పట్టుబడితే భారీగా జరిమానా
నగరంలో స్పెషల్ డ్రైవ్
నెలకు రూ.50 లక్షల వసూలు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ‘మద్యం మన కాపురాలను కూలుస్తుంది’, ‘మద్యం ఇంటికి, దేశానికి చెడుపు’ అంటూ భారీ ఎత్తున ప్రచారాలు చేస్తున్న ప్రభుత్వాలే మద్యం అమ్మకాలను పెంచేందుకు తహతహలాడుతున్నాయి. చెన్నై నగరంలో ప్రతి శని, ఆదివారాల్లో కొత్తగా మద్యం తాగే యువకులు అధికమవుతున్నారు. వారాంతపు రోజుల పేరుతో శుక్రవారం రాత్రి నుంచే మద్యం షాపుల వద్ద యువకులు బారులు తీరుతున్నారు. ఇళ్ల నుంచి మోటార్ సైకిల్ లేదా కార్లలో బయలుదేరేపుడు రోడ్డు నిబంధనలకు కట్టుబడి వాహనాలను నడిపే యువత తిరుగు ప్రయాణంలో మద్యం మత్తులో ప్రమాదాలు సృష్టిస్తున్నారు. అతివేగంతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు మద్యం మత్తులో ప్రమాదం చేసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంచలనం సృష్టించింది. ఇటీవల ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఇంటి సమీపంలోనే కారు ప్రమాదం జరిగింది. ప్రమాదం చేసి పారిపోయిన యువకులు ప్రముఖులకు చెందిన వారు కావడంతో వివరాలు తెరమరుగయ్యాయి. న్యూ ఆవడి, ఈసీఆర్, ఓఎమ్‌ఆర్ రహదారుల్లో ప్రమాదాలు పరిపాటిగా మారాయి. మద్యం బాబుల ఆగడాలు, ప్రమాదాలు పెచ్చుమీరిపోగా ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
దీనికి అడ్డుకట్ట వేసేందుకు నగర కమిషన్ జార్జ్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ అదనపు కమిషనర్ తామరకన్నన్ నేతృత్వంలో వాహనాల తనిఖీలు ముమ్మురం చేశారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి మౌత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు చేస్తున్నారు. మద్యం తాగి వాహనం తోలుతున్నట్లు రుజువైతే వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసులు పెడుతున్నారు. ఎంతో కొంత అదుపులో ఉండే మద్యం బాబులను ఆటోలో ఇళ్లకు పంపుతున్నారు. ఫూటుగా మద్యం తాగి నడవలేని స్థితిలో ఉన్న వారి వద్దనున్న సెల్‌ఫోన్ ద్వారా ఇంటివారిని రప్పించి పంపుతున్నారు. ఇలా రోజుకు కనీసం 70 మంది పట్టుబడుతున్నట్లు పోలీసులు చెప్పారు.
జరిమానా రూ.2500..
మద్యం మత్తులో పట్టుబడేవారి కిక్కుదిగేలా పోలీసులు జరిమానా విధిస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు తోలుతూ పట్టుబడిన వారికి రూ.2500 జరిమానా విధిస్తున్నారు. మద్యానికే రూ.300 అయిందని మందుబాబులు వాపోతున్నట్లు పోలీసులు చెప్పుకుని నవ్వుకుంటున్నారు. మద్యం తాగి వాహనాన్ని నడిపినందుకే రూ.2500, లెసైన్సు, ఇన్సూరెన్సు తదితర పత్రాలు సరిలేకుంటే మరో రూ.4వేలు ఇచ్చుకోవాల్సిందే.
నెలకు రూ.50 లక్షలు వసూలు..
మద్యం వ్యసనం వల్ల మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నా పోలీస్ ఖజానా మాత్రం భారీగానే నిండుతోంది. రాత్రి 8 నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు జరుపుతున్న వాహన తనిఖీల ద్వారా నెలకు రెండు వేల మంది పట్టుబడుతూ రూ.50లక్షల జరిమానా సొమ్ము వసూలవుతున్నట్లు సమాచారం.
మందుబాబులూ పారాహుషార్
Published Tue, May 5 2015 2:32 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM
Advertisement
Advertisement