సాక్షి, చెన్నై : స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం నేతృత్వంలో సాగిన ఈ భేటీలో ఇందుకు తగ్గ ప్రత్యేక చర్చ సాగింది. అలాగే, కావేరి చర్చ, స్థల రిజిస్ట్రేషన్లు, ఈశాన్య రుతు పవనాల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తగ్గట్టుగా ముందు జాగ్రత్తలకు సిద్ధం అవుతూ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీ తదుపరి మంత్రులందరూ తమ తమ శాఖల సమీక్షల్లో బిజీ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జె.జయలలిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దృష్ట్యా, ఆమె పరిధిలో ఉన్న శాఖలన్నీ ఆర్థిక మంత్రి ఓ.పన్నీరు సెల్వం గుప్పెట్లోకి చేరిన విషయం తెలిసిందే. ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు ఇందుకు తగ్గ ఆదేశాలు జారీ చేశారు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని పలు సమస్యలు, డిమాండ్లు చుట్టుముట్టి ఉండడంతో వాటిని ఎదుర్కొనేందుకు తగ్గ అస్త్రం సిద్ధం చేసుకొనేందుకు పన్నీరు నిర్ణయించారు. ఇందు కోసం కేబినెట్ భేటీకి పిలుపు నిచ్చారు. బుధవారం సచివాలయంలో పన్నీరు సెల్వం నేతృత్వంలో ప్రప్రథమంగా భేటీ సాగింది. ఇందులో మంత్రులందరూ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు, సలహాదారు షీలా బాలకృష్ణన్‌లు కూడా హాజరయ్యారు. ప్రధానంగా స్థానిక ఎన్నికల రద్దు అంశంపై ప్రత్యేక చర్చ సాగినట్టు సంకేతాలు వెలువడ్డాయి.
ఎన్నికల రద్దు స్టే ఎత్తివేతకు కోర్టు నిరాకరించడం, అందుకు తగ్గ పిటిషన్ నాలుగు వారాలకు వాయిదా పడి ఉన్నందున, ఆయా సంస్థలకు ప్రత్యేక అధికారుల నియామకం అనివార్యమైంది. ప్రస్తుత స్థానిక ప్రతినిధుల పదవీ కాలం ఈనెల 24తో ముగియనుంది. దీనికి సంబంధించి సాగిన చర్చలో ప్రత్యేక అధికారుల నియామకాలకు తగ్గట్టు అత్యవసర చట్టం తీసుకొచ్చేందుకు నిర్ణయించారు. ఇక, రాష్ట్రంలో రగులుతున్న కావేరి రచ్చను చల్లార్చేందుకు తగ్గట్టుగా, కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా ప్రత్యేక కార్యచరణకు నిర్ణయించినట్టు సమాచారం.
కావేరి అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీకి పట్టుబడుతూ ప్రతి పక్షాలన్నీ ఉద్యమిస్తున్న సమయంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణాల దృష్ట్యా కీలక నిర్ణయంతో కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టేందుకు తగ్గ వ్యూహ రచన ఈ భేటిలో సాగింది. అలాగే, ఇంటి స్థలాల విక్రయం కోర్టు ఉత్తర్వుల మేరకు ఆగడంతో అందుకు తగ్గ ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషనకు నిర్ణయించి ఉన్నారు. అలాగే, కోర్టు ముందు ఉంచాల్సిన వాదన గురించి సమీక్షించినట్టు తెలిసింది. ఇక, మరి కొద్ది రోజుల్లో ఈశాన్య రుతు పవనాల ప్రవేశంతో వర్షాలు ఆశాజనకంగా ఉండబోతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై సమాలోచించారు. పాలనా పరమైన వ్యవహారాలపై వేగం పెంచేందుకు తగ్గ నిర్ణయాలు తీసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి.
గంట పాటుగా సాగిన ఈ భేటీ అనంతరం మంత్రులు తమ ఛాంబర్లకు పరుగులు తీశారు. తమ శాఖల పరిధిలో అధికారులతో సమాలోచనల్లో బిజీ కావడం ఆలోచించ దగిన విషయం. అయితే ఇప్పటివరకు సీఎం జయలలిత కేబినెట్ సమావేశం నిర్వహించిన పక్షంలో, ఆ వివరాలను సమాచార శాఖ ప్రకటన రూపంలో విడుదల చేసేది. అయితే, కేబినెట్ వివరాలన్నీ గోప్యంగా ఉంచడం గమనార్హం.
రాష్ర్ట ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యా సాగర్ రావుతో చర్చించినానంతరం కాబోలు, బుధవారం సాయంత్రం స్థానిక సంస్థలపై తీసుకున్న నిర్ణయానికి తగ్గ ఉత్తర్వుల్ని ప్రకటించారు. ఈ మేరకు స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారులను నియమించారు. స్థానిక సంస్థల పర్యవేక్షణ ఆయా మండలాల వారిగా ప్రత్యేక అధికారుల ద్వారా సాగనుం ది. ఇలా ఉండగా, మంత్రి వర్గంలో చర్చకు ముందే, ప్రత్యేక అధికారుల ని యామకానికి ప్రత్యేక చట్టం, ఉత్తర్వులు సిద్ధమైనట్టు సమాచారం. తాజా గా ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఈ విషయం తేటతెల్లం అవుతోండడం గమనార్హం.
ప్రత్యేక అధికారులు!
Published Thu, Oct 20 2016 1:05 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM
Advertisement
Advertisement