పాక్తో యుద్ధం వస్తే...
న్యూఢిల్లీ: ఉడి ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లక్షిత దాడులతో ముష్కరులను మట్టుబెట్టడం వరకు బాగానే ఉంది. కానీ ఈ దాడుల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఒకవేళ భారత్- పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం వస్తే పరిస్థితి ఏమిటి? ఎలాంటి పరిణామాలు సంభవిస్తా యనే దానిపై అనేక అధ్యయనాలు జరిగాయి. వాటి ప్రకారం...
⇔ రెండు దేశాలు ఒక్కొక్కటి 15 కిలోటన్నుల హిరోషిమా అణుబాంబుతో సమానమైన దాదాపు 100 అణ్వస్త్రాలను ప్రయోగిస్తే ఈ భూగోళాన్ని సంరక్షిస్తున్న ఓజోన్ పొరలో సగం నాశనమైపోతుంది. అదే జరిగితే అణు శీతాకాలం వచ్చి రుతుపవనాలను దెబ్బతీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం నాశనమైపోతుంది.
⇔ అణు బాంబులను ప్రయోగిస్తే రెండుదేశాలలో కలిపి మొదటి వారంలో 2.1 కోట్ల మంది మరణిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్యలో ఇది సగం. గాయాలు, విపరీతమైన రేడియోధార్మికత ప్రభావానికి లోనయ్యే వారి సంఖ్య దీనికి అదనం.
⇔ అణుయుద్ధం జరిగితే వచ్చే వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది జనాభా ఆకలితో అలమటిస్తారని అంచనా.
పాకిస్తాన్ అణు క్షిపణుల సామర్థ్యం
పాకిస్తాన్ వద్ద 130 వరకు అణు వార్‌హెడ్స్ ఉన్నాయని అంచనా. పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వస్త్ర సహిత మధ్య శ్రేణి హతాఫ్ క్షిపణులతో భారత్‌లోని నాలుగు ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలను గురిపెట్టగలదని అంచనా. అలాగే ఘోరి క్షిపణులు 1,300 కి.మీ దూరాలను చేరుకోగలవు. అంటే ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, పునె, నాగపూర్, భోపాల్, లక్నోలు దాని రేంజ్‌లో ఉంటాయి. షహీన్ 2 రకం క్షిపణులు 2,500 కి.మీ లక్ష్యాలను ఛేదించగలవు. స్వల్ప శ్రేణి ఘజ్నవి క్షిపణులు 270 నుంచి 350 కి.మీల దూరాలలోని లక్ష్యాలను చేరుకోగలవు. అంటే లూధియానా, అహ్మదాబాద్, ఢిల్లీ శివార్లన్న మాట. ఇంకా షహీన్ 1 క్షిపణుల రేంజ్ 750 కి.మీలు. ఇవి లూథియానా, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్‌లను చేరుకోగలవు.
భారత్ అణ్వస్త్ర సామర్థ్యం...
భారత్ వద్ద పృధ్వి, అగ్ని అణు క్షిపణులున్నాయి. ఐఎన్‌ఎస్ అరిహంత్ సబ్‌మెరైన్ నుంచి కె-15 సాగరిక క్షిపణులను ప్రయోగించగలదు. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, నౌషెరాలోని సైనిక ప్రధాన కార్యాలయం సహా పాకిస్తాన్‌లోని ఏభాగాన్నైనా ఛేదించగలిగిన సామర్థ్యం గలిగినవి. అణువార్‌హెడ్‌లతో కూడిన పృథ్వి క్షిపణులు పాకిస్తాన్‌లోని లాహోర్, సియాల్‌కోట్, ఇస్లామాబాద్, రావల్పిండిని ఛేధించగలవు. అగ్ని క్షిపణులు 2,000 కి.మీ దూరాలను చేరుకోగలవు. ఇవి లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, ముల్తాన్, కరాచీ, క్వెట్టా, గ్వదర్‌లను ఛేదించగలవు.