స్మార్ట్ చాయిస్!
Published Sun, Jan 5 2014 10:58 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
ఇంట్లో టీవీ లేనిదే ఇప్పుడు ఎవరికీ పొద్దు పోదు.. ఇదో నిత్యావసరంగా మారిపోయింది. ఒకప్పుడు భారీ పరిమాణంలో ఉండే టీవీలు ఇప్పుడు చిక్కిపోయి అతి సన్నటి ఎల్‌ఈడీలుగా మారిపోయా యి. వాటిలోనూ కొత్తదనం, నాణ్యత, సాంకేతికతను నగరవాసులు కోరుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్ల మాదిరిగా స్మార్ట్ టీవీలు సందడి చేస్తున్నాయి. చేతి సైగల నూ అర్థం చేసుకోగలిగే మోషన్ టీవీలు అందుబాటులోకి వచ్చాయి.
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న పరికరాలను కొనుగోలు చేసేందుకు నగరవాసులు ఆసక్తి కనబరుస్తున్నారు. రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కలర్ టీవీల స్థానంలో వచ్చిన ఎల్‌సీడీలు ఇప్పుడు పాతవైపోయాయి. వాటి స్థానంలో వచ్చిన ఎల్‌ఈడీలు, త్రీడీ ఎఫెక్ట్ టీవీలు రాజ్యమేలుతున్నాయి. సామాన్యుల ఇళ్లలో కలర్ టీవీలు ఉంటేనే గొప్పగా భావించే కాలం నుంచి ఎల్‌సీడీ, ఎల్‌ఈడీల వాడకం కూడా సాధారణమయ్యే పరిస్థితి వచ్చేసింది. ఆర్థికంగా ఉన్న వారు ఎల్‌ఈడీలు అందులో స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. నూతనంగా నిర్మిస్తున్న భవనాల్లో 32, 42 అంగుళాల టీవీలను ముందుగానే ఏర్పాటుచేసుకుంటున్నారు. పాత టీవీలను అమ్మేసి కొత్త ఎల్‌ఈడీ, స్మార్ట్ టీవీలు కొనుగోలు చేసే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది.
ఎల్‌సీడీల స్థానంలో ఎల్‌ఈడీలు
పిక్చర్ ట్యూబ్ టీవీల స్థానంలో వచ్చిన లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే(ఎల్‌సీడీ) టీవీలు ఒకప్పుడు సందడి చేశాయి. బొమ్మలో స్పష్టత, కంటిపై ప్రభావం పెద్దగా ఉండకపోవడం, తక్కువ స్థలంలో పెట్టుకునే వెసులుబాటు, అందంగా కనిపించడం ఇలా ఎన్నో ఫీచర్లు ఉండడంతో అన్ని వర్గాల వారు మొగ్గు చూపారు. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో ఎల్‌సీడీ స్థానంలో లైట్ ఎమిటింగ్ డియోడ్(ఎల్‌ఈడీ) టీవీలు వచ్చాయి. వీటిలో అత్యంత స్పష్టతతో కూడిన దృశ్యాలు, నాణ్యమైన సౌండ్ వంటి సదుపాయాలు వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
కొత్త కొత్త మోడళ్లు
ఒకప్పుడు కలర్ టీవీకి వెచ్చించిన డబ్బుతో ఇప్పుడు ఎల్‌ఈడీ టీవీలను కొనుగోలు చేసుకునే అవకాశం వచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో 22 నుంచి 42 అంగుళాల ఎల్‌ఈడీ టీవీలు రూ.12వేల నుంచి రూ.80వేల మధ్యలో లభ్యమవుతున్నాయి. ఇవే కాకుండా ఎల్‌జీ కంపెనీ 72 అంగుళాల ఎల్‌ఈడీ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టీవీ ధర సుమారుగా రూ.7లక్షల వరకు ఉందని చెబుతున్నారు. అలాగే, సోనీ కంపెనీ తీసుకొచ్చిన 4కే టీవీలో కంప్యూటర్‌లో ఉండే అన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇంటర్నెట్ ద్వారా ప్రతి రోజు చాటింగ్ చేసే వారు ఇలాంటి టీవీలు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. బ్లూటూత్, యూఎస్‌బీ సపోర్ట్ వంటి ఆప్షన్లు ఉండే వాటిని ఎక్కువ మంది కోరుకుంటున్నారు.
మోషన్ కంట్రోల్ టీవీలదే భవిష్యత్తు..
ఎల్‌ఈడీ టీవీల్లో ఇంటర్నెట్ ఆప్షన్లతో పాటు త్రీడీ ఎఫెక్ట్, హైడెఫినేషన్(హెచ్‌డీ) క్లారిటీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మరింత అడ్వాన్స్‌గా సామ్‌సంగ్ కంపెనీ మోషన్ కంట్రోల్ పేరిట కొత్త టీవీని మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ టీవీకి ఉన్న ఇన్‌బిల్ట్ కెమెరా ముందు నిలబడి చేతి సైగలతోనే టీవీని ఆపరేట్ చేయవచ్చు. ఇన్‌బిల్ట్ కెమెరా ఉన్న 46 అంగుళాల టీవీ రూ.1.45 లక్షలు, కెమెరా లేని మోడల్ 32 అంగుళాల టీవీ రూ.43,500లో ఉంది.
Advertisement
Advertisement