ఏడడుగులు వేయకుండానే...
ఏడడుగులు వేయకుండానే...
Published Fri, May 26 2017 7:17 AM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుని ప్రేమను సార్థకం చేసుకోవాలనుకున్నారు. మరికొద్దిసేపట్లో ఏడడుగులు వేయబోతున్నారు. ఆ మధుర క్షణాల్ని ఊహించుకుంటూ ఆనందడోలికల్లో తేలిపోతున్నారు. అయితే విధి మరోలా తలచింది. యముని రూపంలో బస్సు దూసుకొచ్చింది వారి కలల్ని ఛిద్రం చేసింది. పెళ్లిదుస్తులు రక్తంతో తడిసిపోయాయి. వారి బంధానికి తాళికి ముందే నూరేళ్లు నిండింది.
► పెళ్లి వ్యాన్‌ను ఢీకొన్న బస్సు
► వధువు సహా 8 మంది మృతి, వరునికి తీవ్ర గాయాలు
బెంగళూరు: పెళ్ళిబృందంతో వెళ్తున్న టెంపో వ్యాన్‌ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో వధువుతో పాటు ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన గురువారం తెల్లవారజామున ఉత్తర కన్నడ జిల్లాలో సంభవించింది. భట్కళ తాలూకా అనంతవాడి సమీపంలో ఉన్న జాతీయ రహదారి– 66పై ఈ ఘోరం చోటు చేసుకుంది. టెంపో, బస్సులోని మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఉదయం పెళ్ళి జరగాల్సిన వధువు దివ్య కుడేర్కర్ (20), టెంపో డ్రైవర్ నాగప్ప గణిగార్ (45), టెంపోలో ఉన్న పాలాక్షి (42), బేబి (38), సుబ్రమణ్య(15), రుక్మిణి (65) సంఘటణ స్థలంలో తీవ్రగాయాలతో మృతి చెందారు. పూజా సేఠ్Š‡ అనే వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయారు. వరుడు హరీష్‌కు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ ఉమేష్ వాల్మికి (35) కూడా మరణించాడు.
దరిచేరని ప్రేమ వివాహం
దివ్య, హరీష్‌లు ఇద్దరూ ప్రేమించుకుని ఇరు కుటుంబాలను పెళ్ళికి ఒప్పించారు. గురువారం ఉదయం ధర్మస్థలంలో పెళ్ళి జరగాల్సి ఉంది. వధూవరులు, బంధువులు టెంపోలో వెళ్తుండగా, ప్రమాదం ఎదురైంది. దివ్య మృతి చెందిన విషయం చెబితే తట్టుకోలేడని ఆ సంగతి హరీష్‌కు తెలియనివ్వలేదు. గాయపడినవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు.
Advertisement