పచ్చని అడవుల్లో నెత్తుటి చాళ్లు | Special focus on AOB encounter | Sakshi
Sakshi News home page

పచ్చని అడవుల్లో నెత్తుటి చాళ్లు

Published Sun, Oct 30 2016 2:25 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

పచ్చని అడవుల్లో నెత్తుటి చాళ్లు - Sakshi

పచ్చని అడవుల్లో నెత్తుటి చాళ్లు

గలగల పారే సీలేరు.. తోడుగా ఎన్నో సెలయేళ్లు.. దట్టమైన అడవులు, కొండలు, గుట్టలు.. వాటి ఆధారంగా నిర్మించిన ప్రాజెక్టులు.. అవి సృష్టించిన సమస్యలు.. అడవి బిడ్డల ఆకలికేకలు ఆ ప్రాంతాన్ని తుపాకీ గొట్టం ముందు నిలబెట్టాయి. విప్లవ పంథా వైపు నడిపించాయి. పచ్చని అడవులు నెత్తుటి చాళ్లుగా మారాయి. ఆ నేల.. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ జోన్(ఏవోబీ). ఏవోబీ జోన్ దశాబ్దాలుగా మావోలకు పెట్టని కోటగా.. పోలీసులకు పెనుసవాల్‌గా నిలిచింది. తొలిసారిగా అక్కడకు పోలీసులు చొచ్చుకెళ్లి జరిపిన ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా అతి పెద్దదిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఏవోబీ, కటాఫ్ ఏరియా, ‘బలిమెల’ తదితర అంశాలపై ప్రత్యేక కథనాలు..    - ఫోకస్‌లో

 
 1964 పశ్చిమబెంగాల్‌లోని నక్సల్బరీలో పురుడుపోసుకున్న ఉద్యమం
 1982 ఈస్టు డివిజన్‌లో కార్యకలాపాలు
 1985 విస్తరించిన ఉద్యమం..
 2004 పీపుల్స్ వార్ గ్రూపుగా మార్పు

 
 నక్సల్బరీ నుంచి...

 భూమి కోసం.. భుక్తి కోసం.. అన్న నినాదంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నక్సల్‌బరీ అనే చిన్న గ్రామంలో 1964లో నక్సలైట్ ఉద్యమం పురుడు పోసుకుంది. ఈ ఉద్యమానికి శ్రీకర్త చారుముజుందార్. భూ స్వాముల కబందహస్తాల్లో చిక్కుతున్న పీడిత ప్రజల విముక్తే లక్ష్యంగా తుపాకీ ద్వారా రాజ్యాధికారం సాధించాలన్న ధ్యేయంతో ప్రారంభమైన నక్సల్ ఉద్యమం కాలక్రమంలో అనేక పరిణామాలకు లోనైంది. 1967లో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు విస్తరించింది. దశాబ్దకాలంపాటు ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టిన ఈ ఉద్యమంపై 1977లో రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న జలగం వెంగళరావు ఉక్కుపాదం మోపారు. ఆయన స్వయంగా శ్రీకాకుళం జిల్లా సీతంపేటకు వచ్చి సాయుధ బలగాలతో ఫ్లాగ్‌మార్చ్ జరిపి ఉద్యమ నాయకులను వెతికి మరీ మట్టుబెట్టించారు.     
- సాక్షి, విశాఖపట్నం ప్రతినిధి ఉమాకాంత్, ఏవోబీ నుంచి ‘సాక్షి’ బృందం

 అక్కడ గతి తప్పిన ఉద్యమం తెలంగాణలో ఊపిరిపోసుకుంది. అలా 1982 నాటికి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోకి ప్రవేశించింది. అప్పట్లో వరంగల్ ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల(ఆర్‌ఈసీ)లో చదువుకునే విద్యార్థులు నక్సలైట్ ఉద్యమం పట్ల బాగా ఆకర్షితులయ్యారు. దీంతో మొదట్లో తెలంగాణ కు చెందిన వారే ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. 1985 నాటికి ఉద్యమం బాగా విస్తరించింది. మేధావి వర్గం గిరిజనులకు అక్షరాలు నేర్పించేది. జరుగుతున్న శ్రమదోపిడీ గురించి వివరించి.. చైతన్యపరిచి తిరుగుబాటు చేయాలని సూచించేది. ఉద్యమాలు చేయించేది. దీంతో గిరిజనులు మావోయిస్టులతో మమేకం అయ్యారు. తమ కోసం నక్సలైట్లు ప్రాణాలు పణంగా పెడుతున్నారని నమ్మిన గిరిజనులు క్రమంగా నక్సలైట్ ఉద్యమంలో చేరడం మొదలు పెట్టారు. పోలీసుల నుంచి రక్షణ కల్పించేవారు.

