సాక్షి, ముంబై: కొద్దిరోజులుగా తీవ్ర ఆందోళనకు గురవుతున్న క్యాంపాకోలా భవన వాసులకు బుధవారం ఉపశమనం లభించింది. అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తుల కూల్చివేతపై సుప్రీంకోర్టు బుధవారం స్టే ఇచ్చింది. 2014 మే 31 దాకా ఎటువంటి చర్యలు చేపట్టొద్దని తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అక్రమ అంతస్తుల కూల్చివేతకు సంబంధించిన వార్తలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. బీఎంసీ తరఫున సీనియర్ న్యాయవాదులు ఫాలి. ఎస్. నారిమన్, పల్లవ్ సిసోడియాలు తమ తమ వాదనలను వినిపించారు. ఆ తర్వాత అటార్నీ జనరల్ వాహనవతి కూడా తన వాదనను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వీరి వాదనలను ఆలకించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జి.ఎస్. సంఘ్వి నేతృ త్వంలోని ధర్మాసనం స్టే విధించడంతోపాటు క్యాంపాకోలా వాసులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వివరణ ఇవ్వాలంటూ బిల్డర్, రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నగరపాలక సంస్థను అత్యున్న త న్యాయస్థానం ఆదేశించింది.
కాగా 1981-89 మధ్యకాలంలో నిర్మించిన క్యాంపాకోలా హౌసింగ్ కాలనీలో ఆరు అంతస్తుల నిర్మాణానికి మాత్రమే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అనుమతి ఇచ్చిన సంగతి విదితమే. కాగా జేసీబీతో ప్రధాన ద్వారం కూల్చిన అనంతరం పోలీసులు, క్యాంపాకోలా వాసుల మధ్య తోపులాటలు మరోవైపు మహిళల రోదనలతో బుధవారం ఉదయం ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్యాంపాకోలా వాసులు బీఎంసీ అధికారులను లోపలికి రాకుండా అడ్డుకునేందుకు ప్రధాన ద్వారాన్ని పూర్తిగా మూసివేయడమే కాకుండా కర్రలుకూడా కట్టారు. అంతేకాకుండా ఆయా ఫ్లాట్లలోని మహిళలు, యువతీ యువకులంతా వీధుల్లోకి వచ్చారు. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో పోలీసులు, క్యాంపాకోలా వాసుల మధ్య తోపులాట జరిగింది. దీంతో పోలీసులు అనేకమందిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు 10.40 గంటల ప్రాంతంలో జే సీబీ సహాయంతో క్యాంపాకోలా భవన సముదాయ ప్రధాన ద్వారాన్ని బీఎంసీ అధికారులు నేలమట్టం చేశారు. దీంతో అనేకమంది మహిళలు ఏమి తప్పు చేశామని తమకు ఈ శిక్ష విధిస్తున్నారంటూ బోరున విలపించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశించినందువల్ల నేలమట్టం చేయక తప్పదంటూ బీఎంసీ అధికారులు లోపలికి చొచ్చుకువెళ్లారు.
అదే సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఈ తతంగమంతా మీడియాద్వారా తిలకి ంచిన సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. అనుమతి లేకుండా నిర్మించిన అంతస్తుల కూల్చివేతపై 2014, మే 31 దాకా స్టే విధించింది. ఈ సమాచారం అందగానే బీఎంసీ సిబ్బంది పనులను నిలిపివేశారు. ఈ విషయం తెలుసుకున్న క్యాంపాకోలా వాసుల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరిసింది.
కొద్దిసేపు భారీ హైడ్రామా
క్యాంపాకోలా హౌసింగ్ కాలనీలో బుధవారం ఉదయం కొద్దిసేపు హైడ్రామా నడిచింది. అక్రమ అంతస్తుల కూల్చివేత కోసం వచ్చిన నగర పాలక సంస్థ అధికారులు పోలీసుల సహాయంతో కాంపౌండ్ లోపలికి ప్రవేశించేందుకు యత్నిం చారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన బాధిత కుటుంబాలు పోలీసు బలగాలతో వాగ్వాదానికి దిగాయి. ఎంతసేపటికీ వినకపోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు క్యాంపాకోలా వాసులను అక్కడి నుంచి నెట్టివేశారు. మహిళల పట్ల దురుసుగా వ్యవహరించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన మహిళలు పోలీసులపై మండిపడ్డారు. తామేమైనా ఉగ్రవాదులమా అంటూ పోలీసులను నిలదీశారు. నగరంలో 55 వేలకు పైగా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటి సంగతి పట్టించుకోకుండా తమను బజారుకీడుస్తారా అంటూ నిలదీశారు.
‘ఆర్చిడ్’లో అనుమతి లేని అంతస్తుల కూల్చివేత
కాగా ఆర్చిడ్ భవనంలో అనుమతి లేని అంతస్తులను బీఎంసీ సిబ్బంది బుధవారం ఉదయం కూల్చివేశారు. వాస్తవానికి 17 అంతస్తులకే నగరపాలక సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే బిల్డర్ 20 అంతస్తులను నిర్మించాడు. దీంతో అనుమతి లేకుండా నిర్మించిన మూడు అంతస్తులను బీఎంసీ సిబ్బంది కూల్చేశారు.
పోలీసుల తీరుపై సీఎంకి ఫిర్యాదు చేస్తా
సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇవ్వడంపై కాంగ్రెస్ నాయకుడు, దక్షిణ ముంబై ఎంపీ మిలింద్ దేవరా హర్షం వ్యక్తం చేశారు. క్యాంపాకోలపట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
ఎంపీ మిలింద్ దేవరా
అదే ప్రాంగణంలో మరో భవననిర్మాణం..?
క్యాంపాకోలా భవన సముదాయంలోని ఖాళీ స్థలంలో మరో భవనం నిర్మించేందుకు ఆస్కారం ఉంది. ఇందుకు క్యాంపాకోలా వాసులంతా బాధిత కుటుంబాలకు ఆ స్థలంలో ఇళ్లు నిర్మించి ఇవ్వవచ్చు. ఈ విషయాన్ని బిల్డర్ సుప్రీంకోర్టుకు తెలియజేసే అవకాశముందని తెలిసింది.
అవధులు లేని ఆనందం
Published Thu, Nov 14 2013 12:42 AM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement