Maharashtra Pradesh Congress Committee
-
ఎంపీసీసీ అధ్యక్షుడిగా అశోక్ చవాన్
- లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పాత్ర - కార్పొరేషన్ విజయంలోనూ ముఖ్య భూమిక - సరైన వ్యక్తిగా భావించిన అధిష్టానం - ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగా సంజయ్ నిరుపం సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షునిగా మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఎంపికయ్యారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ఏఐసీసీ మహారాష్ట్రలో పార్టీ ప్రక్షాళన చేయాలని భావిస్తున్న అధిష్టానం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఎంపీసీసీ అధ్యక్షునిగా అనేక మంది పేర్లు ముందుకు వచ్చినప్పటికీ ఇటీవలి అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు కాపాడిన అశోక్ చవాన్‌కు పట్టం కట్టాలని భావించింది. మరోవైపు ఉత్తర భారతీయ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ముంబై కాంగ్రెస్ అధ్యక్షునిగా కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సంజయ్ నిరూపంను ఎంపిక చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో చవాన్ కీలక పాత్ర అనేక సంవత్సరాలుగా పెట్టని కోటగా ఉన్న మహారాష్ట్ర కాంగ్రెస్‌కు ఇటీవలి ఎన్నికల్లో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ హవా కొనసాగడంతో లోకసభ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. మరాఠ్వాడా, నాందేడ్ జిల్లాలో అశోక్ చవాన్‌కు ఉన్న గుర్తింపు, చేసిన అభివృద్ధి పనుల ద్వారా ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. లోకసభ ఎన్నికలకు ముందు 2012 అక్టోబరులో జరిగిన నాందేడ్ - వాఘాలా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన సత్తా చాటారు. కార్పొరేషన్ అవతరించిన తర్వాత మొదటి ఎన్నికలు మినహా వరుసగా మూడు సార్లు కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన చవాన్ మోదీ హవాను తట్టుకొని విజయం సాధించారు. మరో పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయంలో కీలక పాత్ర పోషించారు. చవాన్‌ను సమర్థుడిగాభావించిన అధిష్టానం కాగా కొంత కాలంగా ఎంపీసీసీ, ముంబై రీజినల్ కాంగ్రెస్ కమిటీ (ఎమ్మార్సీసీ) ప్రక్షాళన చేయాలని చూస్తున్న అధిష్టానం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఆదర్శ్ కుంభకోణం, పెయిడ్ న్యూస్ ఆరోపణలతో వివాదాల్లోకెక్కిన చవాన్‌కు ఎంపీసీసీ పగ్గాలు ఇవ్వడానికి తర్జనభర్జన పడిన అధిష్టానం ఎట్టకేలకు చవాన్‌కు అధికారం అప్పగించాలని నిర్ణయించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన శంకర్రావ్చవాన్ నుంచి రాజకీయ వారసత్వం పొందిన ఆయన కుమారుడు అశోక్ చవాన్ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఎన్సీపీ, బీజేపీ, శివసేనను ఎదుర్కొనేందుకు చవాన్ సమర్థుడని అధిష్టానం భావించింది. కాగా, ముంబై కాంగ్రెస్ అధ్యక్షునిగా సంజయ్ నిరుపంకు పార్టీ పగ్గాలు కట్టబెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మరాఠీ ఓటర్లు, శివసేన, ఎమ్మెన్నెస్‌ల మద్య చీలిపోయే అవకాశముండటంతో ఉత్తరభారతీయుల ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉత్తర భారతీయుడైన సంజయ్ నిరూపం సరైన వాడని భావించింది. -
మాణిక్‌రావ్‌పై వేటు!?
