విద్యార్థులే గైడ్‌లు | Students as guides | Sakshi
Sakshi News home page

విద్యార్థులే గైడ్‌లు

Published Mon, Sep 23 2013 3:58 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

Students as guides

సాక్షి, బెంగళూరు: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల్లోని అన్ని దేశాల నుంచి పర్యాటకులు హాజరవుతూ ఉంటారు. అందుకే విదేశీ పర్యాటకులను ఈ ఉత్సవాలకు మరింత ఎక్కువగా ఆకర్షించే దిశగా మైసూరు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర టూరిజం శాఖ కూడా వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే విదేశీ పర్యాటకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల వేదికల వద్ద ప్రత్యేక సీటింగ్ సదుపాయం వంటి ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తె చ్చిన జిల్లా అధికారులు ఇప్పుడు మరో కార్యక్రమాన్ని కూడా విదేశీ పర్యాటకుల కోసం అందుబాటులోకి తెచ్చారు.

మైసూరు దసరా ఉత్సవాలకు వచ్చే విదేశీ పర్యాటకులకు ‘ద యూనివర్సిటీ ఆఫ్ మైసూరు ఇంటర్నేషనల్ సెంటర్’లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులను గైడ్‌లుగా వ్యవహరించనున్నారు. మైసూరు దసరా ఉత్సవాలకు హాజరయ్యే విదేశీయుల్లో ఎక్కువ మంది ఫ్రాన్స్, జర్మనీ దేశీయులున్నారు. వీరికి వారి జాతీయ భాషలు తప్ప మరే భాషలూ తెలియవు (ఇంగ్లీష్‌తో సహా). ఇలాంటి సమయంలో ఆ ఇబ్బందిని పరిష్కరించేందుకు  మైసూరు జిల్లా యంత్రాంగం ‘ద యూనివర్సిటీ ఆఫ్ మైసూరు ఇంటర్నేషన ల్ సెంటర్’ సహాయాన్ని తీసుకుంటోంది.

ఈసెంటర్‌లో 50దేశాలకు చెందిన 1,200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో చాలా మంది విద్యార్థులు ఫ్రెంచ్, జర్మన్, డచ్ భాషల్లో చక్కగా మాట్లాడగలరు. వీరి నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి గైడ్‌లుగా ఎలా వ్యవహరించాలనే విషయంపై రాష్ట్ర టూరిజం శాఖ శిక్షణ ఇస్తోంది. మైసూరు చరిత్ర, ఇక్కడి ప్రసిద్ధ వంటకాలు, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి వారిలో మొదటగా అవగాహన కల్పిస్తోంది. శిక్షణ తీసుకున్న విద్యార్థులు మైసూరు దసరా ఉత్సవాల సమయంలో రాచనగరికి వచ్చే ఫ్రాన్స్, జర్మనీ దేశాల పర్యాటకులకు గైడ్‌లుగా వ్యవహరించనున్నారు.

 పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు...

 స్వదేశీ, విదేశీ పర్యాటకుల కోసం రాష్ట్ర టూరిజం శాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా రూపొందించింది.  ‘మైసూరు-బెళిగిరి-రంగహిల్స్-కె.గుడి’లటూర్‌కు ఒక్కో వ్యక్తికి రూ.395, మైసూరు-నంజనగూడు-హిమవాదగోపాలస్వామి హిల్స్-బండీపుర నేషనల్ పార్క్ టూర్‌కు రూ.390 ఇలా ఈ ప్యాకేజీలు రూ.450వరకు కొనసాగనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement