లంక సేనలు సముద్రంలో మళ్లీ వీరంగం సృష్టించాయి. రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమంగా పెద్ద ఎత్తున జాలర్లను బందీలుగా పట్టుకెళ్లాయి. సుమారు 250 మంది జాలర్లను, 39 పడవల్ని శ్రీలంక నావికాదళం పట్టుకెళ్లిన సమాచారం నాగపట్నంలో కలకలాన్ని సృష్టించింది.
సాక్షి, చెన్నై:రాష్ట్ర జాలర్లపై శ్రీలంక నావికాదళం తరచూ తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఆ సేన పైశాచికత్వానికి అనేక మంది జాలర్ల కుటుంబాలు రాష్ట్రంలో అష్టకష్టాలకు గురవుతున్నాయి. ఇటీవల సరిహద్దులు దాటుతున్నారన్న నెపంతో రాష్ట్ర జాలర్లను పట్టుకెళ్లి ఆ దేశ జైళ్లలోకి నెట్టేస్తున్నారు. ఈ చర్యలు రాష్ట్రంలోని జాలర్లలో ఆందోళన రేకెత్తిస్తూ వస్తున్నాయి. ఇన్నాళ్లు పదుల సంఖ్యలో జాలర్లను అప్పుడప్పుడు పట్టుకెళుతూ వచ్చిన నావికాదళం, తాజాగా ఏక కాలంలో 39 పడవలను సీజ్ చేసి, అందులోని 250 మందిని బంధీలుగా పట్టుకెళ్లడం కలకలం రేపుతోంది. నాగపట్నం జిల్లాఅక్కరై పేట, కీచాన్ కుప్పుం, నంబియార్ నగర్ తీర జాలర్లు మంగళవారం చేపల వేటకు వెళ్లారు. సుమారు 300 పడవల్లో వేలాది మంది కలిసికట్టుగా వెళ్లారు. కోడియకరై వద్ద చేపల వేటలో నిమగ్నమైన జాలర్లపై అర్ధరాత్రి శ్రీలంక నావికాదళం సభ్యులు విరుచుకు పడ్డారు.
తుపాకుల్ని గాల్లోకి పేల్చు తూ వీరంగం సృష్టించారు. జాలర్లను చుట్టుముట్టి తమ ప్రతాపం చూపించారు. శ్రీలంక నావికా దళం కాల్పులు విన్న జాలర్లు ఒడ్డుకు తిరుగు పయనమయ్యారు. అయితే, 39 పడవల్ని వారు చుట్టుముట్టడంతో, అందులో ఉన్న జాలర్లు భయాందోళనకు గురయ్యారు. మిగిలిన పడవలు తప్పించుకుని ఒడ్డుకు ఉదయాన్నే చేరగా 39పడవలు మాత్రం అదృశ్యం అయ్యాయి. ఆ పడవల్ని, అందులో ఉన్న సుమారు 250 మంది జాలర్లను శ్రీలంక నావికాదళం బంధీలుగా పట్టుకెళ్లి ఉండొచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. తమ వాళ్లను పెద్ద ఎత్తున శ్రీలంక సేనలు పట్టుకెళ్లిన సమాచారం నాగపట్నంలో కలకలం రేపింది. జాలర్లు భయాందోళనతో ఉన్నారు. 250 కుటుంబాలు తమ వాళ్లకు ఏమయ్యిందోనన్న బెంగతో ఎదురు చూస్తున్నాయి. ఈ కలకలంతో మిగిలిన జాలర్లు వేటకు వెళ్లేందుకు బుధవారం వెనకడుగు వేయడంతో నాగపట్నం తీరానికి పడవలు పరిమితమయ్యాయి. అయితే, పెద్ద ఎత్తున తమిళ జాలర్లను బంధీగా పట్టుకెళ్లినా, ఇందుకు సంబంధిం చిన అధికారిక సమాచారం భారత కోస్టు గార్డుకుగానీ, మెరైన్ పోలీసులకు గానీ, రాష్ట్ర మత్స్య శాఖకు గానీ ఇంత వరకు శ్రీలంక నుంచి రాక పోవడంతో ఉత్కంఠ నెలకొంది.
లంక సేనల వీరంగం!
Published Thu, Dec 12 2013 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement