మాణిక్‌రావ్‌పై వేటు!?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను పదవి నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో దీనిపై ఢిల్లీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేసే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పదవిని ఆశిస్తున్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటి నుంచే పైరవీలు చేయడం ప్రారంభించారు. రాష్ట్రంలో ఏప్రిల్, మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, అనంతరం అక్టోబర్‌లో జరిగిన శాసన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీని ప్రక్షాళన చేయాలని అధిష్టానం అప్పుడే నిర్ణయం తీసుకుంది. ఓటమికి గల ప్రధాన కారణమైన (కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మినహా) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను మార్చాలని ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
అందులో మహారాష్ట్ర కూడా ఉంది. దీంతో ఈ పదవిలో కొనసాగుతున్న మాణిక్‌రావ్ ఠాక్రేపై కూడా వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ, శాసన సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను మార్చాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో మాణిక్‌రావ్ ఠాక్రే అదనంగా మరో రెండు, మూడు నెలలు ఈ పదవిలో కొనసాగే అవకాశం లభించింది. కాని ఇప్పుడు తప్పేటట్టు లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులను మార్చివేసే ప్రక్రియ ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించింది. త్వరలో మహారాష్ట్ర వంతు కూడా రానుంది. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకాగానే ప్రదేశ్ అధ్యక్షున్ని మార్చాలనే అంశం తెరమీదకు వచ్చింది.
శాసన సభ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రావాలంటే ఠాక్రేను మార్చాలని కొందరు ఠాక్రే వ్యతిరేకులు డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని నాయకులు ఢిల్లీ అధిస్టానానికి లేఖలు పంపించారు. కాని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎలాంటి మార్పులు చేయకుండా శాసన సభ ఎన్నికల ముందుకు వెళ్లారు. చివరకు ఊహించిందే జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ అధిష్టానం ద్వారా ఈ అంశం మళ్లీ తెరమీదకు రావడంతో ఆ పదవిని ఆశిస్తున్న నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై ఇంతవరకు ఎవరి పేరు తెరమీదకు రాకపోయినా ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.