సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం
Published Tue, Apr 15 2014 11:00 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: లింగమార్పిడి చేయించుకున్నవారిని ‘థర్డ్ జెండర్’గా గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హిజ్రాలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు. అయితే సమాజం కూడా తమను గుర్తిస్తుందా? లేదా? అనే విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేసినా సుప్రీం తీర్పుతో గుర్తిస్తుందనే భరోసా లభించిందన్నారు. ‘సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా తీర్పునివ్వడం ఆనందంగానే ఉంది. అయితే ఈ సమాజకం మమ్మల్ని ‘మూడోశ్రేణి’గా గుర్తిస్తుందా? లేదా? అనే విషయంలోనే కొంత ఆందోళన’ అని షైలా జాన్ అభిప్రాయపడ్డారు. అయితే తమకూ మంచిరోజులు వస్తున్నాయని చెప్పేందుకు పడిన తొలి అడుగు ఇదని, సమాజంలో తమ గురించి అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థలో కూడా మార్పు రావాలని తాము ఆశిస్తున్నామని చెప్పారు.
ట్రాన్స్‌జెండర్లను సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారీగా పరిగణించాలంటూ న్యాయమూర్తులు కె.ఎస్. రాధాకృష్ణన్, ఎ.కె. సిక్రిలతో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకు రిజర్వేషన్లు కల్పించాలని ధర్మాసనం ఆదేశించడంతో తమ ఎన్నోరోజుల కల నెరవేరిందన్నారు. ‘సుప్రీంకోర్టు తీర్పు చాలా గొప్పగా ఉంది. ఇకపై మాకూ మిగతావారితో సమానంగా హక్కులు అనుభవించే అవకాశం వస్తుందంటేనే మనసు ఉప్పొంగుతోంది. అయితే సమాజమే మమ్మల్ని ఎలా ఆమోదిస్తుందనే విషయంలోనే కాస్త ఆందోళన. కార్యాలయాల్లో, బహిరంగ ప్రదేశాల్లో మిగతావారిలాగే మమ్మల్ని స్నేహితులుగా చూస్తారా? లేక వెలివేస్తారా? అనేది రానున్న రోజుల్లో స్పష్టం కానుంద’ని చాందినీ అభిప్రాయపడ్డారు.
Advertisement
Advertisement