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేను పదవి నుంచి తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో దీనిపై ఢిల్లీ అధిష్టానం అధికారికంగా ప్రకటన చేసే సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ పదవిని ఆశిస్తున్న కొందరు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఇప్పటి నుంచే పైరవీలు చేయడం ప్రారంభించారు. రాష్ట్రంలో ఏప్రిల్, మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలు, అనంతరం అక్టోబర్‌లో జరిగిన శాసన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పార్టీని ప్రక్షాళన చేయాలని అధిష్టానం అప్పుడే నిర్ణయం తీసుకుంది. ఓటమికి గల ప్రధాన కారణమైన (కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు మినహా) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను మార్చాలని ఢిల్లీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో మహారాష్ట్ర కూడా ఉంది. దీంతో ఈ పదవిలో కొనసాగుతున్న మాణిక్‌రావ్ ఠాక్రేపై కూడా వేటు పడే సూచనలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ, శాసన సభ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను మార్చాలని అప్పుడే నిర్ణయం తీసుకున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో మాణిక్‌రావ్ ఠాక్రే అదనంగా మరో రెండు, మూడు నెలలు ఈ పదవిలో కొనసాగే అవకాశం లభించింది. కాని ఇప్పుడు తప్పేటట్టు లేదు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులను మార్చివేసే ప్రక్రియ ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించింది. త్వరలో మహారాష్ట్ర వంతు కూడా రానుంది. ఇదిలా ఉండగా, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురుకాగానే ప్రదేశ్ అధ్యక్షున్ని మార్చాలనే అంశం తెరమీదకు వచ్చింది. శాసన సభ ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా రావాలంటే ఠాక్రేను మార్చాలని కొందరు ఠాక్రే వ్యతిరేకులు డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియ ఎన్నికలకు ముందే పూర్తి చేయాలని నాయకులు ఢిల్లీ అధిస్టానానికి లేఖలు పంపించారు. కాని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎలాంటి మార్పులు చేయకుండా శాసన సభ ఎన్నికల ముందుకు వెళ్లారు. చివరకు ఊహించిందే జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ అధిష్టానం ద్వారా ఈ అంశం మళ్లీ తెరమీదకు రావడంతో ఆ పదవిని ఆశిస్తున్న నాయకులు తమ పలుకుబడిని ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ పదవిలో ఎవరిని నియమించాలనే దానిపై ఇంతవరకు ఎవరి పేరు తెరమీదకు రాకపోయినా ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. -
‘ఈవీఎం’ల వల్లే ఓడిపోయాం..
ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ముంబై: శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక శాతం సీట్లు రావడానికి మోడీ హవా కారణం కాదని, యాంత్రిక లోపలున్న ఈవీఎంలను అమర్చడమే అందుకు ప్రధాన కారణమని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) మాజీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత అందుకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఎంపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ప్రతులను పార్టీ నేత సోనియాగాంధీకి పంపారు. అయితే వాటిని అధిష్టానం ఇంతవరకు ఆమోదించలేదు. కాగా, శనివారం సాయంత్రం మాణిక్‌రావ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈవీఎంలు మొరాయించినట్లు బరిలో దిగిన అభ్యర్థుల నుంచి తమ అనేక ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఏయే నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌కు 90 శాతం ఓట్లు పడాల్సి ఉందో, ఆయా చోట్ల కేవలం మూడు లేదా నాలుగు శాతం మాత్రమే పోలయ్యాయని ఆరోపిం చారు. దీనిపై విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ కమిటీ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. పోటీచేసిన అభ్యర్థులు వ్యక్తిగతంగా ఫిర్యాదు చేస్తారన్నారు. కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుల సమావే శం ఈ నెల 28న ఢిల్లీలో జరగనుంది.అక్కడ ఎన్నికల్లో పరాజయం కావడానికి గల కారణాలు, విశ్లేషణలు, ఇతర అంశాలపై చర్చలు జరుగుతాయని వివరించారు. ‘15 యేళ్ల నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం.. అనేక అభివృద్థి కార్యక్రమాలు చేపట్టాం.. దీంతో ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు వస్తాయనే ధీమాతో ఉన్నాం.. అయినప్పటికీ పరిస్థితులు తారుమారయ్యాయి.. బీజేపీ తమకు వ్యతిరేకంగా ప్రజలకు మాయమాటలు చెప్పి వారి వైపు లాక్కుంది..’ అని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో పార్టీపై తిరుగుబాటు చేసినవారిని తిరిగి పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ లేదా శివసేన పార్టీలకు కాంగ్రెస్‌కు చెందిన ఒక్క ఎమ్మెల్యే కూడా మద్దతు ఇవ్వరని స్పష్టం చేశారు. -
పంచాయితీ ఢిల్లీకి..
