ఆ సూట్‌కేసు మిఖైల్‌ను చంపి దాచేందుకేనా?
ముంబై: షీనా బోరా హత్యకేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఆదివారం షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జీయాకు చెందిన ముంబై నివాస ప్రాంతంలో వారు ఓ సూట్‌కేసును స్వాధీనం చేసుకున్నారు. ఈ సూట్‌కేస్ షీనా సోదరుడు మిఖైల్‌ను హత్య చేసి అందులో దాచి అటవీ ప్రాంతంలో షీనా హత్య చేసిన ప్రాంతంలోనే ఖననం చేసేందుకు సమీకరించారని పోలీసుల అనుమానం.
కాగా, ఆధారాల సేకరణ కోసం షీనా హత్య జరిగిన తీరును తెలుసుకోవడానికి ఈ కేసులో నిందితులైన ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్ రాయ్‌లను ముంబై పోలీసులు ఆదివారం రాయ్‌గఢ్ జిల్లా అడవికి తీసుకెళ్లారు. ఇంద్రాణి, ఖన్నాలు హత్యకు కారణం నువ్వంటే.. నువ్వని పరస్పరం ఆరోపణలకు దిగారని పోలీసులు తెలిపారు.
ఈ హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసులు.. నిందితులైన ఇంద్రాణి ముఖర్జియా, ఆమె రెండో భర్త సంజీవ్ ఖన్నా, ఇంద్రాణి కారు డ్రైవర్ శ్యామ్ రాయ్ లను సోమవారం స్థానిక కోర్టులో హాజరుపర్చనున్నారు.