= లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
= రెండోసారి అంబారీ మోయనున్న అర్జున
= సందర్శకుల కోసం ఏర్పాట్లు
సాక్షి, బెంగళూరు: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణ అయిన జంబూ సవారీకి క్షణగణన ప్రారంభమైంది. రాచనగరి మైసూరులో పది రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు జరిగే కార్యక్రమాలు ఒక ఎత్తయితే, ఆఖరి రోజున నిర్వహించే జంబూ సవారీ, కాగడాల కవాతు ఒక ఎత్తు. అందుకే దసరా ఉత్సవాల కోసం తరలి వచ్చే పర్యాటకులు జంబూ సవారీని వీక్షించడం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. అంతటి ఖ్యాతి సంపాదించుకున్న జంబూసవారీని వీక్షించటానికి వివిధ దేశాల నుంచి వచ్చిన పర్యాటకులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన సందర్శకుల ఆనందోత్సాహాల న డుమ సోమవారం జరగనుంది.
విజయదశమి రోజున నిర్వహించే జంబూ సవారీని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సోమవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించనున్నారు. మైసూరు ప్యాలెస్ నుంచి ప్రారంభమయ్యే ఈ జంబూ సవారీ బన్ని మంటపం వరకు కొనసాగుతుంది. అమ్మలగన్న అమ్మ చావ ుుండేశ్వరీ దేవి స్వర్ణ అంబారీలో కొలువై ఉండగా 750 కేజీల బరువుగల స్వర్ణ అంబారీని మోసే బాధ్యత ఈ ఏడాది కూడా అర్జుననే వరించింది. అర్జున స్వర్ణ అంబారీని మోయడం వ రుసగా ఇది రెండోసారి.
ఇక అంబారీని మోసే అర్జునతో పాటు విశేషంగా అలంకరించిన మరో 12 గజరాజులు జంబూ సవారీలో పాల్గొననున్నాయి. జానపద నృత్యాలు బృందాలు, పోలీస్ బ్యాండ్‌తో పాటు దాదాపు 60 కళా బృందాలు జంబూ సవారీ వెంట సాగనున్నాయి. ఇక జంబూ సవారీ ముగిసిన అనంతరం సోమవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో బన్ని మంటపంలో కాగడాల కవాతు (టార్చ్‌లైట్ పరేడ్) నిర్వహించనున్నారు. గవర్నర్ హన్‌సరాజ్ భరద్వాజ్ పరేడ్ నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించనున్నారు.
సందర్శకుల కోసం 17వేల సీట్లు...
జంబూ సవారీని వీక్షించడానికి వచ్చే సందర్శకుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గోల్డ్‌కార్డ్‌తో పాటు వివిధ పాస్‌లను ఖరీదు చేసిన దాదాపు 17వేల మంది ప్యాలెస్ ఆవరణలో కూర్చుని జంబూ సవారీని వీక్షించేందుకు సీట్లను సిద్ధం చేశారు. ఇక జంబూ సవారీ సాగే మార్గం వెంట ఉన్న చారిత్రాత్మక కట్టడాలపై నిలబడి చాలా మంది సవారీని వీక్షిస్తుంటారు. అయితే ఈ ఏడాది ఆ మార్గంలోని కట్టడాలపైకి ఎవరూ ఎక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జంబూ సవారీ సాగే మార్గంలోని అనేక చారిత్రాత్మక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ ఏడాది జంబూ సవారీకి వైమానిక నిఘా వ్యవస్థను కూడా అధికారులు ఏర్పాటు చేశారు.