 గిరిజనుడి నేతృత్వం
 నక్సలైట్ ఉద్యమంలో జాంబ్రీ అనే పేరుకు విశిష్ట స్థానం ఉంది. ఈస్టు డివిజన్‌లో ఒక గిరిజనుడు మొదటిసారిగా డిప్యూటీ కమాండర్ స్థాయికి ఎది గాడు. అతడిని జాంబ్రీ అని పిలిచేవారు. 1989లో జరిగిన ఎన్‌కౌంటర్లో జాంబ్రీ మరణించారు. అయినా ఆ పేరుతో అనేకమంది పనిచేశారు. 1990 నాటికి ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది.

 2004లో పునరేకీకరణ
 దశాబ్దాలపాటు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పేరుతో కొనసాగిన సీపీఐ(ఎంఎల్) వర్గాల పునరేకీకరణతో దేశవ్యాప్తంగా 2004 సెప్టెంబర్ 21న సీపీఐ(మావోయిస్టు) పార్టీ అవతరించింది. ఆంధ్ర నుంచి తూర్పు కనుమలు, దండకారణ్యం మీదుగా నేపాల్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటే దీని లక్ష్యం. నక్సలిజం అప్పటి నుంచి మావోయిస్టు ఉద్యమంగా రూపుమారింది. విధ్వంసాలు పెరిగాయి. 2000 వరకు  తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో నాగులకొండ, తాండవ, శబరి, కోరుకొండ దళాలు ఉండేవి. అప్పట్లో ఉద్యమమంతా కొయ్యూరు, జీకేవీధి, చింతపల్లి మండలాల్లోనే కేంద్రీకృతమైంది. 2000లో అదిలాబాద్ జిల్లా కొయ్యూరులో జరిగిన ఎన్‌కౌంటర్లో నరేష్, శ్యామ్, మురళీ అనే ముగ్గురు అగ్రనేతలు మరణించారు. అప్పట్నుంచి మావోయిస్టులు వ్యూహాలు మార్చారు.

దళాలను వదిలిపెట్టి ఏరియా కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో కోనలోవ, పలకజీడి, గాలికొండ, కోరుకొండ ఏరియా కమిటీలు ఏర్పాటయ్యాయి. వాటికి కార్యదర్శులు నేతృత్వం వహించేవారు. గత కొన్నేళ్లుగా తూర్పుగోదావరి పరిధిలోని కోనలోవ, పలకజీడి కమిటీ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతానికి విశాఖ జిల్లాలో గాలికొండ, కోరుకొండ, పెదబయలు కమిటీలున్నాయి. గతేడాది మే 4న జరిగిన మర్రిపాకల ఎన్‌కౌంటర్‌లో గాలికొండ ఏరియా కమిటీకి చెందిన ఆజాద్ మరణించడంతో ఆ కమిటీ కూడా బలహీనపడింది. ఈస్ట్ డివిజన్ కమిటీని ఏర్పాటు చేసి ఒడిశాలోని కొరాపుట్, మల్కన్‌గిరి, ఆంధ్రాలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల కు ఏరియా కమిటీలను ఏర్పాటు చేశారు. మావోయిస్టు పార్టీ ఆవిర్భావం తర్వాతే ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏవోబీ) జోన్ ఏర్పడింది. రెండు రాష్ట్రాల మధ్య బలిమెల రిజర్వాయర్‌ను ఆనుకొని ముంచంగిపుట్టు మండలం నుంచి ఇటు జీకేవీధి వరకు.. కోరాపుట్, మల్కన్‌గిరి జిల్లాల మధ్య ఉన్న కటాఫ్ ఏరియాను షెల్టర్‌జోన్‌గా చేసుకొని మావోయిస్టులు ఇక్కడ నుంచి ఛత్తీస్‌ఘడ్, ఒడిశా, ఆంధ్ర రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

