కొత్త వారికి కొంచెం కష్టమే
కొత్త వారికి సినిమా కొంచెం కష్టమేనంటోంది నటి మనీషా యాదవ్. ఇటీవల యువ నటుడు జి.వి.ప్రకాష్‌కుమార్‌కు ముద్దుల వర్షం కురిపించి కలకలం సృష్టించిన ఈ ఉత్తరాది బ్యూటీ వళక్కు ఎన్ 18/9. చిత్రంతో కోలీవుడ్‌లోకి కాలు పెట్టింది. తొలి చిత్రంతోనే విజయానికి పలువురి ప్రశంసలను మూటకట్టుకున్న ఈ భామ త్రిష ఇల్లన్న నయనతార చిత్రంతో జి.వి. ప్రకాష్‌కుమార్‌కు ఒక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ముద్దుల సన్నివేశాలు గురించి కాకుండా మరే విషయం గురించి అయి నా అడగవచ్చునన్న మనీషా యాదవ్‌తో చిన్న భేటీ...
ప్రశ్న: వళక్కు ఎన్ 18/9 చిత్రం తరువాత మీ హవా సాగు తుందనుకుంటే అలా జరగలేదే?
జవాబు: నాకు చిత్రాల సంఖ్య ముఖ్యం కాదు. చాలా సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుని నటిస్తున్నాను. వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించడం లేదు. సినిమా నాకు ఫ్యాషన్. నాకు సౌకర్యంగా, శ్రమలేని పాత్రలనే ఒప్పుకుంటున్నాను.
ప్రశ్న: ఎంతవరకు చదివారు?
జవాబు: ఏడాది క్రితమే బీకామ్ పూర్తి చేశాను. చేతిలో డిగ్రీ కూడా ఉంది. ఫ్యాషన్ డిజైన్ నేర్చుకోవాలనే కోరిక ఉంది. ఖాళీ సమయాల్లో ఏదైనా డ్రస్ డిజైన్ చేస్తుంటాను.
ప్రశ్న: త్రిష ఇల్లన్న నయనతార చిత్రంలో మీ పాత్ర?
జవాబు: నా పాత్ర పేరు అతిథి. ఇది చాలా జాలీగా సాగే కథే. జీవిని ప్రేమించే ఇద్దరు హీరోయిన్లలో నేను ఒకరిని. నా పాత్ర యువతకు బాగా నచ్చుతుంది.
ప్రశ్న: ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు ఆడారట?
జవాబు: అవును. ఒక ఐటమ్ సాంగ్‌కు నటించా. ఇందులో డాన్స్ చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఆండ్రియా పాడిన ఓ కాల్టీ అనే పాట కుర్రకారుకు గిలిగింతలు పెట్టి, ఉర్రూతలూగిస్తుంది.
ప్రశ్న: గ్లామరస్‌గా నటించడానికి ఉబలాటపడుతున్నారట?
జవాబు: అలా అని కాదు. నాకు నప్పే కథా పాత్రలనే చేస్తున్నాను. మరో విషయం ఏమిటంటే నేను సినిమా కుటుంబం నుంచి రాలేదు. అందువలన నాకు సినిమా కొత్త. అందుకే జాగ్రత్తగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక గ్లామర్ అంటారా? అది ఎంత వరకు అవసరం అన్నది ఆలోచిస్తాను. కథకు అవసరం అయితే ఆ పరిధిల్లో నటిస్తాను.
ప్రశ్న: స్టార్ హీరోలతో నటించాలని ఆశ లేదా?
జవాబు: అలాంటి ఆశ లేని వారెవరైనా ఉంటారా? అలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. అయితే కాలం కలిసి రావాలి. అదృష్టం తలుపు తట్టాలి.
ప్రశ్న: ఎలాంటి పాత్రలు నటించాలని ఆశ పడుతున్నారు?
జవాబు: హీరోయిన్లకు యాక్షన్ కథా పాత్రలు లభించడం అరుదైన విషయం. అలాంటి పాత్ర నాకు ఒరు కుప్పై కతై చిత్రంలో లభించింది. ఆ పాత్రల్లో నటించడానికి ముందు ఉత్సాహపడ్డ దెబ్బలు బాగానే తగిలాయి. హీరోల కష్టాలేమిటో ఇప్పుడు అర్థం అవుతోంది. సినిమాలో అన్నీ నేర్చుకోవడం అవసరం అనుకుంటున్నాను.
ప్రశ్న: నూతన తారలు రాణించకపోవడానికి కారణం ఏమిటంటారు?
జవాబు: టాప్ లెవల్‌కు చేరుకోవాలని అందరికీ ఉంటుంది. నంబర్‌వన్ స్థానాన్ని అందుకోవాలని ఆశపడతారు. త్రిష, నయనతార, హన్సిక ప్రముఖ హీరోయిన్లుగా వెలుగొందుతున్నట్లే ఏదో ఒక చిత్రం విజయంతో తన లాంటి వారు ప్రముఖ హీరోయిన్లుగా పేరు తెచ్చుకుంటాం. ఏదైనా నూతన తారలకు సినిమా కొంచెం కష్టమే.