రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి
తిరువొత్తియూరు: రాష్ట్రంలో మంగళవారం రాత్రి వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 10 నెలల పసికందుతో పాటు ఆరుగురు మృతి చెందారు. వ్యాన్ చెట్టును ఢీకొని ముగ్గురి మృతి: కోవై పాపంపట్టి సమీపం కోళ్లఫాం నుంచి బ్రాయిలర్ కోళ్లను ఎక్కించుకుని మంగళవారం రాత్రి వాల్పారైకు ఓ వ్యాన్ బయలుదేరింది. అన్నామలైకు చెందిన డ్రైవర్ ఆరుస్వామి (32). వ్యాన్ నడుపుతున్నాడు. వాల్పారైకు చెందిన శరవణన్ (29) కక్కన్‌రోడ్డుకు చెందిన లాలా (20) వ్యాన్‌లో ఉన్నారు.
అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఈ వ్యాన్ చన్రపాళయం వద్ద వస్తుండగా హఠాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీకొంది. ఈ ఘటనలో వ్యాన్‌లో ఉన్న ముగ్గురు అదే స్థలంలో మృతి చెందారు. సమాచారం అందుకున్న కినత్తుగౌడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
ఆటో బోల్తా: చిన్నారి మృతి :శీర్ఘాళి సమీపంలో కులైయారు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న 10 నెలల పసికందు అదే స్థలంలో మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్ల ప్రమాదం జరిగినట్టు ప్రజలు తెలిపారు. పోలీసులు ఆటోడ్రైవర్‌ను అరెస్టు చేశారు.
నక్కను బైకు ఢీకొని యువకుడి మృతి : ఉత్తుకోట, చెంగరై, తోటారెడ్డి కుప్పానికి చెందిన సెల్వం కుమారుడు మణి (21). ఇతను మంగళవారం రాత్రి ఊతుకోట నుంచి బైకులో ఇంటికి వస్తుండగా హఠాత్తుగా నక్క రోడ్డుపై అడ్డు రావడంతో బైకు నక్కను ఢీకొని మణి కింద పడి తీవ్ర గాయాలైంది. అదే సమయంలో నక్కకు గాయమై అడవిలోకి పారిపోయింది. ఆ మార్గంగా వచ్చిన ప్రజలు మణిని ఊతుకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
విద్యార్థి మృతి : మైలాపూర్ వీఎం రోడ్డులో ఉన్న ఇండియన్ బ్యాంక్ సమీపంలో బుధవారం ఉదయం బైకుపై వెళుతున్న విద్యార్థినిని ప్రభుత్వ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బస్సు చక్రం కింద పడిన విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.