సాక్షి ప్రతినిధి, చెన్నై: స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక రిజర్వేషన్ల అమలు సక్రమంగా అమలు చేయనందున ఎన్నికలను నిలుపుదల చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రిజర్వేషన్లను రద్దు చేయాలని మద్రాసు హైకోర్టులో డీఎంకే ఇటీవల ఒక పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి కృపాకరన్ ఎన్నికల నిర్వహణను తప్పుపట్టారు. పిటిషన్ దారుడు ఆరోపిస్తున్న అంశాలు తప్పిదం అంటూ ఎన్నికల కమిషన్ నిరూపించలేక పోయిందని ఆయన వ్యాఖ్యానించారు.
కాబట్టి ఈనెల 17, 19 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలపై స్టే విధిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ జారీచేసి ఈ ఏడాది డిసెంబరు ఆఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఆయన తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో ఈనెల 17, 19 తేదీల్లో జరగాల్సిన ఎన్నికలు ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అయితే హైకోర్టు మంజూరు చేసిన స్టేపై ప్రభుత్వం అప్పీలు పిటిషన్‌ను దాఖలు చేసింది. అభ్యర్థుల నామినేషన్లు, ఎన్నికల ఏర్పాట్లన్నీ పూర్తి అయిన దశలో వాయిదా పడడం ఇబ్బందికరమని ప్రభుత్వం తన అప్పీలు పిటిషన్‌లో పేర్కొంది.
ఈ అప్పీల్‌ను అత్యవసర కేసుగా స్వీకరించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అయితే ప్రభుత్వ అప్పీల్ వల్ల ఎన్నికలపై మంజూరైన స్టే ఎత్తివేయకుండా డీఎంకే ముందు జాగ్రత్త చర్యగా కేవియట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ప్రభుత్వ అప్పీల్‌ను అత్యవసర కేసుగా విచారణకు స్వీకరించింది. హైకోర్టు న్యాయమూర్తులు హూలువాడి రమేష్, వీ పార్తిబన్‌తో కూడిన ద్విసభ్య బెంచ్ ముందుకు గురువారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలపై హైకోర్టు న్యాయమూర్తి జారీచేసిన స్టే విధించారు, స్టే జారీ కాగానే ఎన్నికలను రద్దు చేస్తున్నామని, ఎన్నికల ఏర్పాట్లన్నీ నిలిపి వేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారని అన్నారు.
ఎన్నికలు రద్దయినట్లు ఈసీ ఒకసారి ప్రకటించిన తరువాత అవే ఎన్నికలను కొనసాగించడం సాధ్యం కాదని అన్నారు. తాజాగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు వేచి ఉండడమే సమంజసమని సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించాలని, ఇతర రాష్ట్రాల అధికారులను నియమించాలని తదితర కోర్కెలతో మద్రాసు హైకోర్టులో డీఎంకే వేసిన పిటిషన్‌పై ఈనెల 18వ తేదీన విచారణ జరుగనుందని అన్నారు. ఆ పిటిషన్‌పై హైకోర్టు వ్యక్తం చేసే అభిప్రాయాలను అనుసరించి ఈ పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. గతంలో ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు హైకోర్టు వాఖ్యలతో విఫలమయ్యాయి.
అవకాశం మళ్లీ దక్కేనా
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ పెద్దల కాళ్లావేళ్లా పడి సంపాదించుకున్న టికెట్టు కోర్టు స్టేతో వృథాగా పోయిందని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల తేదీ ప్రకటించగానే అన్నాడీఎంకే అభ్యర్థులు నామినేషన్లు వేసి ప్రచారం ప్రారంభించారు. సీట్ల కేటాయింపులో డీఎంకే, కాంగ్రెస్ మధ్య మనస్పర్థలు రేగి సద్దుమణిగిన వెంటనే నామినేషన్లు వేసి ప్రచారంలోకి దిగారు. అన్ని పార్టీల వారు ఇంటింటికీ తిరిగి ఓటును అభ్యర్థించడం కొనసాగుతున్న దశలో ఎన్నికలు రద్దయినట్లు పిడుగులాంటి వార్త అభ్యర్థుల చెవిన పడింది. ఈ ఏడాది చివరలో ఎన్నికలు వచ్చినా మరోసారి తమకే అవకాశం దక్కుతుందా అనే ఆందోళనలో పడిపోయారు.
స్టే యథాతథం..
Published Fri, Oct 7 2016 2:23 AM | Last Updated on Mon, Oct 8 2018 3:56 PM
Advertisement
Advertisement