మరో ఆరుగురు రైతుల ఆత్మహత్య
బెంగళూరు(బనశంకరి) : రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మండ్య, చిక్కబళ్లాపుర, యాదిగిరి, తుమకూరు జిల్లాల్లో ఆదివారం ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
మండ్య : మండ్య జిల్లా పాండవపుర తాలూకా చిక్కబ్యాడరహళ్లికి చెందిన రైతు దేవరాజు(23) తనకున్న రెండెకరాల పొలంలో చెరుకు పంట సాగుచేసేందుకు రూ.4 లక్షలు దాకా అప్పులు చేశాడు. పంట సక్రమంగా చేతికి అందకపోవడంతో అప్పులకు వడ్డీ సైతం చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అప్పులు తీర్చాలంటూ ఒత్తిళ్లు మొదలయ్యాయి. దీంతో ఆదివారం తన ఇంటిలో దేవరాజు ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై పాండవపుర పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే జిల్లా మళవళ్లి తాలూకా అలగూరు హొబళి కల్లకట్టి గ్రామానికి చెందిన రైతు ఉమేష్(36) పంట పెట్టుబడుల నిమిత్తం చేసిన రూ. 3 లక్షల అప్పు తీర్చే మార్గం కానరాక ఆదివారం తన ఇంటిలో ఉరి వేసుకున్నాడు. ఘటనపై హలగూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
యాదగిరి : యాదగిరి తాలూకా గుంజనూరు గ్రామానికి చెందిన మహిళా రైతు తాయమ్మ(40) తమకున్న 20 ఎకరాల భూమిలో చెరుకు, రాగి, సోయాబీన్స్ తదితర పంటలు సాగు చేశారు. వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం రూ.4 లక్షల మేర అప్పులు చేశారు. వర్షాభావం కారణంగా పంటనష్టం కావడంతో అప్పులు తీర్చే దారిలేక తీవ్రమనస్థాపం చెంది తాయమ్మ ఇంటిలో విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తీవ్రఅస్వస్ధతకు గురైన తాయమ్మను స్థానిక ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి, కలబురిగి జిల్లాసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఆమె మరణించారు. ఘటనపై గురుమిఠకల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
చిక్కబళ్లాపుర :శిడ్లఘట్ట తాలూకా ఎణ్ణందూరు గ్రామానికి చెందిన రైతు మునిశామప్ప(40), తనకున్న పొలంలో వ్యవసాయం చేయడానికి పెట్టుబడుల నిమిత్తం లక్షాంతర రూపాయలు అప్పులు చేశాడు. పంటనష్టం రావడంతో అప్పులు తీరేదారిలేక ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తోటలో చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఘటనపై శిడ్లఘట్ట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
తుమకూరు : తుమకూరు జిల్లా చిక్కహొన్నహళ్లికి చెందిన రైతు శ్రీనివాస్(40), పంటల పెట్టుబడుల కోసం సహకార బ్యాంకులో రూ.50 వేలతో పాటు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు చేశాడు. వర్షం లేక పంట నష్టం రావడంతో అప్పు తీర్చేదారిలేక ఆదివారం మధ్యాహ్నం ఇంటిలో ఉరివేసుకున్నాడు. ఇదే జిల్లా శిరా తాలూకా బెంచఘట్ట సమీపంలోని లక్కనహళ్లికి చెందిన రైతు నాగరాజు(55) తనకున్న ఐదెకరాల పొలంలో పంట పెట్టుబడుల కోసం రూ. 5 లక్షల మేర అప్పులు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పంట నష్టపోయాడు. దీంతో ఆదివారం ఉదయం తన పొలంలోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు.