భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద జరిగిన చిన్న ఘర్షణలు తారస్థాయికి చేరుకోవడంతో 1965లో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధాన్నే రెండవ కశ్మీర్ యుద్ధం అని కూడా అంటారు. మొదటి కశ్మీర్ యుద్ధం 1947లో జరిగింది. పాకిస్తాన్ తలపెట్టిన ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ ఈ రెండో యుద్ధానికి మూల కారణం. ఆ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీరులోకి తీవ్రవాదులను చొప్పించడం. ఐదు వారాల పాటు జరిగిన ఆ యుద్ధంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగిసింది.
ఈ యుద్దం చాలా వరకు నేల మీదే జరిగింది. కశ్మీరులో భారీ ఎత్తున బలగాలను మొహరించారు. వాయు, నావికా దళాల నుంచీ కూడా అవసరమైన సహకారం అందింది. అన్ని భారత్–పాక్ యుద్దాల లాగే ఈ యుద్ధానికి సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగులోకి రాలేదు. యుద్ధానికి కారణంగా కొన్ని పూర్వపు ఘర్షణలు కూడా ఉన్నాయి. 1947లో భారతదేశ విభజన జరిగినప్పటి నుండి భారత్‌పైకి పాక్ కాలు దువ్వుతూనే ఉంది. కశ్మీరు ప్రధాన సమస్య అయినప్పటికీ, ఇతర సరిహద్దు తగాదాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది గుజరాత్ రాష్ట్రంలోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం.
1965 మార్చి 20న, ఆ తర్వాత ఏప్రిల్‌లో పాకిస్థాన్ కావాలని రెచ్చగొట్టడంతో ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలో ఆ ఘర్షణలు ఇరు దేశాల సరిహద్దు పోలీసుల మధ్యే జరిగినప్పటికీ, అనతికాలంలోనే సైనిక దళాలు రంగంలోకి దిగాయి. 1965 జూన్‌లో బ్రిటిష్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్ ఇరుదేశాలను తమ శత్రుభావనలను ఆపాల్సిందిగా ఒప్పించి, వివాద పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. 1968లో వచ్చిన ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్ కి 900 చ.కి.మీ. దక్కింది. పాకిస్తాన్ మాత్రం 9,100 చ.కి.మీ. తన భాగంగా పేర్కొంది.
రాణ్ ఆఫ్ కచ్ లో పాక్ వచ్చిన సత్ఫలితాల తరువాత, 1962లో చైనాతో యుద్ధం వల్ల నష్టపోయిన భారత సైన్యం.. కశ్మీరులో తాము మెరుపుదాడి చేస్తే తనను తాను కాపాడుకోలేదని జనరల్ ఆయుబ్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ భావించింది. కశ్మీర్ ప్రజలు భారత పాలనతో విసిగిపోయారని పాకిస్తాన్ నమ్మింది. అందువల్ల చొరబాటుదారులతో ఏదైనా తిరుగుబాటు మొదలుపెట్టించి తనకు అనుకూల ఫలితాలు రాబట్టవచ్చనుకుంది. దీనికే ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే కోడ్ నేమ్ పెట్టుకుంది. కానీ స్థానిక కశ్మీరీలు పాకిస్తాన్ చొరబాటుదారుల వివరాలను భారత అధికారులకు అందించారు. దీంతో చొరబాటుదారులను వెంటనే కనిపెట్టడంతో వారి ఆపరేషన్ పూర్తిగా విఫలమయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment