స్వామినాథన్ కూడా ఉన్నారు. ఆ పుస్తక కార్యక్రమానికి ఆటంకం కలగకూడదన్న ఒకే ఒక్క కారణంతో ఆ రోజున ఆ క్లబ్ నుంచి మౌనంగా బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ఆంక్షలను పక్కన పెట్టి, కనీసం తమ హోదాకు మర్యాదైనా ఇవ్వాల్సి ఉందని, ఇందుకు భిన్నంగా నడుచుకున్నారని మండి పడ్డారు. ఆ క్లబ్ నిర్వాకాన్ని విడిచి పెట్టే ప్రసక్తే లేదని, తమిళ సంప్రదాయం పంచెకట్టుకు వ్యతిరేకంగా వ్యవహరించిన క్రికెట్ క్లబ్‌ను కోర్టు మెట్లు ఎక్కిస్తానంటూ గాంధీ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలిపారు.
టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞాన దేశికన్‌తోపాటుగా మరికొన్ని రాజకీయ పక్షాలు పంచెకట్లు పరాభవం మీద స్పందించాయి. చెన్నై క్రికెట్ క్లబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, డ్రెస్ కోడ్ వంటి ఆంక్షలను తమిళనాడులో రద్దు చేస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమర్థింపు : పంచెకట్టుకు ఎదురైన పరాభవాన్ని క్రికెట్ క్లబ్ సమర్థించుకుంది. ఆ సంఘం కార్యదర్శి కాశీ విశ్వనాథన్ పేర్కొంటూ, తమ క్లబ్ ఆంక్షలు నిన్న మొన్న పెట్టినవి కాదని వివరించారు.
ఏళ్ల తరబడి అనుసరిస్తున్న తమ ఆంక్షలను ఎలా మార్చుకోమంటారని ఎదురు ప్రశ్న వేశారు. తమ క్లబ్‌లో ఏదేని ప్రైవేటు కార్యక్రమం జరపదలచిన పక్షంలో, ఆ నిర్వాహకులకు ముందుగానే ఆంక్షల వివరాలను తెలియజేస్తామన్నారు. తమ ఆంక్షలు, డ్రెస్ కోడ్‌ను సంబంధిత పుస్తకావిష్కరణ నిర్వాహకులకు తెలియజేసినట్లు వివరించారు. వారు తమ ఆహ్వానితులకు ఆ వివరాలు తెలియజేయనప్పుడు తామెలా బాధ్యులు అవుతామంటూ ఆయన ప్రశ్నించారు.