సాక్షి, ముంబై: షిర్డీలో ప్రసాదాలయ భవనం టెరెస్‌పై ఏర్పాటుచేసిన ‘సోలార్ స్టీం కుకింగ్ ప్రాజెక్టు’కు కేంద్ర భారీ విద్యుత్ శాఖ, దానికి పురస్కారం ప్రకటించింది. ఈ పురస్కారాన్ని ఈ నెల 17వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర భారీ విద్యుత్ శాఖ మంత్రి డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ప్రదానం చేయనున్నట్లు షిర్డీ సాయి సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. షిర్డీ పుణ్య క్షేత్రంలో సాయి సంస్థాన్ నిత్యం వేలాది మందికి నామమాత్రపు రుసుం తీసుకుని భోజన వసతి కల్పిస్తోంది. భారీగా తయారుచేసే వంటకాలకు నిత్యం పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగమవుతోంది. విద్యుత్ పొదుపు చేయాలనే ఉద్దేశంతో సాయి సంస్థాన్ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచంలోనే అత్యంత భారీ సోలార్ స్టీం కుకింగ్ ప్రాజెక్టును నెలకొల్పింది. దీన్ని 2009 జూలై 30న ప్రారంభించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజు 260 కిలోల గ్యాస్ ఆదా అవుతోంది. ఆ ప్రకారం బాబా సంస్థాన్‌కు సరాసరి రోజుకు రూ.21వేల విలువైన ఇంధనం ఆదా అవుతోంది. అంతేకాక తరుచూ పెరుగుతున్న గ్యాస్ ధర బెడదనుంచి సంస్థాన్‌కు విముక్తి లభించింది. ప్రాజెక్టుకు ఇండియన్ బాయిలర్ యాక్ట్ ప్రకారం ఇటీవలే మార్పులు చేశామని మోరే అన్నారు. ప్రమాదాలకు ఏ మాత్రం ఆస్కారమివ్వకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
అందుకు కొందరు నిపుణులను, సలహాదారులను ప్రత్యేకంగా నియమించారు. కాగా, పురస్కారం అందుకునేందుకు సాయి సంస్థాన్ పదాధికారులు ఆ రోజు ఢిల్లీకి రావాలని విద్యుత్ శాఖ సమాచారం పంపింది. పురస్కారం ప్రకటించిన విషయం తెలియగానే ప్రసాదాలయం నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్న ఉత్తం గోంద్కర్, మెకానికల్ విభాగం చీఫ్ అమృత్ జగ్తాప్, ఇతర సిబ్బందిని సంస్థాన్ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జయంత్ కులకర్ణి, కలెక్టర్, సంస్థాన్ సభ్యుడు సంజయ్‌కుమార్, డిప్యూటీ కార్యనిర్వాహక అధికారి, తహశీల్దార్ అప్పాసాహెబ్ షిందే తదితరులు అభినందించారు.
షిర్డీ సోలార్ ప్రాజెక్టుకు పురస్కారం
Published Thu, Dec 12 2013 12:01 AM | Last Updated on Mon, Oct 22 2018 8:31 PM
Advertisement
Advertisement