World-renowned
-
నేడుజంబూ సవారీ
= లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం = రెండోసారి అంబారీ మోయనున్న అర్జున = సందర్శకుల కోసం ఏర్పాట్లు సాక్షి, బెంగళూరు: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ అయిన జంబూ సవారీకి క్షణగణన ప్రారంభమైంది. రాచనగరి మైసూరులో పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు జరిగే కార్యక్రమాలు ఒక ఎత్తయితే, ఆఖరి రోజున నిర్వహించే జంబూ సవారీ, కాగడాల కవాతు ఒక ఎత్తు. అందుకే దసరా ఉత్సవాల కోసం తరలి వచ్చే పర్యాటకులు జంబూ సవారీని వీక్షించడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అంతటి ఖ్యాతి సంపాదించుకున్న జంబూసవారీని వీక్షించటానికి వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకుల ఆనందోత్సాహాల న డుమ సోమవారం జరగనుంది. విజయదశమి రోజున నిర్వహించే జంబూ సవారీని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మైసూరు ప్యాలెస్ నుంచి ప్రారంభమయ్యే ఈ జంబూ సవారీ బన్ని మంటపం వరకు కొనసాగుతుంది. అమ్మలగన్న అమ్మ చావ ుుండేశ్వరీ దేవి స్వర్ణ అంబారీలో కొలువై ఉండగా 750 కేజీల బరువుగల స్వర్ణ అంబారీని మోసే బాధ్యత ఈ ఏడాది కూడా అర్జుననే వరించింది. అర్జున స్వర్ణ అంబారీని మోయడం వ రుసగా ఇది రెండోసారి. ఇక అంబారీని మోసే అర్జునతో పాటు విశేషంగా అలంకరించిన మరో 12 గజరాజులు జంబూ సవారీలో పాల్గొననున్నాయి. జానపద నృత్యాలు బృందాలు, పోలీస్ బ్యాండ్‌తో పాటు దాదాపు 60 కళా బృందాలు జంబూ సవారీ వెంట సాగనున్నాయి. ఇక జంబూ సవారీ ముగిసిన అనంతరం సోమవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో బన్ని మంటపంలో కాగడాల కవాతు (టార్చ్‌లైట్ పరేడ్) నిర్వహించనున్నారు. గవర్నర్ హన్సరాజ్ భరద్వాజ్ పరేడ్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు. సందర్శకుల కోసం 17వేల సీట్లు... జంబూ సవారీని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోల్డ్‌కార్డ్‌తో పాటు వివిధ పాస్‌లను ఖరీదు చేసిన దాదాపు 17వేల మంది ప్యాలెస్ ఆవరణలో కూర్చుని జంబూ సవారీని వీక్షించేందుకు సీట్లను సిద్ధం చేశారు. ఇక జంబూ సవారీ సాగే మార్గం వెంట ఉన్న చారిత్రాత్మక కట్టడాలపై నిలబడి చాలా మంది సవారీని వీక్షిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఆ మార్గంలోని కట్టడాలపైకి ఎవరూ ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జంబూ సవారీ సాగే మార్గంలోని అనేక చారిత్రాత్మక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాది జంబూ సవారీకి వైమానిక నిఘా వ్యవస్థను కూడా అధికారులు ఏర్పాటు చేశారు. -
విద్యార్థులే గైడ్లు
సాక్షి, బెంగళూరు: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మైసూరు దసరా ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల్లోని అన్ని దేశాల నుంచి పర్యాటకులు హాజరవుతూ ఉంటారు. అందుకే విదేశీ పర్యాటకులను ఈ ఉత్సవాలకు మరింత ఎక్కువగా ఆకర్షించే దిశగా మైసూరు జిల్లా యంత్రాంగంతో పాటు రాష్ట్ర టూరిజం శాఖ కూడా వివిధ కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే విదేశీ పర్యాటకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల వేదికల వద్ద ప్రత్యేక సీటింగ్ సదుపాయం వంటి ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తె చ్చిన జిల్లా అధికారులు ఇప్పుడు మరో కార్యక్రమాన్ని కూడా విదేశీ పర్యాటకుల కోసం అందుబాటులోకి తెచ్చారు. మైసూరు దసరా ఉత్సవాలకు వచ్చే విదేశీ పర్యాటకులకు ‘ద యూనివర్సిటీ ఆఫ్ మైసూరు ఇంటర్నేషనల్ సెంటర్’లో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులను గైడ్లుగా వ్యవహరించనున్నారు. మైసూరు దసరా ఉత్సవాలకు హాజరయ్యే విదేశీయుల్లో ఎక్కువ మంది ఫ్రాన్స్, జర్మనీ దేశీయులున్నారు. వీరికి వారి జాతీయ భాషలు తప్ప మరే భాషలూ తెలియవు (ఇంగ్లీష్‌తో సహా). ఇలాంటి సమయంలో ఆ ఇబ్బందిని పరిష్కరించేందుకు మైసూరు జిల్లా యంత్రాంగం ‘ద యూనివర్సిటీ ఆఫ్ మైసూరు ఇంటర్నేషన ల్ సెంటర్’ సహాయాన్ని తీసుకుంటోంది. ఈసెంటర్లో 50దేశాలకు చెందిన 1,200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో చాలా మంది విద్యార్థులు ఫ్రెంచ్, జర్మన్, డచ్ భాషల్లో చక్కగా మాట్లాడగలరు. వీరి నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారికి గైడ్లుగా ఎలా వ్యవహరించాలనే విషయంపై రాష్ట్ర టూరిజం శాఖ శిక్షణ ఇస్తోంది. మైసూరు చరిత్ర, ఇక్కడి ప్రసిద్ధ వంటకాలు, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాల గురించి వారిలో మొదటగా అవగాహన కల్పిస్తోంది. శిక్షణ తీసుకున్న విద్యార్థులు మైసూరు దసరా ఉత్సవాల సమయంలో రాచనగరికి వచ్చే ఫ్రాన్స్, జర్మనీ దేశాల పర్యాటకులకు గైడ్లుగా వ్యవహరించనున్నారు. పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు... స్వదేశీ, విదేశీ పర్యాటకుల కోసం రాష్ట్ర టూరిజం శాఖ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా రూపొందించింది. ‘మైసూరు-బెళిగిరి-రంగహిల్స్-కె.గుడి’లటూర్కు ఒక్కో వ్యక్తికి రూ.395, మైసూరు-నంజనగూడు-హిమవాదగోపాలస్వామి హిల్స్-బండీపుర నేషనల్ పార్క్ టూర్‌కు రూ.390 ఇలా ఈ ప్యాకేజీలు రూ.450వరకు కొనసాగనున్నాయి.