 మూడు రకాల మిలీషియా ఏర్పాటు
 1999-2005 మధ్యలో ఈస్టు డివిజన్‌లో మావోయిస్టులు మూడు దశలో మిలీషియాలను ఏర్పాటు చేశారు. మొదట సాధారణ మిలీషియా దళాలనే ఏర్పాటు చేశారు. తర్వాత వాటిలోని సభ్యులకు ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. మందుపాతరలను అమర్చడం, పేల్చడం, ఆ వెంటనే తప్పించుకోవడంలో కూడా తర్ఫీదు ఇచ్చారు. గ్రామాల్లో సాధారణ పౌరుల్లానే ఉండే మిలీషియా సభ్యులు పోలీసుల కదలికలను గమనిస్తూ.. అవసరమైనప్పుడు ముందుగానే అమర్చిన మందుపాతర్లను పేల్చేవారు. దీని తరువాత పీపుల్స్ మిలీషియాను ఏర్పాటు చేశారు. ప్రజలే మిలీషియాగా ఉంటారు. మావోయిస్టు పార్టీకి కళ్లు, చెవులుగా మసలిన మిలీషియా సభ్యులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం.. లొంగుబాట్లతో క్రమంగా ఈ సంఘాలు బలహీనపడ్డాయి. దీనికి ముందుగా విప్లవ ప్రజా కమిటీలు(ఆర్‌పీసీ)లుండేవి.
 
 కాఫీ తోటలే ఆయువుపట్టు
 ఒకప్పుడు మావోయిస్టులు భూమి కోసం.. గిరిజనుల పంటలకు గిట్టుబాటు ధరల కోసం పోరాటాలు చేసేవారు. తర్వాత అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులతో ఆందోళన చేయించారు. గత ఎనిమిదేళ్ల నుంచి మావోయిస్టులు పంథా మార్చారు. మన్యంలో ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధి సంస్థ(ఏపీఎప్‌డీసీ) పరిధిలో ఉన్న పదివేల ఎకరాల కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేయాలన్న డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. కొన్ని చోట్ల వారే పంపిణీ చేశారు కూడా. దీనిలో భాగంగా అప్పట్లో కాఫీ బోర్డు రేంజర్‌ను కాల్చి చంపారు. మర్రిపాకల నుంచి కుంకుంపూడి వరకు కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేశారు. పోలీసులకు భయపడి కొందరు గిరిజనులు వాటిని తీసుకోలేదు.
 
 బాక్సైట్ వ్యతిరేక పోరాటం
 పీపుల్స్‌వార్ ఉన్నప్పుడే 1999 నుంచి ఏవోబీలో బాక్సైట్ వ్యతిరేక పోరాటాన్ని ప్రధాన ఆయుధంగా చేసుకుంది. మావోయిస్టు పార్టీ ఏర్పడిన అనంతరం కూడా అదే పోరాటం కొనసాగిస్తోంది. ఒడిశాలోని కొరాపుట్ జిల్లా నియమగిరి కొండల్లోనూ, విశాఖ మన్యంలోనూ విస్తారంగా ఉన్న బాక్సైట్ నిక్షేపాలను వెలికితీసి అల్యూమినా కర్మాగారాలు ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. బాక్సైట్ తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని, గిరిజనుల మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులను ముందుంచి మావోయిస్టులు ఉద్యమాలు నడిపిస్తున్నారు. 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలను అరబ్‌దేశానికి అప్పగిస్తూ ఆదేశాలి చ్చింది. దీనిపై మావోలు పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం 97 జీవోను తెరపైకి తెచ్చి తిరిగి బాక్సైట్ తవ్వకాలకు ప్రయత్నాలు చేపట్టడంతో మావోయిస్టు ఉద్యమం మళ్లీ ఊపందుకుంది.
 
 హత్యలు.. కిడ్నాప్‌లు.. ఎన్‌కౌంటర్లు
 పీపుల్స్‌వార్ కార్యకలాపాలు 1980 నుంచి మన్యంలో ఊపందుకున్నాయి. విశాఖ, తూర్పుగోదావరి అటవీ ప్రాంతాల్లో పూర్తిగా వారి ఆధిపత్యమే ఉండేది. ఈ క్రమంలో పలుచోట్ల నక్సలైట్లకు, పోలీసులకు మధ్య అనేక హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎక్కువగా సీపీఐకి చెందిన నేతలను మావోయిస్టులు హతమార్చారు. మొదట ప్రముఖ మేధావిగా పేరు తెచ్చుకున్న మేకా సూరిబాబును, అనంతరం నూకినాయుడును చంపారు. దానికంటే ముందు సుబ్బారావును చంపేశారు. దీంతో పాటు ఒక పాస్టర్‌ను కూడా హతమార్చారు.

