‘సుప్రీం’ ఆదేశాలు...మరణ శాసనమే | 'Supreme' orders ... bequeathal | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ ఆదేశాలు...మరణ శాసనమే

Published Wed, Sep 7 2016 2:15 AM | Last Updated on Thu, Sep 27 2018 8:27 PM

‘సుప్రీం’ ఆదేశాలు...మరణ శాసనమే - Sakshi

‘సుప్రీం’ ఆదేశాలు...మరణ శాసనమే

భగ్గుమన్న కర్ణాటక
మండ్య బంద్ విజయవంతం
కేఆర్‌ఎస్ వద్ద నిషేధాజ్ఞలు
బెంగళూరు-మైసూరు,
బెంగళూరు-చెన్నై బస్ సర్వీసులు నిలిపివేత = 9న కర్ణాటక బంద్‌కు పిలుపు

 

బెంగళూరు: కావేరి నదీ జలాల వివాదం మరో సారి రాష్ట్రంలో భగ్గుమంది. కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేసేలా ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కావేరి నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ద్విసభ్య పీఠం విచారణను జరిపింది. ఇక సోమవారం ఇరు రాష్ట్రాల వాదనలను విన్న ధర్మాసనం రోజుకు 15 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు కావేరి నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందిగా కర్ణాటకను ఆదేశించింది. తమిళనాడులో తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నారని అందువల్ల, కావేరి నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు మండ్య, మైసూరు, హాసన్, హుబ్లీ, తుమకూరు, చామరాజన గర  ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి.

సుప్రీంకోర్టు ఆదేశాలు కర్ణాటకలోని రైతుల పాలిట మరణశాసన మంటూ మండిపడ్డాయి. ఇక మండ్య ప్రాంతంలోని వివిధ కన్నడ సంఘాలు మంగళవారం మండ్య బంద్ నిర్వహించాయి. ఈ బంద్‌లో కన్నడ సంఘాలతో పాటు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన డంతో బంద్ విజయవంతమైంది. మంగళవారం ఉదయం నుంచే మండ్య నగరంలోని రోడ్ల పైకి చేరుకున్న ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు, ప్రజా ప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండ్య ప్రాంతంలో ఎమ్మెల్యే అంబరీష్ కటౌట్‌లను నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇదే సందర్భంలో మండ్య మాజీ ఎంపీ రమ్యపై సైతం నిరసనకారులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారు. మండ్య రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రాంత ప్రజాప్రతినిధులు ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం శోచనీయమంటూ నిరసనకారులు నినదించారు. ఇక ఇదే సందర్భంలో మండ్యలో నిరసనలు తీవ్రమవడంతో పాటు బంద్ పాటించిన నేపథ్యంలో బెంగళూరు నుంచి మైసూరు వెళ్లాల్సిన బస్ సర్వీసులన్నీ రద్దయ్యాయి. ఇదే సందర్భంలో బెంగళూరు-చెన్నై సర్వీసులను కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేఎస్‌ఆర్‌టీసీ రద్దు చేసింది. అంతేకాక తమిళనాడు నుంచి బెంగళూరుకు వచ్చే సర్వీసులను తమిళనాడు రోడ్డు రవాణా సంస్థ రద్దు చేయడంతో బెంగళూరు నుంచి చెన్నైతో పాటు తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

 
విధానసౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రత...

ఇక బెంగళూరులోని వివిధ కన్నడ సంఘాలు విధానసౌధ వద్ద నిరసన కార్యక్రమాలకు దిగుతున్న నేపథ్యంలో విధానసౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. విధానసౌధ వద్ద అదనపు బలగాలను మోహరించారు. ఒక డీసీపీ, ఒక ఏసీపీ, ఆరుగురు ఇన్‌స్పెక్టర్‌లు, 80 మంది కానిస్టేబుళ్లతో పాటు అదనపు బలగాలను విధానసౌధ భద్రత కోసం మోహరించారు. ఇక సీఎం అధికారిక నివాసం ‘కావేరి’ని సైతం కర్ణాటక రక్షణా వేదిక (కరవే) మహిళా కార్యకర్తలు ముట్టడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయరాదంటూ నినదించారు. సీఎం నివాసం ఎదుట ధర్నాకు దిగిన వారికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 
ఈనెల 9న కర్ణాటక బంద్...

సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ కన్నడ సంఘాలన్నీ బంద్ నిర్వహించ తలపెట్టాయి. ఈనెల 9న కర్ణాటక బంద్‌కు కన్నడ సంఘాలు పిలుపునిచ్చాయి. కన్నడ ఒక్కూటతో పాటు దాదాపు 800కు పైగా కన్నడ సంఘాలు బంద్‌లో పాల్గొననున్నాయి. ఇక ఈ బంద్‌కు రాష్ట్రంలోని వివిధ సంఘాలతో పాటు రాజకీయ పార్టీలు సైతం ఈ బంద్‌కు మద్దతు తెలపనున్నాయి. ఇక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని థియేటర్లలో తమిళ చిత్రాల ప్రదర్శనను సైతం రద్దు చేశారు.

 

కేఆర్‌ఎస్ వద్ద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు...
కావేరి నదీ జలాల విషయమై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కృష్ణరాజసాగర రిజర్వాయర్ (కేఆర్‌ఎస్) వద్ద నిషేధాజ్ఞలను జారీ చేశారు. తమిళనాడుకు నీటిని విడుదల చేస్తే కేఆర్‌ఎస్‌ను ముట్టడిస్తామంటూ కన్నడ సంఘాలు హెచ్చరించిన నేపథ్యంలో మండ్య జిల్లా అధికారులు కేఆర్‌ఎస్ వద్ద మూడు రోజుల పాటు నిషేధాజ్ఞలు జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement