సూర్యలంక బీచ్‌లో విషాదం
బాపట్ల: విహారయాత్రలో విషాదం అలముకున్న సంఘటన గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంక సముద్రతీరంలో జరిగింది. విహారయాత్ర కోసం వచ్చిన తొమ్మిదిమంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఇద్దరు మరణించారు. వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో బయోటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న పగడాల కావ్య, గుంటి ప్రత్యూష, గోనాల సుష్మప్రియ, కొలిమర్ల సత్యసాయిప్రసాద్, ఇందుజ, జరీనాతోపాటు కె.ఎల్. యూనివర్సిటీలో బీటెక్ (ప్రథమ) చదువుతున్న వారి ఇంటర్ క్లాస్‌మేట్స్ శివాని, వివేక్, ఉదయ్ మొత్తం తొమ్మిదిమంది మంగళవారం ఉదయం విజ్ఞాన్ కళాశాల నుంచి ఆటోలో సూర్యలంక తీరానికి చేరుకున్నారు.
వీరిలో కావ్య, ప్రత్యూష, సుష్మప్రియ, సత్యసాయిప్రసాద్ స్నానాలు చేసేందుకు ఉదయం 11గంటల సమయంలో సముద్రంలోకి దిగారు. అప్పటికే అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో సుష్మప్రియ నీటిలో లోతుకు వెళ్లింది. ఆమెను కాపాడేందుకు ప్రత్యూష(18), కావ్య, సత్యసాయిప్రసాద్(19)లు కూడా లోపలికి దిగారు.
వీరంతా అలల ఉధృతికి కొట్టుకుపోవడాన్ని గమనించిన సందర్శకులు కేకలు వేయడంతో తీరంలో పహారా కాస్తున్న మెరైన్ హోంగార్డు నాయుడు శ్రీనివాసరావు మత్స్యకారుల సహాయంతో నీటిలోకి దిగి కావ్య, ప్రత్యూష, సుష్మప్రియలను ఒడ్డుకు చేర్చారు. ప్రత్యూష నీరు ఎక్కువగా తాగడంతో మృత్యువాత పడింది. సత్యసాయిప్రసాద్ గల్లంతైన రెండు గంటల తర్వాత మృతదేహమై ఒడ్డుకు కొట్టుకువచ్చాడు. సుష్మప్రియ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతుండగా, కావ్య ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.