► 1988లో వడ్కాపూర్ చంద్రమౌళి అలియాస్ దేవన్న ఆధ్వర్యంలో నక్సలైట్లు తూర్పుగోదావరి జిల్లా గుర్తేడు అటవీ ప్రాంతంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. కొద్దిరోజుల తరవాత వారిని వదిలిపెట్టారు.
► 1990 నుంచి 2000 మధ్య నక్సలైట్లు అనేక విధ్వంసాలకు పాల్పడ్డారు. ప్రధానంగా విశాఖ జిల్లా దారకొండలోని ఔట్‌పోస్టుపై మావోయిస్టులు జరిపిన మెరుపుదాడిలో పలువురు పోలీసులు మరణించారు. ఇదే దశాబ్దంలో చింతపల్లి మండలం బూరుగుపాకలు ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు, జి.మాడుగుల మండలం గొందిపల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు.
► 199192లో నక్సలైట్లు కొయ్యూరు అటవీ ప్రాంతానికి వెళ్లిన అప్పటి ఐటీడీఏ పీవో దాసరి శ్రీనివాసులు, చింతపల్లి ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజులను కిడ్నాప్ చేశారు. 28 రోజులు తమ ఆధీనంలోనే ఉంచుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యుడు క్రాంతి రణదేవ్‌ను వదిలిపెట్టాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు. దీంతో రణదేవ్‌ను ప్రభుత్వం విడిచిపెట్టడంతో బాలరాజును నక్సలైట్లు వదిలేశారు. అప్పట్లో అదో సంచలనం. పౌరహక్కుల సంఘం నేతలు కొయ్యూరులో సుమారు నెల రోజుల పాటు ఉండిపోయారు. పోలీసు యంత్రాంగం అంతా కొయ్యూరు నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. ఆతర్వాత రిటైర్డ్ డీఎస్పీ పోతారెడ్డిని నక్సలైట్లు విశాఖలో హత మార్చారు.
► 1997లో చింతపల్లి మండలం లోతుగెడ్డ వద్ద మందుపాతరతో పోలీస్ జీపును పేల్చివేసిన ఘటనలో ఏడుగురు పోలీసులు ప్రాణాలు వదిలారు. అదే ఏడాది మంత్రి అయ్యన్నపాత్రడు తమ్ముడు శ్రీనును హతమార్చారు.
► 2002లో చోడవరం, అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్లపై మావోయిస్టులు దాడి చేసి ముగ్గురు కానిస్టేబుళ్లను కిడ్నాప్ చేశారు.  చిట్టిబాబు అనే కానిస్టేబుల్‌ను ప్రజాకోర్టు నిర్వహించి హతమార్చారు. మిగిలిన ఇద్దరిని విడిచిపెట్టారు.
► 2004లో అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి మత్స్యరాస మణికుమారి భర్త, సీనియర్ టీడీపీ నేత వెంకటరాజును పాడేరులో మావోయిస్టు యాక్షన్‌టీం సభ్యులు హతమార్చారు.
► 2007లో విశాఖపట్నం జెడ్పీ వైస్‌చైర్మన్‌గా ఉన్న కాంగ్రెస్ నేత సమిడ రవిశంకర్‌ను హుకుంపేటలో హతమార్చారు.
► 2008లో కూంబింగ్ అనంతరం బలిమెల రిజర్వాయర్ మీదుగా పడవలో తిరిగి వస్తున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు రాకెట్ లాంచర్‌తో దాడి చేశారు. ఆ దాడిలో 33 మంది గ్రేహౌండ్స్ సిబ్బందితో సహా 38 మంది పోలీసులు జలసమాధి అయ్యారు.
► 2011లో చింతపల్లి జెడ్పీటీసీ సభ్యుడు, కాంగ్రెస్ నేత ఉగ్రంగి సోమలింగాన్ని, 2012లో పాడేరులో ఎస్‌బీ కానిస్టేబుల్ అప్పన్నను హతమార్చారు.
► 2015లో విశాఖ మన్యంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ హతమయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement