రాజ్యసభ సందడి
Published Thu, Jan 16 2014 5:29 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. ఆరు సీట్లు ఖాళీ అవుతుండడంతో ఆశల పల్లకిలో సీనియర్లు ఊరేగుతున్నారు. తమకున్న ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా నాలుగు సీట్లను అధికార పక్షం తన్నుకెళ్లడం ఖాయం. ఇక ఐదు, ఆరో సీటు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
సాక్షి, చెన్నై: రాజ్యసభకు సభ్యులుగా ఉన్న పలువురి పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనున్నది. వీరిలో రాష్ట్రానికి చెందిన జీకే వాసన్, జయంతి నటరాజన్(కాంగ్రెస్), బాలగంగ (అన్నాడీఎంకే), జిన్నా, వసంతి స్టాన్లీ(డీఎంకే), టీకే రంగరాజన్(సీపీఎం) ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందుగానే ఈ స్థానాలను భర్తీ చేయడం లక్ష్యంగా కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఈనెల 21 నుంచి నామినేషన్ పర్వం ఆరంభం కానున్నది. ఫిబ్రవరి ఏడో తేదీన ఎన్నికలు జరగనున్నారుు. రాజ్యసభ ఎన్నికల నగారా మోగడంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కనుంది. లోక్ సభ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా సాగుతున్న వేళ, రాజ్యసభ సందడి మొదలు కావడం విశేషం.
నాలుగు సీట్లు ఖాయం
రాష్ట్రంలో 234 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 151-అన్నాడీఎంకే, 28- డీఎండీకే (వీరిలో ఏడుగురు రెబల్స్), డీఎంకే -23, సీపీఎం-10, సీపీఐ-8, కాంగ్రెస్ -5, పీఎంకే-3, పుదియ తమిళగం-2, ఫార్వడ్ బ్లాక్ -1 చొప్పున సభ్యులు ఉన్నారు. బన్రూటీ రాజీనామాతో ఓ స్థానం ఖాళీగా ఉంది. ఒక్కోరాజ్య సభ సభ్యుడి ఎంపికకు 34 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ దృష్ట్యా, ఖాళీ కాబోతున్న ఆరు స్థానాల్లో నాలుగింటిని అన్నాడీఎంకే తన ఖాతాలో వేసుకోవడం ఖాయం. మిగిలిందల్లా ఐదు, ఆరో సీటు ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠే. ఈ సీట్లు రాష్ట్రంలో రాజకీయంగా మలుపులకు వేదిక అయ్యే అవకాశాలున్నారుు.
మలుపులు: ఐదో సీటును సైతం తనఖాతాలో వేసుకునేందుకు అన్నాడీఎంకే ప్రయత్నాలు చేయొచ్చు. ఇటీవల జరిగిన రాజ్య సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో సీపీఎం, సీపీఐలు కలిసి పనిచేశాయి. ప్రతిఫలంగా సీపీఐకు ఓ రాజ్య సభ సీటు దక్కింది. ప్రస్తుతం సీపీఎం సభ్యుడు రంగరాజన్ పదవీ కాలం ముగియనున్నడంతో ఐదో సీటు తమకు అప్పగించాలన్న ప్రతిపాదనను అన్నాడీఎంకే ముందు ఆ పార్టీ ఉంచే అవకాశాలు ఉన్నాయి. అయితే, లోక్ సభ ఎన్నికలో రాజకీయంలో సీపీఎం, సీపీఐలను అన్నాడీఎంకే పక్కన పెట్టిన దృష్ట్యా, వారికి అవకాశం కల్పించేనా అన్నది ప్రశ్నార్థకం. తమ సంఖ్యా బలం మేరకు నాలుగు సీట్లు ఖాయం చేసుకున్నా, ఐదో సీటుకు అన్నాడీఎంకే వద్ద మరో పదిహేను ఓట్లు ఉన్నాయి. మరో ఏడు డీఎండీకే రెబల్స్ ఓట్లు సైతం ఉండటంతో సంఖ్య 22కు చేరింది.
