Indo-Pakistan war
-
స్వతంత్ర భారతి: రెండవ కశ్మీర్ యుద్ధం
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల వద్ద జరిగిన చిన్న ఘర్షణలు తారస్థాయికి చేరుకోవడంతో 1965లో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధాన్నే రెండవ కశ్మీర్ యుద్ధం అని కూడా అంటారు. మొదటి కశ్మీర్ యుద్ధం 1947లో జరిగింది. పాకిస్తాన్ తలపెట్టిన ‘ఆపరేషన్ జిబ్రాల్టర్’ ఈ రెండో యుద్ధానికి మూల కారణం. ఆ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశం భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీరులోకి తీవ్రవాదులను చొప్పించడం. ఐదు వారాల పాటు జరిగిన ఆ యుద్ధంలో ఇరు వైపుల వేలాది మంది సైనికులు చనిపోయారు. చివరికి ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన కాల్పుల విరమణ ఒప్పందంతో యుద్ధం ముగిసింది. ఈ యుద్దం చాలా వరకు నేల మీదే జరిగింది. కశ్మీరులో భారీ ఎత్తున బలగాలను మొహరించారు. వాయు, నావికా దళాల నుంచీ కూడా అవసరమైన సహకారం అందింది. అన్ని భారత్–పాక్ యుద్దాల లాగే ఈ యుద్ధానికి సంబంధించి కూడా చాలా విషయాలు వెలుగులోకి రాలేదు. యుద్ధానికి కారణంగా కొన్ని పూర్వపు ఘర్షణలు కూడా ఉన్నాయి. 1947లో భారతదేశ విభజన జరిగినప్పటి నుండి భారత్‌పైకి పాక్ కాలు దువ్వుతూనే ఉంది. కశ్మీరు ప్రధాన సమస్య అయినప్పటికీ, ఇతర సరిహద్దు తగాదాలు కూడా ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది గుజరాత్ రాష్ట్రంలోని రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతం. 1965 మార్చి 20న, ఆ తర్వాత ఏప్రిల్‌లో పాకిస్థాన్ కావాలని రెచ్చగొట్టడంతో ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ప్రారంభంలో ఆ ఘర్షణలు ఇరు దేశాల సరిహద్దు పోలీసుల మధ్యే జరిగినప్పటికీ, అనతికాలంలోనే సైనిక దళాలు రంగంలోకి దిగాయి. 1965 జూన్‌లో బ్రిటిష్ ప్రధానమంత్రి హెరాల్డ్ విల్సన్ ఇరుదేశాలను తమ శత్రుభావనలను ఆపాల్సిందిగా ఒప్పించి, వివాద పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. 1968లో వచ్చిన ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్ కి 900 చ.కి.మీ. దక్కింది. పాకిస్తాన్ మాత్రం 9,100 చ.కి.మీ. తన భాగంగా పేర్కొంది. రాణ్ ఆఫ్ కచ్ లో పాక్ వచ్చిన సత్ఫలితాల తరువాత, 1962లో చైనాతో యుద్ధం వల్ల నష్టపోయిన భారత సైన్యం.. కశ్మీరులో తాము మెరుపుదాడి చేస్తే తనను తాను కాపాడుకోలేదని జనరల్ ఆయుబ్ ఖాన్ నాయకత్వంలోని పాకిస్థాన్ భావించింది. కశ్మీర్ ప్రజలు భారత పాలనతో విసిగిపోయారని పాకిస్తాన్ నమ్మింది. అందువల్ల చొరబాటుదారులతో ఏదైనా తిరుగుబాటు మొదలుపెట్టించి తనకు అనుకూల ఫలితాలు రాబట్టవచ్చనుకుంది. దీనికే ఆపరేషన్ జిబ్రాల్టర్ అనే కోడ్ నేమ్ పెట్టుకుంది. కానీ స్థానిక కశ్మీరీలు పాకిస్తాన్ చొరబాటుదారుల వివరాలను భారత అధికారులకు అందించారు. దీంతో చొరబాటుదారులను వెంటనే కనిపెట్టడంతో వారి ఆపరేషన్ పూర్తిగా విఫలమయ్యింది. -
సామాజిక కార్యకర్త
1971లో జరిగిన భారత్–పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న హిందీ చిత్రం ‘భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగన్, సంజయ్ దత్, సోనాక్షీ సిన్హా, షరద్ కేల్కర్, ప్రణీతా సుభాష్ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. యుద్ధం సమయంలో గుజరాత్‌లోని భూజ్ అనే ఎయిర్పోర్ట్ ధ్వంసమైంది. అప్పటి ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్ విజయ్ కార్నిక్ అక్కడి స్థానిక మహిళల సాయంతో పాడైపోయిన ఆ ఎయిర్‌పోర్ట్‌ను బాగు చేసి, భారత సైన్యం వినియోగించుకునేలా చేశారు. ఈ స్థానిక మహిళలకు నేతృత్వం వహించారు సుందర్బెన్ జెతా మదర్పార్య. ఈ సుందర్బెన్ పాత్రలోనే నటించారు సోనాక్షీ సిన్హా. సినిమాలోని ఆమె లుక్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘‘భారత సైన్యానికి సాయపడేందుకు 299 మంది మహిళలను తనతో తీసుకువెళ్లిన ధైర్యవంతురాలైన సామాజిక కార్యకర్త సుందర్ బెన్ పాత్రలో సోనాక్షి నటించారు. చరిత్రలోని ఓ అద్భుత సంఘటన వెండితెరపై ఆవిష్కృతం కానుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ చిత్రం ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల కానుంది. అభిషేక్ దు«ధయ్యా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. -
పాక్‌తో యుద్ధం వస్తే...
న్యూఢిల్లీ: ఉడి ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లక్షిత దాడులతో ముష్కరులను మట్టుబెట్టడం వరకు బాగానే ఉంది. కానీ ఈ దాడుల ప్రభావం ఎలా ఉండబోతోంది? ఒకవేళ భారత్- పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తే పరిస్థితి ఏమిటి? ఎలాంటి పరిణామాలు సంభవిస్తా యనే దానిపై అనేక అధ్యయనాలు జరిగాయి. వాటి ప్రకారం... ⇔ రెండు దేశాలు ఒక్కొక్కటి 15 కిలోటన్నుల హిరోషిమా అణుబాంబుతో సమానమైన దాదాపు 100 అణ్వస్త్రాలను ప్రయోగిస్తే ఈ భూగోళాన్ని సంరక్షిస్తున్న ఓజోన్ పొరలో సగం నాశనమైపోతుంది. అదే జరిగితే అణు శీతాకాలం వచ్చి రుతుపవనాలను దెబ్బతీస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం నాశనమైపోతుంది. ⇔ అణు బాంబులను ప్రయోగిస్తే రెండుదేశాలలో కలిపి మొదటి వారంలో 2.1 కోట్ల మంది మరణిస్తారు. రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారి సంఖ్యలో ఇది సగం. గాయాలు, విపరీతమైన రేడియోధార్మికత ప్రభావానికి లోనయ్యే వారి సంఖ్య దీనికి అదనం. ⇔ అణుయుద్ధం జరిగితే వచ్చే వాతావరణ మార్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది జనాభా ఆకలితో అలమటిస్తారని అంచనా. పాకిస్తాన్ అణు క్షిపణుల సామర్థ్యం పాకిస్తాన్ వద్ద 130 వరకు అణు వార్‌హెడ్స్ ఉన్నాయని అంచనా. పాకిస్థాన్ వద్ద ఉన్న అణ్వస్త్ర సహిత మధ్య శ్రేణి హతాఫ్ క్షిపణులతో భారత్‌లోని నాలుగు ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నైలను గురిపెట్టగలదని అంచనా. అలాగే ఘోరి క్షిపణులు 1,300 కి.మీ దూరాలను చేరుకోగలవు. అంటే ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, పునె, నాగపూర్, భోపాల్, లక్నోలు దాని రేంజ్లో ఉంటాయి. షహీన్ 2 రకం క్షిపణులు 2,500 కి.మీ లక్ష్యాలను ఛేదించగలవు. స్వల్ప శ్రేణి ఘజ్నవి క్షిపణులు 270 నుంచి 350 కి.మీల దూరాలలోని లక్ష్యాలను చేరుకోగలవు. అంటే లూధియానా, అహ్మదాబాద్, ఢిల్లీ శివార్లన్న మాట. ఇంకా షహీన్ 1 క్షిపణుల రేంజ్ 750 కి.మీలు. ఇవి లూథియానా, ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్‌లను చేరుకోగలవు. భారత్ అణ్వస్త్ర సామర్థ్యం... భారత్ వద్ద పృధ్వి, అగ్ని అణు క్షిపణులున్నాయి. ఐఎన్ఎస్ అరిహంత్ సబ్‌మెరైన్ నుంచి కె-15 సాగరిక క్షిపణులను ప్రయోగించగలదు. ఇస్లామాబాద్, రావల్పిండి, లాహోర్, కరాచీ, నౌషెరాలోని సైనిక ప్రధాన కార్యాలయం సహా పాకిస్తాన్‌లోని ఏభాగాన్నైనా ఛేదించగలిగిన సామర్థ్యం గలిగినవి. అణువార్హెడ్లతో కూడిన పృథ్వి క్షిపణులు పాకిస్తాన్‌లోని లాహోర్, సియాల్కోట్, ఇస్లామాబాద్, రావల్పిండిని ఛేధించగలవు. అగ్ని క్షిపణులు 2,000 కి.మీ దూరాలను చేరుకోగలవు. ఇవి లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, పెషావర్, ముల్తాన్, కరాచీ, క్వెట్టా, గ్వదర్లను ఛేదించగలవు.