సాక్షి, ముంబై: షిర్డీలో శ్రీరామనవమి ఉత్సవాలు సోమవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. షిర్డీ పరిసరాలు శ్రీరాముని నామస్మరణతో మార్మోగుతున్నాయి. శ్రీరామనవమి పురస్కరించుకుని మొదటి రోజు సోమవారం ఆలయ నిర్వాహకులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు బాబా విగ్రహానికి మంగళస్నానం చేయించారు. కాకడ్ హారతి పూర్తికాగానే ఆయన చిత్రపటం, పవిత్ర గ్రంథాన్ని ఊరేగించారు. ఈ ఊరేగింపు ద్వారకామాయి చేరుకోగానే అఖండ పారాయణ పఠనం ప్రారంభమైంది. బాబా చిత్రపటాన్ని, గ్రంథాన్ని, ఆయన వాడిన గోనే సంచిని ఆలయ కమిటీ పదాధికారులు అప్పాసాహెబ్ షిండే, రామరావ్ శేల్కే, అజయ్ మోరే, ఆలయ పురోహితుడు ఉపేంద్ర పాటక్‌లు తమ చేతులతో పట్టుకుని ఊరేగింపులో పాల్గొన్నారు.
భక్తుల సందడి...
శ్రీరామనవమి ఉత్సవాల్లో బాగంగా ఆలయాలు, పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. మొదటి రోజు ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆదివారం రాత్రికే భక్తులు పెద్దసంఖ్యలో షిర్డీకి చేరుకున్నారు. పల్లకీలు, కాలిబాటన వచ్చే భక్తులు రామనామస్మరణతో పరిసర ప్రాంతాల్లో భక్తిమయ వాతావరణం నెలకొంది. దీంతో భక్తులు బసచేసేందుకు సంస్థాన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయం పక్కనే ఏర్పాటుచేసిన వేదికపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భజన కళాకారులు భక్తి గీతాలు, కీర్తనలను ఆలపించారు. మందిర పరిసరాల్లో ద్వారకామాయి మండలి తరఫున ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాలతో అలంకరించిన శ్రీరాముని ప్రతిమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
భక్తులకు ఉచిత భోజనం....
భక్తులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించారు. విజయవాడకు చెందిన పద్మలత శ్రీనివాస్, భోపాల్‌కు చెందిన ముకేష్ భరద్వాజ్, మితేష్ క్లాసెస్, ఔరంగాబాద్‌కు చెందిన దినేశ్ చంద్ర, సురేశ్ చంద్ర వాడేగావ్కర్, చెన్నైకి చెందిన టి.విజయ్ తదితర భక్తులు అందజేసిన విరాళాలతో ఉచిత భోజన సౌకర్యం కల్పించినట్లు బాబా సంస్థాన్ కార్యనిర్వాహక అధికారి అజయ్ మోరే అజయ్ మోరే తెలిపారు.
రాత్రంతా మందిరం తెరిచి ఉంచుతాం: మోరే
శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సాయిబాబా మందిరాన్ని మూడు రోజుల పాటు రాత్రంతా తెరిచే ఉంచుతామని అజయ్ మోరే చెప్పారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సాయిబాబా సంస్థాన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. రెండో రోజు మంగళవారం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పూజా కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
అంతా రామమయం
Published Mon, Apr 7 2014 10:47 PM | Last Updated on Tue, Nov 6 2018 5:52 PM
Advertisement