మరి కొందరు డీఎండీకే ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారిన పక్షంలో ఆ సీటు అన్నాడీఎంకే ఖాతాలో పడటం ఖాయం. ఒక వేళ రాజకీయ మలుపులు చోటు చేసుకున్న పక్షంలో చివరి క్షణంలో సీపీఎంకు ఆ సీటును అన్నాడీఎంకే దారాదత్తం చేసినా చేయొచ్చు. ఇందుకు ఉదాహరణగా ఇటీవల రాజ్య సభ ఎన్నికలిను పరిగణనలోకి తీసుకోవచ్చు. తమకు నాలుగు సీట్లు ఖాయం కావడంతో అన్నాడీఎంకే సీనియర్లలో ఆశలు చిగురిస్తున్నాయి. ఇక ఆరో సీటు డీఎంకే-కాంగ్రెస్ మైత్రిని బలపడేలా చేసేనా, లేదా కొత్త స్నేహానికి బాట వేసేనా అన్నది వేచి చూడాల్సిందే!ఎదురు చూపులు: ఇటీవలి రాజ్య సభ ఎన్నికల్లో డీఎంకే అధినేత ఎం కరుణానిధి గారాల పట్టి కనిమొళి గెలుపునకు కాంగ్రెస్ కృషి చేసింది.
తాజాగా జరగబోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డీఎంకే సహకరించేనా అని ఎదురు చూపు మొదలైంది. ఇందుకు కారణం రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపునేతగా ఉన్న జికే వాసన్ పదవీ కాలం ముగుస్తుండటమే. కేంద్ర నౌకాయూన శాఖ మంత్రిగా ఉన్న వాసన్ సేవలు కాంగ్రెస్‌కు తప్పని సరి. ఈ దృష్ట్యా, ఆయన్ను మళ్లీ అభ్యర్థిగా ప్రకటించి డీఎంకే మద్దతు కోరేందుకు ఏఐసీసీ ప్రయత్నాలు చేపట్టే అవకాాశాలు ఎక్కువే. అయితే, ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి వాసన్ ఉత్సాహంగా ఉన్నట్టు సమాచారం. ఒక వేళ అదే జరిగిన పక్షంలో డీఎండీకేకు అవకాశం ఉంటుంది.
డీఎండీకేకు ఛాన్స్: రాజ్య సభ రేసులో తమ అభ్యర్థిని నిలబెట్టడం కన్నా, ఇతరులకు మద్దతు ఇచ్చి లోక్ సభ ఎన్నికల కూటమి బంధాన్ని పదిలం చేసుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ కోవలో డీఎండీకేకు తొలి ప్రాధాన్యత ఇవ్వొచ్చు. తమ వైపు ఆ పార్టీని తిప్పుకునేందుకు కరుణానిధి తీవ్ర ప్రయత్నాల్లో ఉండటం ఉదాహరణ. అదే సమయంలో తన సతీమణి ప్రేమలత లేదా బావమరిది సుదీష్‌ను రాజ్య సభకు పంపించడం లక్ష్యంగా డీఎండీకే అధినేత విజయకాంత్ కసరత్తుల్లో ఉన్నారు.
ఫిబ్రవరి 2న ఉలందూరు పేట వేదికగా నిర్వహించే మహానాడులో కూటమి ఎవరో ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. రాజ్య సభలో తమ ప్రతినిధి అడుగు పెట్టడం లక్ష్యంగా కలలు కంటున్న విజయకాంత్‌కు తాజా ఎన్నికలు ఓ వరంగా మారారుు. ఈ దృష్ట్యా, తమకు ఎవరు మద్దతు ఇస్తారో వారి వెంట నడిచే అవకాశాలున్నాయి. తన అభ్యర్థిని విజయకాంత్ రేసులో నిలబెట్టిన పక్షంలో మద్దతు ద్వారా ఆయన్ను తమ వైపు డీఎంకే తిప్పుకోవడం ఖాయం. ఈ రాజ్యసభ ఎన్నికల రాజకీయం చివరి క్షణంలో ఎన్ని మలుపులకు వేదిక కాబోతున్నది వేచి చూడాల్సిందే.
Advertisement
Advertisement