ఉప పోరు
- వచ్చే నెల 21న శికారిపుర, బళ్లారి రూరల్, చిక్కోడి అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
- ఈ నెల 26 నుంచి నామినేషన్ల స్వీకరణ
- యడ్డి, శ్రీరాములు, ప్రకాశ్ హుక్కేరి లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు
- శికారిపుర నుంచి యడ్డి తనయుడు, బళ్లారి రూరల్ నుంచి శ్రీరాములు సోదరి శాంత హుక్కేరి స్థానం నుంచి ఆయన తనయుడు పోటీ?
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మూడు శాసన సభ స్థానాలకు ఆగస్టు 21న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 25న ఫలితాలు వెలువడుతాయి. ఈ నెల 26న నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుంది. లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు తమ శాసన సభ్యత్వాలకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శివమొగ్గ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. గత శాసన సభ ఎన్నికల్లో ఆయన అదే నియోజక వర్గంలోని శికారిపుర నుంచి గెలుపొందారు.
మాజీ మంత్రి శ్రీరాములు లోక్‌సభ ఎన్నికలకు ముందే అసెంబ్లీలో తాను ప్రాతినిధ్యం వహించిన బళ్లారి గ్రామీణ నియోజక వర్గం స్థానానికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన బళ్లారి లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. యడ్యూరప్ప కేజేపీని, శ్రీరాములు బీఎస్‌ఆర్ సీపీని వీడి సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు చెందిన మంత్రి ప్రకాశ్ హుక్కేరి చిక్కోడి నియోజక వర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికవడంతో శాసన సభలో ఆయన ప్రాతినిధ్యం వహించిన చిక్కోడి-సదలగ స్థానం ఖాళీ అయింది.
అభ్యర్థులెవరో?
ఉప ఎన్నికల్లో శికారిపుర స్థానాన్ని తన కుమారుడు రాఘవేంద్రకు కేటాయించాలనే షరతుతోనే యడ్యూరప్ప లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. 2009లో జరిగిన ఎన్నికల్లో రాఘవేంద్ర ఈ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. కనుక ఆయన అభ్యర్థిత్వం ఖరారైనట్లే. బళ్లారి గ్రామీణ స్థానం నుంచి శ్రీరాములు సోదరి శాంత పోటీ చేయవచ్చని అప్పట్లోనే వినవచ్చింది. గతంలో ఆమె బళ్లారి స్థానానికి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహించారు. ఉప ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాన్ని ఆమెకు కేటాయిస్తామని బీజేపీ హామీ కూడా ఇచ్చినట్లు తెలిసింది.
చిక్కోడి-సదలగ స్థానం నుంచి ప్రకాశ్ హుక్కేరి తనయుడు పోటీ చేయవచ్చని సమాచారం. మంత్రిగా ఉన్న హుక్కేరి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తొలుత విముఖత వ్యక్తం చేశారు. తన కుమారునికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటానని కూడా పార్టీకి హామీ ఇచ్చారు. అయితే ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నందున ఆయనే పోటీ చేయాలని పార్టీ ఆదేశించింది. ఉప ఎన్నిక జరిగితే తన కుమారునికి టికెట్ ఇవ్వాలనే షరతుతో ఆయన అప్పట్లో రంగంలోకి దిగారు.