సాక్షి, ముంబై: కొంతకాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణేను బుజ్జగించేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వర్షా బంగ్లాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు రెండు గంటలపాటు చర్చలు జరిగాయి. ఈ సమావేశానికి రాణే, చవాన్‌తోపాటు మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే, మరికొందరు సీనియర్ నాయకులు హాజరయ్యారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని రాణే ఈ సందర్భంగా పట్టుబట్టినట్లు తెలిసింది. రాజీనామాను ఉపసంహరించుకొని, తమతోపాటు పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాలని చవాన్, ఠాక్రే విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. తనను సంతృప్తి పరిచేందుకు చవాన్ కూడా ఎలాంటి హామీ ఇవ్వలేదని రాణే స్పష్టం చేశారు. దీంతో ఎటువంటి పరిష్కారం లేకుండానే సమావేశం ముగిసింది. మంగళవారం నాటిచర్చల సారాంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతామని ముఖ్యమంత్రి చవాన్ స్పష్టం చేశారు. రెండు, మూడు రోజుల్లో తనతోపాటు రాణే, ఠాక్రే ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీతో భేటీ అవుతామని ప్రకటించారు. ఆమె ఆపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నట్లు సమావేశం అనంతరం చవాన్ వెల్లడించారు. సోనియాగాంధీ దృష్టికి రాణే డిమాండ్లను తీసుకెళ తామని అన్నారు. ఈ సమావేశంలో రాణే రాజీనామా అంశంతోపాటు వచ్చే శాసనసభ ఎన్నికల విషయంపైనా చర్చించినట్లు చవాన్ తెలిపారు. ఇదిలా ఉండగా సోనియాతో భేటీ అనంతరం రాణే ఎంత వరకు శాంతిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. మీకు ఎంపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే సమస్యకు పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నారా అన్న విలేకరుల ప్రశ్నకు రాణే బదులిస్తూ ‘నాకు అలాంటి అవకాశం ఇస్తామని ఎవరూ చెప్పలేదు. నేను లేవనెత్తిన అంశాలకు పరిష్కారం చూపిస్తే రాజీనామా ఉపసంహరణ గురించి ఆలోచిస్తానని చెప్పాను’ అని వివరించారు. ఈ సందర్భంగా చవాన్ మీడియాతో మాట్లాడుతూ చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని అన్నారు. 2005లో శివసేనను వీడిన రాణే కాంగ్రెస్‌లో చేరడం తెలిసిందే. తమ పార్టీలోకి వచ్చిన ఆరు నెలల్లోపు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికీ ఆ పని చేయకపోవంతో ఆగ్రహానికి గురైన రాణే రాజీనామా బాట పట్టారని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
మరింత పుంజుకున్నాం : ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే
నాగపూర్: తమ పార్టీ కొంతమేర పుంజుకుందని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సాంగ్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్సీపీ అధికారంలో ఉందని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. భోర్ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం తమ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, తమ భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీని ఓడించామన్నారు. ఇక పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా ఎన్సీపీని నాలుగో స్థానంలో నెట్టేశామన్నారు. ఈ నెలాఖరులో జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయని, ప్రస్తుతం దానిపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. జల్గావ్లో బాగానే పనిచేస్తున్నప్పటికీ అక్కడి కార్పొరేషన్లో తమ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదన్నారు. బలాబలాల ఆధారంగానే... వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో కలసి బరిలోకి దిగుతారా అని మీడియా ప్రశ్నించగా ఆయా ప్రాంతాల్లో బలాబలాలను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంకా అప్పటి రాజకీయ పరిస్థితులు, ఆయా అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అయితే ఎన్నికల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందన్నారు. విదర్భపై మౌనం ప్రత్యేక విదర్భ రాష్ట్ర అంశంపై మీడియా ప్రశ్నించగా ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే ఏమాత్రం స్పందించలేదు. మౌనం వహించారు. -
మరింత పుంజుకున్నాం : ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే
నాగపూర్: తమ పార్టీ కొంతమేర పుంజుకుందని ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే పేర్కొన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సాంగ్లి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్సీపీ అధికారంలో ఉందని, అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. భోర్ మున్సిపల్ కార్పొరేషన్లో సైతం తమ పార్టీ విజయకేతనం ఎగురవేసిందని, తమ భాగస్వామ్యపక్షమైన ఎన్సీపీని ఓడించామన్నారు. ఇక పుణే మున్సిపల్ కార్పొరేషన్ (పీఎంసీ)కి జరిగిన ఎన్నికల్లో ఎమ్మెన్నెస్ స్థానాన్ని దక్కించుకోవడమే కాకుండా ఎన్సీపీని నాలుగో స్థానంలో నెట్టేశామన్నారు. ఈ నెలాఖరులో జల్గావ్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయని, ప్రస్తుతం దానిపై తమ పార్టీ దృష్టి పెట్టిందన్నారు. జల్గావ్లో బాగానే పనిచేస్తున్నప్పటికీ అక్కడి కార్పొరేషన్లో తమ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదన్నారు. బలాబలాల ఆధారంగానే... వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీతో కలసి బరిలోకి దిగుతారా అని మీడియా ప్రశ్నించగా ఆయా ప్రాంతాల్లో బలాబలాలను ఆధారంగా చేసుకుని ముందుకు సాగుతామన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ విషయంలో పార్టీ అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఇంకా అప్పటి రాజకీయ పరిస్థితులు, ఆయా అభ్యర్థుల బలాబలాలు తదితర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు. అయితే ఎన్నికల గురించి మాట్లాడడం తొందరపాటే అవుతుందన్నారు. విదర్భపై మౌనం ప్రత్యేక విదర్భ రాష్ట్ర అంశంపై మీడియా ప్రశ్నించగా ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్‌ఠాక్రే ఏమాత్రం స్పందించలేదు. మౌనం వహించారు.