రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి
తిరుపతి క్రైం: తాతయ్యా! ఈరోజు నా పుట్టినరోజు. నన్ను ఆశీర్వదించండి. నేను కాలేజీకి వెళ్లొస్తా... ఫ్రెండ్స్ అందరికీ స్వీట్స్ ఇచ్చి సెలెబ్రేట్ చేసుకోవాలి తాతా! అంటూ పెద్దల ఆశీస్సులు అందుకుని బయల్దేరిన యువకుడు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకుని పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాడు. అలిపిరి పోలీసులు తెలిపిన వివరాలు.. బంగారుపాళ్యంలో నివాసం ఉంటున్న రోహిణి, తులసి దంపతుల పెద్ద కుమారుడు రోహిత్(18) తిరుపతి సరోజీనగర్‌లోని తాతయ్య సింగార సుబ్బరాయుడు వద్ద ఉంటూ, చదలవాడ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం పుట్టినరోజు సందర్భంగా తాతయ్య దీవెనలు అందుకుని ద్విచక్రవాహనంలో కాలేజీకి వెళ్లాడు. అయితే కాలేజీ నుంచి స్నేహితులైన అఖిల్, మరో యువతితో కలసి రోహిత్ చాక్లెట్లు తెచ్చేందుకు స్కూటీపై వెళ్లారు. అయితే కాలేజీ సమీపంలో రోడ్డుకు పక్కన ఆగి ఉన్న రైల్వే ట్రాలీల ట్రాక్టర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ముగ్గరికీ తీవ్ర గాయాలయ్యాయి.
హుటాహుటిన స్థానికులు రుయాకు తరలించారు. చికిత్స పొందుతూ రోహిత్ (18) మృతి చెందాడు. అఖిల్‌కు, మరో యువతి చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. అయితే కన్నకొడుకు పుట్టిన రోజు నాడే దుర్మరణం చెందాడనే సమాచారం తెలియడంతో ఆ తల్లిదండ్రులు హృదయాలు తల్లడిల్లిపోయాయి. విషయం తెలుసుకున్న రోహిత్ తాతయ్య కన్నీటిపర్యంతమవుతూ ఆస్పత్రికి చేరుకున్నారు. నిండూ నూరేళ్లు సుఖంగా జీవించాలని దీవిస్తే విధి రాత ఇలా నిన్ను దూరం చేసిందిరా నాయనా! అంటూ ఆ వృద్ధుడు భోరున విలపించారు. పుట్టినరోజే ప్రమాదంలో విద్యార్థి చనిపోయాడని తెలుసుకున్న అక్కడి వారు అయ్యో అంటూ కంటతడి పెట్టారు.
అయ్యో! పుట్టిన రోజే..చివరి రోజు
Published Thu, Dec 15 2016 2:34 AM | Last Updated on Fri, Nov 9 2018 4:12 PM
Advertisement
Advertisement